ఇంతకు ముందు ఇడ్లీ, దోశ పిండి చేసుకోవాలంటే ఒక ఆరు గంటల పాటు మినపప్పు ఇడ్లీ రవ్వ లేదా బియ్యం నానబెట్టి తర్వాత వాటిని మిక్సీ వేసుకుని ఆ పిండిని రాత్రంతా పులియబెట్టి తెల్లారే వండుకునే వాళ్ళు. వాటిని చేసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. కానీ ఈ బిజీ షెడ్యూల్ లో ఎవరికి అంత తీరిక, ఓపిక ఉండటం లేదు. అందుకే మార్కెట్ కి వెళ్ళడం, కావలసినవి తెచ్చేసుకోవడం నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవడం జరిగిపోతోంది. ఇన్ స్టెంట్ దోశ, ఇడ్లీ, చపాతీ, పరోటా, ఉప్మా ఇలా ప్రతి ఒక్కటి మార్కెట్ లో దొరుకుతుంది. వాటితో మనకి ఇష్టమైన ఆహారం క్షణాల్లో రెడీ అయిపోతుంది. ముందుగా ప్యాక్ చేసిన ఆహారం తీసుకొచ్చి నిమిషాల్లో వండుకోవడం సులువైన పనే. కానీ అవి తాజావి కాదని గుర్తుంచుకోవాలి. అవి ఎక్కువ రోజులు నిల్వ చెయ్యడానికి కొన్ని రకాల రసాయనాలు అందులో కలుపుతారు. వీటినే ఫ్రొజెన్ ఫుడ్ అని కూడా అంటారు. తాజాగా వండిన వాటితో పోల్చుకుంటే ఇటువంటి ఇన్ స్టెంట్ వాటి వల్ల పోషకాలు పూర్తిగా అందవనే విషయం మీకు తెలుసా?
తయారుచేసే సమయం తక్కువగా ఉన్నందున చాలా మంది ఈ ఫ్రొజెన్ ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల సమయం ఆదా అవుతుందేమో కానీ అది రోగనిరోధక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ ఆహారాలు జీర్ణ వ్యవస్థకి కూడా భంగం కలిగిస్తాయి. ఫ్రొజెన్ ఫుడ్ తీసుకోవడానికి బదులుగా తాజాగా వండిన భోజనం తినడం వల్ల జీవక్రియ కూడా సక్రమంగా పని చేస్తుంది.
ఫ్రొజెన్ ఫుడ్ వల్ల వచ్చే సమస్యలు
ఊబకాయం/బరువు పెరగడం: ఫ్రొజెన్ ఫుడ్ లో చాలా కొవ్వులు ఉంటాయి. ఒత్తిడితో కూడిన జీవన శైలి కారణంగా అవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. దాని వల్ల బరువు పెరగడం, ఊబకాయం సమస్య తలెత్తడం వంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది.
గుండె జబ్బులు: ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్ గుండెకు చాలా హాని చేస్తాయి. ఫ్రొజెన్ ఆహారాన్ని తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్‌ను కోల్పోతారు. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
అనారోగ్య జీవనశైలి: పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. నిల్వ చేసిన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అందవు. దాని వల్ల అనారోగ్య జీవితాన్ని గడపాల్సి వస్తుంది.
ఇందులో సోడియం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా బయట దొరికే రుచికరమైన ఆహారం శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వదు. రెడీమేడ్ ఫుడ్‌తో పోలిస్తే ఆరోగ్యకరమైన ఆహారం తక్కువ రుచికరంగా ఉండవచ్చు కానీ అది మీ శరీర అవసరాలను తీరుస్తుంది. క్షణాల్లో అవుతుంది కదా అని బయట దొరికే వాటి మీద ఆధార పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కంటే తాజాగా వండిన ఆహారం తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఉత్తమమైన పని.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also read: నల్ల నువ్వులతో ఇలా చేసుకుని తింటే అధిక రక్తపోటు అదుపులోకి వచ్చేస్తుంది
Also read: రవ్వ పాయసం, రవ్వ గారెలు - బొంబాయి రవ్వతో టేస్టీ వంటలు