Viveka Murder Case: ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరినైనా విచారణకు పిలిస్తే సీబీఐ ఏఎస్పీ రామ్ సింగ్ పై ప్రైవేటు ఫిర్యాదులు వస్తున్నాయని సీబీఐ తరఫున సహాయ సొలిసిటర్ జనరల్ (ASG) హరినాథ్ ఏపీ హైకోర్టుకు వెల్లడించారు. పులివెందులకు చెందిన వెంకట కృష్ణారెడ్డి, అనంతపురం జిల్లా యాడికి వాసి గంగాధర్ రెడ్డిలు... సీబీఐ ఏఎస్పీ రామ్ సింగ్ పై కింది కోర్టులో ప్రైవేటు ఫిర్యాదులు చేశారని కోర్టుకు తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మాజీ మంత్రి వివేకా హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగదని వివరించారు. వీటిని పరిగణలోకి తీసుకొని గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు ఆధారంగా విచారణ జరపాలని కోరారు. దీంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. జయసూర్య విచారణను ఈనెల 22కి వాయిదా వేశారు.
ఫిబ్రవరిలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన న్యాయస్థానం..
వివేకానంద రెడ్డి హత్య కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలని తనను సీబీఎ ఏఎస్పీ బెదిరిస్తున్నారంటూ గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి కడప ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్/స్పెషల్ మొబైల్ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసి, నివేదిక సమర్పించాలని మేజిస్ట్రేట్ కోర్టు దాన్ని పోలీస్ స్టేషన్‌కు రిఫర్ చేసింది. రిమ్స్ స్టేషన్ పోలీసులు సీబీఐ ఏఎస్పీ రామ్ సింగ్ పై ఐపీసీ సెక్షన్ 195ఏ, 323, 506, రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. దీన్ని కొట్టేయాలని రామ్ సింగ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తదుపరి చర్యలన్నింటిని నిలిపివేస్తూ.. ఫిబ్రవరిలో న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సోమవారం ఈ వ్యాజ్యం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది.
కీలక దస్త్రాలు కనిపించకుండా పోవడంపై హైకోర్టు విస్మయం..!
ఈ కేసుకు సంబంధించి కింది కోర్టు ఇచ్చిన డాక్యుమెంట్స్ కనిపించకుండా పోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. న్యాయస్థానంలోనే పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వ శాఖల అధికారులను ఎలా ప్రశ్నించగలమని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై పూర్తి విచారణ చేసి, బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసి, కేసు నమోదయ్యేలా చూడాలని గుంటూరు జిల్లా ప్రధాన న్యామూర్తిని ఆదేశించింది. పూర్తి వివరాలను హైకోర్టు ముందు ఉంచాలని పీడీజేను ఆదేశిస్తూ విచారణను అక్టోబర్ 14కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన దర్మాసనం సోమవారం ఈమేరకు ఆదేశాలు ఇచ్చింది. నరసరావుపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులోని ఓ దావా వ్యవహారంలో 1998 ఏప్రిల్ 6వ తేదీన ఇచ్చిన తీర్పు ప్రతిని ధ్రువీకరించి ఇవ్వాలని కోరుతూ చేసిన అభ్యర్థనను.. ఆ ఫైలు తమకు అప్పిగంచలేదనే కారణంతో తిరస్కరిస్తున్నారని పేర్కొంటు వినుకొండకు చెందిన షేక్ లతీఫ్ సాహెబ్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
ఇప్పటికీ కొలిక్కి రాని కేసు..!
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ వివేకా హత్య జరిగింది. ఆ సమయంలో రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఈ హత్యపై విచారణకు సిట్ ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ కూడా సిట్ దర్యాప్తును ఏర్పాటు చేసింది. అయితే విచారణలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను తేల్చాలని కోరుతూ ఆయన కూతురు సునీతా రెడ్డి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవీంద్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో వాస్తవాలు తేలాలంటే సీబీఐ విచారణ అవసరమని వారు ఆ పిటిషన్లలో కోరారు. దీంతో ఏపీ హైకోర్టు వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. అయినా ఈ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. కేసు విచారణ వాయిదాలు పడుతూ కొనసాగుతూనే ఉంది.