KCR Jagan Friendship : టీఆర్ఎస్ అధినేత కేసీార్ జాతీయ రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. కొద్ది రోజులుగా ఇదే అంశంపై కేసీఆర్ కసరత్తులు జరుపుతున్నారు. జిల్లాల పర్యటనలో జాతీయ రాజకీయాల్లో తాను పోషించబోయే పాత్రపై క్లారిటీ ఇస్తున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని సొంత పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా కేసీఆర్ రంగంలోకి దిగాలని కోరుతున్నారు. మొన్న నితీష్ కుమార్, నిన్న కుమారస్వామి కూడా అదే చెప్పారు. ఇప్పుడు ఆయనతో ఎవరెవరు నడుస్తారు అన్నదానిపై విస్తృతమైన చర్చజరుగుతోంది. ముఖ్యంగా ఏపీలో ఏ పార్టీ కేసీఆర్‌కు దగ్గర అనేది కూడా చర్చనీయాంశమయింది. అయితే దీనికితెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ క్లారిటీ ఇచ్చారు. జగన్ కూడా కేసీఆర్ వెంట నడుస్తారని ప్రకటించారు. గంగుల కమలాకర్ ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్‌గామారింది.
కేసీఆర్ - జగన్ మధ్య రాజకీయంగా సత్సంబంధాలు !
రాజకీయంగా టీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రాల అంశాలపై వీరు పరస్పరం విభేదించుకుంటున్నారు కానీ ఆ పంచాయతీని తాము తేల్చుకోవడం లేదు. కేంద్రం వద్దకు నెట్టేస్తున్నారు. తెలంగాణ వైపు నుంచి అంబులెన్స్‌లు ఆపడం.. ధాన్యం లారీలకు అనుమతించకపోవడం వంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా జగన్ నేరుగా ఆ అంశాలపై సీఎంకేసీఆర్‌తో మాట్లాడలేదు. కానీ రాజకీయ పరంగా కొన్ని విషయాల్లో మాత్రం టీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ పరస్పర సహకారంతో ఉంటున్నాయని చెప్పుకోవచ్చు. ఇటీవల రఘురామకృష్ణరాజు ఇంటి వద్ద ఏపీ పోలీసులు నిఘా పెట్టడం...వారిని పట్టుకున్న విషయం వివాదం .. అలాగే తెలంగాణకు చెందిన కొంత మంది అధికారుల్ని ఏపీకి బదిలీ చేయడం వంటి విషయాల్లో పరస్పర సహకారకంగా ఉన్నారు. అయితే ఏపీలో పరిస్థితులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు.. పోలవరం అంశంలో రెండు పార్టీల నేతల మధ్య సాగిన మాటల యుద్ధం వివాదానికి కారణం అయింది. అయినప్పటికీ అధినేత మధ్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయని భావిస్తున్నారు.
గతంలో బీజేపీని ఎదుర్కోవడానికి కలసి నడవాలని చర్చంచినట్లుగా ప్రచారం!
ఏపీలో జగన్ అధికారంలోకి రావడంలో కేసీఆర్ చేసిన సాయం చేశారని రాజకీయ వర్గాలు చెబుతూ ఉంటాయి. అందుకే జగన్ గెలిచిన వెంటనే ప్రగతి భవన్‌కు వెళ్లారు. ఆ తర్వాత పలుమార్లు సమావేశాలు జరిపారు. మూడు, నాలుగు సార్లు అధికారులు లేకుండానే కేసీఆర్, జగన్ చర్చలు జరిపారు. ఓ సారి ఇలా చర్చలు జరిపిన తర్వాత బీజేపీని ఎలా దింపేయాలన్నదానిపై చర్చించారని మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. అది కలకలం రేపడంతో ... వైఎస్ఆర్‌సీపీ ఖండించింది. కానీ కేసీఆర్ మాత్రం ఖండించలేదు. ఆ తర్వాత నుంచి బహిరంగంగా కేసీఆర్, జగన్ మధ్య చర్చలు జరగలేదు. బీజేపీకి వ్యతిరేకంగా జగన్ రాజకీయాలు చేసే పరిస్థితిలేదనిచెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల ఎంపీలందరూ కలిస్తే ప్రత్యేకహోదా వస్తుందని గతంలో ప్రకటన !
గత ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రత్యేకహోదాకు మద్దతు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలు కలిస్తే కేంద్రంలో నిర్ణయాత్కమైన పాత్ర పోషిస్తామని అప్పుడు ప్రత్యేకహోదా ఏపీకి వస్తుందని చెప్పారు. జగన్ కూడా చాలా ప్రచారసభల్లో అదే చెప్పారు. కేసీఆర్‌తో కలిస్తే తప్పేమిటని..ఆయన ప్రత్యేకహోదాకుమద్దతిచ్చారన్నారు. ఆ ప్రకటనల కోణంలోచూస్తే ఇప్పుడు కేసీఆర్ కూటమిలోనే జగన్ ఉన్నారని టీఆర్ఎస్ మంత్రులు విశ్లేషిస్తున్నారు. ముందు ముందు రాజకీయ పరిస్థితులు మారితే ఈ స్నేహం మరోసారి బయటకు రావొచ్చని చెబుతున్నారు.
కేసీఆర్, జగన్ ఇద్దరికీ వ్యూహకర్త పీకేనే - అక్కడే కలుస్తోందా ?
కేసీఆర్‌కు ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త . ఆయన పేరు నేరుగా ఉంటున్నప్పటికీ ఆయన టీమే మొత్తం వ్వవహారాలు చక్కబెడుతోంది. ఏపీలోనూ ప్రశాంత్ కిషోర్ టీమే వైఎస్ఆర్‌సీపీ కోసం పని చేస్తోంది. జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీల స్ట్రాటజీని కూడా పీకే ప్రభావితం చేసే అవకాశం ఉంది . ఇప్పటికే పీకే బీజేపీకి వ్యతిరేకంగా ఓ బలమైన పక్షం రావడం ఖాయమని చెబుతున్నారు. ఈ సమీకరణాలన్నీ చూస్తే.. మంత్రి గంగుల చెప్పినట్లు కేసీఆర్, జగన్ కలిసి నడవడం ఆశ్చర్యకరమైన విషయం కాదన్న వాదన రాజకీయవర్గాల్లో ఎక్కువ వినిపిస్తోంది.