బొంబాయి రవ్వతో ఉప్మా, రవ్వ లడ్డూ, రవ్వ కేసరి వంటివి వండుకోవచ్చు. వీటితో పాటూ రవ్వ పాయసం, రవ్వ గారెలు వంటివి కూడా వండుకోవచ్చు. ఈ రెండూ చేయడం చాలా సులువు. ఒకసారి వండుకుని తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించేలా ఉంటాయివి. గారెలకు మినప్పప్పు అవసరం. కానీ ఆ పప్పు లేకుండా కూడా ఇలా గారెలు వండుకోవచ్చు. 


రవ్వ పాయసం...
కావాల్సిన పదార్థాలు
బొంబాయి రవ్వ - నాలుగు స్పూనులు
పంచదార - నాలుగు స్పూనులు
పాలు - రెండు కప్పులు
నెయ్యి - రెండు స్పూనులు
యాలకుల పొడి - ఒక స్పూను
బాదం పప్పులు - నాలుగు
పిస్తాలు - నాలుగు
జీడిపప్పులు - నాలుగు
కిస్‌మిస్‌లు - నాలుగు


తయారీ ఇలా...
1. స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నెయ్యి వేయాలి. 
2. అందులో బాదం పప్పులు, పిస్తాలు, జీడిపప్పులు, కిస్ మిస్‌ల తరుగును వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. 
3. అదే కళాయిలో మరొక స్పూను నెయ్యి వేయాలి. అందులో బొంబాయి రవ్వ వేసి వేయించాలి. 
4. ఇందులో పాలు, పంచదార వేసి బాగా కలపాలి. అయిదారు నిమిషాలు ఉడికించాలి. 
5. అందులో ఒక స్పూను యాలకుల పొడి వేసి కలపాలి. 
6. మంట ఆపేసి ముందుగా వేయించి పెట్టుకున్న నట్స్ చల్లాలి. అంతే టేస్టీ రవ్వ పాయసం రెడీ. 


...........................
రవ్వ గారెలు
కావాల్సిన పదార్థాలు
బొంబాయి రవ్వ - ఒక కప్పు
ఉల్లిపాయలు - ఒకటి
పెరుగు - అరకప్పు
ఉప్పు - రుచికి సరిపడా
మిరియాల పొడి - చిటికెడు
కొబ్బరి తురుము - పావు కప్పు
వంట సోడా - చిటికెడు
అల్లం తరుగు - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
పచ్చిమిర్చి తరుగు - ఇక స్పూను


తయారీ ఇలా
1. ఒక గిన్నెలో రవ్వను వేసి నీళ్లలో నానబెట్టాలి. 
2. బాగా నానిన తరువాత ఉల్లిపాయల ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, పెరుగు, కొబ్బరి తురుము, అల్లం తరుగు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. 
3. మిరియాల పొడి, వంట సోడా కలిపి కాసేపు పక్కన పెట్టుకోవాలి. 
4. కావాలనుకుంటే కాస్త బియ్యం పిండి కాస్త కలుపుకోవచ్చు. చిక్కగా మారుతుంది. 
5. స్టవ్ పై కళాయి వేసి నూనె వేయాలి. 
6. నూనెలో గారెల్లా ఒత్తుకుని వేసుకోవాలి. 
7. వేడి వేడి రవ్వ గారెలు రెడీ అయినట్టే. 


బొంబాయి రవ్వను గోధుమలతోనే తయారుచేస్తారు. గోధుమలను రవ్వగా మిల్లులో ఆడితే అదే బొంబాయి రవ్వ. దీనిలో పోషకాలు ఎక్కువ, కేలరీలు తక్కువ ఉంటాయి. బొంబాయి రవ్వ నాడీ వ్యవస్థకు మేలు చేస్తుంది. దీనిలో జింక్, భాస్వరం, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. బొంబాయి రవ్వ వంటకాలను తినడం వల్ల కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీనిలో కాల్షియం కూడా అధికం.కేలరీలు తక్కువే కాబట్టి గారెలు చేసుకుని తిన్నా మంచిదే. 


Also read: 36 ఏళ్ల క్రితం రాసిన క్వీన్ ఎలిజబెత్ లేఖ, అందులో ఏముందో చదవాలంటే మరో 63 ఏళ్లు ఆగాలి


Also read: మీరు పెళ్లికి సిద్ధమయ్యే ముందు మీ కాబోయే భార్యని లేదా భర్తని కచ్చితంగా అడగాల్సిన ప్రశ్నలు ఇవే