Who With KCR :   తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ప్రత్యేక పార్టీ పెట్టబోతున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందేనని సొంత పార్టీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా ఉంటామని జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాల నేతలు వచ్చి మద్దతు పలుకుపుతున్నారు. అయితే మరో తెలుగు రాష్ట్రమైన ఏపీ నుంచి కేసీఆర్‌తో నడిచేవారెవరు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకూ కేసీఆర్‌ ఎవరితోనూ బహిరంగంగా చర్చలు జరపలేదు. కానీ కేసీఆర్ అంతర్గత ప్రయత్నాలు చేస్తున్నారన్న వాదన మాత్రం వినిపిస్తోంది. 


ఏపీలో బీజేపీకి అన్నీ అనధికార మిత్రపక్ష పార్టీలే  !


ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బీజేపీతో  సఖ్యతగా ఉంటున్నాయి. అలాగని మిత్రపక్షాలని చెప్పలేం.  చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని జనసేన పార్టీ మాత్రమే అధికారిక మిత్రపక్షం.  కానీ బీజేపీతో అనవసర గొడవులు ఎందుకని ఎలాంటి వివాదాల జోలికి వెళ్లడం లేదు.  అందు కోసమే బీజేపీ వ్యతిరేక కూటమి పార్టీల భేటీలకు కానీ.. బీజేపీ వ్యతిరేక కార్యక్రమాలకు కానీ అటు వైఎస్ఆర్‌సీపీ.. ఇటు టీడీపీ హాజరు కావడం లేదు. అందుకే అందరూ ఏపీలో ఇరవై ఐదు సీట్లను టీడీపీ ఖాతాలో వేస్తూ మాట్లాడుతున్నారు. కానీ అలా అనుకోవడం రాజకీయ అపరిపక్వతే. ఎందుకంటే రాజకీయం అంటే అవకాశం కోసం చూడటం. 


కింగ్ మేకర్ అయితే బీజేపీతో ఉంటారని గ్యారంటీ ఉండదు !


ఇప్పటికైతే తమపై రాజకీయంగా దాడులు జరగకుండా.. రక్షణ కోసమైనా రెండు పార్టీలూ బీజేపీతో సఖ్యతగా వ్యవహరిస్తున్నాయి.  కానీ ఎన్నికల తర్వాత అలాంటి పరిస్థితి ఉంటుందని అనుకోలేదు. ఎన్నికల్లో  బీజేపీకి సంపూర్ణ మెజార్టీ వస్తే రెండుపార్టీలు పోటీ పడి సన్నిహితంగా వ్యవహరిస్తాయి . అందులో డౌటే లేదు. కానీ బీజేపీకి మేజిక్ మార్క్ తక్కువ అయితే మాత్రం రెండు పార్టీలు తమ విశ్వరూపం చూపిస్తాయి. అందులో సందేహం ఉండదు. కింగ్ మేకర్ అయితే ఇక వాళ్లను పట్టుకోలేరు. బీజేపీతోనే ఉంటారన్న గ్యారంటీ లేదు. వాళ్ల లెక్కలు వాళ్లు వేసుకుని ఎటు వైపు మేలు జరిగితే అటు వైపు వెళ్తారు. 


ఏపీలో కలసి వచ్చే వారి కోసం కేసీఆర్ తెర వెనుక ప్రయత్నాలు ! 


ఏపీ రాజకీయ పార్టీల్లో వైఎస్ఆర్‌సీపీతో కేసీఆర్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఏపీలో జగన్ గెలిచిన వెంటనే ప్రగతి భవన్‌కు వెళ్లారు. ఆ తర్వాత పలుమార్లు సమావేశాలు జరిపారు. కొన్ని  సార్లు అధికారులు లేకుండానే కేసీఆర్, జగన్ చర్చలు జరిపారు. ఓ సారి ఇలా చర్చలు జరిపిన తర్వాత బీజేపీని ఎలా దింపేయాలన్నదానిపై చర్చించారన్న అంశం మీడియాలో ప్రధానంగా హైలెట్ అయింది. అది కలకలం రేపడంతో ... వైఎస్ఆర్‌సీపీ ఖండించింది.  రేపు కేంద్రం లో టీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీకి కలిసి ఉన్న ఎంపీలు కీలకం అయితే కలసికట్టుగా ముందుకు వెళ్లాలని గతంలోనే అనుకున్నారు. అందుకే కేసీఆర్ ఇప్పుడు నేరుగా జగన్‌ను సంప్రదించడం లేదని చెబుతున్నారు . మొత్తంగా కేసీఆర్‌కు ఏపీ నుంచి ఓ మిత్రపక్ష పార్టీ రెడీగా ఉంటుందని.. అందుకే కంగారు పడటం లేదని టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.