AP Cabinet : ఏపీలో మరోసారి మంత్రి వర్గ విస్తరణ ఉంటుందంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇటీవలె మంత్రి వర్గం రెండో దఫా విస్తరణ జరిగినప్పటికీ ఆయా శాఖల మంత్రుల పనితీరుపై సీఎం జగన్ అసంతృప్తిగా ఉన్నారన్న వార్తలు వచ్చాయి. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా జగన్ ఒకరిద్దరు మంత్రులకు క్లాస్ తీసుకున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. అంతేకాదు పనితీరు మార్చుకోకపోతే, మంత్రి పదవి నుంచి తప్పించాల్సి వస్తుందనే సంకేతాలు కూడా ఇచ్చారని చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహరం ఇప్పుడు ఏపీలో పలురకాలుగా చర్చ జరుగుతుంది.
మంత్రులకు క్లాస్!
దాదాపుగా మూడు సంవత్సరాల తరువాత ఏపీలో కేబినేట్ ను విస్తరించారు. సీఎం జగన్ మొదట్లోనే స్పష్టంగా కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చారు. రెండున్నర సంవత్సరాల పాటు కేబినెట్ మంత్రులు కొనసాగుతారని వెల్లడించారు. అయితే కరోనా పరిస్థితులు కారణంగా మంత్రివర్గం విస్తరణ ఆలస్యం అయ్యింది. మూడు సంవత్సరాల తరువాత కేబినెట్ ను సీఎం జగన్ విస్తరించారు. కొందరు సీనియర్లను కంటిన్యూ చేసి, కొత్తవారికి అవకాశం ఇచ్చారు. అయితే రెండో దఫా విస్తరణ జరిగిన తరువాత కేబినెట్ లో మంత్రుల పనితీరుపై సీఎం అసంతృప్తిగా ఉన్నారనే సమాచారం సీఎంవో కార్యాలయం నుంచి బయటకు వచ్చింది. కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం అయిన తరువాత, కొందరు మంత్రులతో జగన్ వన్ టూ వన్ గా కూడా మాట్లాడారని, అందులోనే ఐదుగురి మంత్రులకు క్లాస్ తీసుకున్నారని పార్టీలో విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఈ పరిణామాలపై పార్టీలో ఇప్పడు ఓ టాక్ నడుస్తోంది. మంత్రి వర్గ విస్తరణ కూడా ఉంటుందని, తాజాగా బాధ్యతలను తీసుకొని 5గురు మంత్రులను తప్పిస్తారని, అందులో ఒక మహిళా మంత్రి కూడా ఉన్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
పార్టీ వర్గాలు ఏమంటున్నాయి?
అయితే ఇటీవల బాధ్యతలు తీసుకున్న మంత్రులను తప్పించే అంశాన్ని పార్టీ వర్గాలు మాత్రం ఖండిస్తున్నాయి. ఇదంతా అసత్యప్రచారం అని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. మంత్రిగా అవకాశం వచ్చిన వారు తమ పనితీరును మరింత మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సీఎం వారికి సలహాలు, సూచనలు ఇచ్చారని చెబుతున్నారు. పార్టీతో పాటుగా ప్రభుత్వంలో కూడా మంత్రులు కీలకంగా వ్యవహరించాల్సిన అంశాలను సీఎం జగన్ స్వయంగా మంత్రులకు వివరించారని, రాజకీయంగా ఎప్పటికప్పుడు వచ్చే ఆరోపణలను పరిగణంలోకి తీసుకొని వాటిని ఖండించి, వాస్తవాలను ప్రజలకు తెలియచెప్పటంలో మంత్రుల పాత్రను సీఎం వివరించారని అన్నారు.
పనిలో పనిగా వార్నింగ్ ఇచ్చారా?
వైసీపీ రాజకీయంగా తీవ్రస్థాయిలో ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అభివృద్ధి పనులు జరగకపోవటంతో పాటు, రాజధాని నిర్మాణం నిలిచిపోవటం, రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ తయారయ్యిందంటూ ప్రతిపక్షాల విమర్శలు చేయటంతో పాటుగా, జగన్ ఫ్యామిలీపై లిక్కర్ అమ్మకాలపై ఆరోపణలను గుప్పిస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితులను దీటుగా ఎదుర్కోవటంలో మంత్రులు పూర్తిగా విఫలం అయ్యారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలను వివరించేందుకు మంత్రులు ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్లటం లేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. ఇదే విషయాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్లటంతో ఆయన మంత్రులకు తనదైన శైలిలో వివరించారని అంటున్నారు.