ఎండలు మండిపోతున్నాయి. దాహం తీర్చుకోవడానికి ఎక్కువ మంది ఎంచుకునేది చల్ల చల్లని నిమ్మకాయ నీళ్ళు. బయటకి వెళ్ళినప్పుడు కూడా రోడ్డు పక్కన నిమ్మకాయ సోడా తాగి అలసట తీర్చుకుంటారు. ఇది తాగితే రిఫ్రెష్ గా ఉంటుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన నిమ్మరసం వేడిని తగ్గిస్తుంది. వడదెబ్బ తగలకుండా చేస్తుంది. అందుకే ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ నిమ్మరసానికి అధిక డిమాండ్ ఉంటుంది. వేడిని తగ్గించడమే కాదు నిమ్మకాయ అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. గిన్నెలు శుభ్రం చేసే దగ్గర నుంచి ఆరోగ్యకరమైన మెరిసే చర్మాన్ని ఇచ్చే వరకు సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బరువు తగ్గిస్తుంది. అందుకే బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయ, తేనె కలుపుకుని తాగుతారు. ఇది కొవ్వుని కరిగించడంలో గొప్ప సహాయకారిగా పని చేస్తుంది. అయితే నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక దుష్ప్రభావాలు ఉన్నాయి.
జీర్ణ సమస్యలు
తేనెతో పాటు ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీటిని తాగడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది. కానీ కొంతమందిలో ఇది కడుపులో చికాకు పెట్టేస్తుంది. జీర్ణక్రియ ప్రక్రియ నెమ్మదించేలా చేస్తుంది. గుండెల్లో మంట, కడుపు నొప్పి, వికారం, గ్యాస్ ఉబ్బరం వంటి వాటికి దారితీస్తుంది. అధిక ఆమ్లత్వం కారణంగా నిమ్మకాయ నీరు కూడా అల్సర్లను ప్రేరేపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. నిమ్మకాయలోని ఎసిడిక్ కంటెంట్ కారణంగా పొట్ట, పేగు లోపలి పొరకు హాని కలిగిస్తుంది. దీని వల్ల అల్సర్ ఏర్పడుతుంది.
డీహైడ్రేషన్
అదేంటి హైడ్రేట్ గా ఉండేందుకు నిమ్మరసం తీసుకుంటారు కానీ దీని వల్ల డీహైడ్రేషన్ కి గురికావడం ఏంటా అనుకుంటున్నారా? కానీ ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి నిమ్మరసం ఉత్తమమైన మార్గాల్లో ఒకటి. మూత్రపిండాల్లో ఎక్కువ మూత్ర ఉత్పత్తికి దారి తీస్తుంది. దీని వల్ల తరచుగా మూత్రవిసర్జన శరీరం నుంచి ఎలక్ట్రోలైట్లను బయటకి పంపుతుంది. ఫలితంగా శరీరం నిర్జలీకరణానికి గురవుతుంది. పెదవులు పొడి బారిపోవడం, అలసట, విపరీతమైన దాహంగా అనిపిస్తుంది.
మైగ్రేన్
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం సిట్రస్ పండ్లలో టైరమెన్ ఎక్కువగా ఉంటుంది. రోజు నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల తీవ్రమైన తలనొప్పి, మైగ్రేన్ వస్తాయి.
దంత క్షయం
ఆమ్లత్వం కారణంగా నిమ్మరసం తగినప్పుడు పళ్ళు జలదరించినట్టుగా అనిపిస్తుంది. ఇది దంతాల మీద ఉండే ఎనామిల్ క్షీణతకు దారితీస్తుంది. దీని వల్ల పళ్ళు పుచ్చిపోవడం జరుగుతుంది. మీరు సెన్సిటివిటీతో బాధపడుతుంటే నిమ్మకాయ వంటి ఆమ్ల ఆహారాన్ని పరిమితం చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
జుట్టుకి నష్టం
అతిగా నిమ్మకాయ వినియోగిస్తే హెయిర్ డ్యామేజ్ కి కారణం అవుతుంది. జుట్టు కుదుళ్ళని పొడిగా చేసి జుట్టు విరిగిపోయేలా చేస్తుంది.
నోటిలో పుళ్ళు
నాలుక కింద, బుగ్గల లోపల నోటి పూత వచ్చేలా చేస్తుంది. ఆమ్ల లేదా కారంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినే వ్యక్తులు, విటమిన్ లోపాలకు గురైన వాళ్ళు ఈ నోటి అల్సర్ బారిన ఎక్కువగా పడతారు. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ప్రకారం నిమ్మకాయ నీటిని ఎక్కువగా తాగడం వల్ల ఇప్పటికే ఉన్న క్యాన్సర్ పుండ్లు మరింత తీవ్రమవుతాయని తెలిపింది. దీని వల్ల తినడం, మాట్లాడటం కూడా ఇబ్బందిగా మారుతుంది.
ఎంత తాగాలి?
ఆరోగ్య నిపుణులు సూచనల ప్రకారం ప్రతిరోజు రెండు గ్లాసుల నిమ్మరసం తాగితే మంచిది. ఎందుకంటే దానిలో నాలుగు నిమ్మకాయ ముక్కలతో లీటరు నీటిని చేర్చుకోవచ్చు. గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ, తేనె, పుదీనా ఆకులు లేదా అల్లం జోడించి తీసుకుంటే మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. వయసు, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిమ్మకాయ నీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: కళ్ళ కింద నల్లటి వలయాలను ఇలా శాశ్వతంగా వదిలించుకోండి