ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటుంటారు పెద్దలు. ఇంటి నిర్మాణం చేస్తున్నపుడు వాస్తు దోషాలు ఏర్పడకుండా జాగ్రత్త పడడం అవసరం. ఎందుకంటే వాస్తును అనుసరించినపుడు ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించేందుకు అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఆ ఇంట్లో నివసించే వారికి సానుకూల ఫలితాలు అందుతాయి. అందుకే ప్రతి చిన్న చిన్న విషయం గురించి కూడా వాస్తు వివరణలు తెలుసుకోవడం మంచిది. ఇంట్లో ట్యాప్, సింకులను ఎక్కడ ఏ దిశలో ఏర్పాటు చెయ్యాలో తెలుసుకుందాం.
ప్రతి ప్రదేశం కొంత శక్తిని కలిగి ఉంటుంది. ఆ శక్తి మీకు అనుభూతిలోకి రావడం లేదంటే అక్కడ కచ్చితంగా వాస్తు దోషం ఉండి ఉంటుంది. అలా కాకుండా ప్రతిక్షణం ఒక మంచి వైబ్రేషన్ తో ఉండే ప్రదేశాలు కచ్చితంగా వాస్తును అనుసరించే ఉంటాయన్న సంగతి కొంచెం తరచి చూస్తే సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ప్రకృతితో ప్రతి క్షణం ప్రకృతితో అనుసంధానించబడి ఉండాలని సనాతన ధర్మం బోధిస్తుంది. సృష్టిలో ప్రతి ఒక్కటి పంచభూతలతో నిండి ఉంటుంది. ఈ పంచభూతాలు ఒక్కో దిక్కుకు ఒక్కో రకమైన పాజిటివిటిని కలిగిస్తాయి. ఆ శక్తిని అనుసరించి జీవించడం ద్వారా ప్రకృతికి అనుసంధానమై ఉండవచ్చు. అలా అనుసంధానించాల్సిన వాటిలో మనం నివసించే స్థలాలు చాలా ముఖ్యమైనవి. వాస్తు నివాస స్థలాలను నివాసయోగ్యాలుగా మార్చే శాస్త్రం. నిర్మాణాలు కచ్చితంగా వాస్తును అనుసరించి ఉండాల్సి ఉంటుంది. వాస్తు నియమాలను నిర్లక్ష్యం చేసినపుడే వాస్తు దోషాలు ఏర్పడేది. నిర్మాణాలకు సంబంధించిన అతి చిన్న విషయాల గురించి కూడా వాస్తు శ్రద్ధ వహిస్తుంది.
ఇంటి నిర్మాణం చేపట్టినపుడు వాస్తు నియమాలను విస్మరించకూడదు. వాస్తు ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవాహానికి అవకాశం కల్పిస్తుంది. నియమానుసారం వంట గది ఉండాల్సిన దిశ అక్కడ స్టవ్ ఏర్పాటు చేసుకోవాల్సిన ప్రదేశం వంటివి మాత్రమే కాదు సింక్, ట్యాప్ లు ఎక్కడ ఉండాలో వాస్తు చక్కగా వివరిస్తుంది.
వాస్తు ప్రకారం దక్షిణ లేదా పడమర దిక్కులలో ట్యాప్ ఏర్పాటు చెయ్యవద్దు. ట్యాప్ ఎప్పుడైనా ఉత్తర లేదా తూర్పు దిక్కులలో మాత్రమే ఉండాలి. సింక్ ఉత్తరం లేదా ఈశాన్య మూలన ఏర్పాటు చేసుకోవాలి. ట్యాప్ లు, సింక్ లు ఏర్పాటు చేసే ముందు కచ్చితంగా ముందుగా చూసుకోవాలి. లేదంటే ఆర్థిక సంబంధ సమస్యలు వేధిస్తాయి.
వంటింట్లో సింకులు, ట్యాప్ లు ఏర్పాటు చేసుకునేందుకు నియమాలు
- వంటిల్లు ఇంట్లో అత్యంత ముఖ్యమైన ప్రదేశం. ఇక్కడ అన్నపూర్ణా దేవి, అగ్ని దేవుడు కొలువై ఉంటారు. వంటగదిలో సింక్, అక్కడ ఏర్పాటు చేసే ట్యాప్ ఉత్తరం లేదా ఈశాన్య దిశలలో మాత్రమే ఉండాలి.
బోర్ వెల్ ఏర్పాటు చేసేందుకు నియమాలు
- ప్రధాన గేటుకు ముందు బోర్వెల్ ను అసలు ఏర్పాటు చెయ్యకూడదు. వాష్ రూమ్ లేదా సెప్టిక్ ట్యాంక్ కి దగ్గరగా బోర్వెల్ ఉంటే అది అశుభాలకు కారణం అవుతుంది.
- బోర్వెల్ నిర్మించేందుకు ఎక్కువగా సంచారం లేని ప్రదేశం మంచిదని శాస్త్రం చెబుతోంది.