పండుగ‌లైనా, ప‌ర్వ‌దినాలైనా, ఏ శుభ‌కార్య‌మైనా, దైవ సంబంధిత కార్య‌క్ర‌మ‌మైనా మామిడాకుల తోర‌ణాలు త‌ప్ప‌నిస‌రి. క‌ల‌శ‌ంలోనూ వాటికే ప్రాధాన్యం. అస‌లు ఏ కార్య‌క్ర‌మానికికైనా మామిడాకుల‌ను ఎందుకు వాడ‌తారో తెలుసా..? ఈ సంప్ర‌దాయం వెనుక కార‌ణ‌మేంటి..? మామిడి తోర‌ణాలతో ప్ర‌యోజ‌నాలున్నాయ‌ని చెప్ప‌డానికి ఆధ్యాత్మికంగా, సైన్స్ ప‌రంగా రుజువులున్నాయి.


మామిడి, రావి, జువ్వి, మర్రి, ఉత్తరేణి- ఆకులను పంచపల్లవాలని పిలుస్తారు. వీటిని శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. అయితే తోరణాలుగా మాత్రం మామిడాకులనే వినియోగిస్తారు. పండుగలు, వేడుకలు, వివాహాది సమయాల్లో గుమ్మానికి మామిడాకులను కట్టడం శుభసూచకంగా భావిస్తారు. యజ్ఞ యాగాదుల్లో మామిడాకులతో కూడిన ధ్వజారోహణం చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. పూజా కలశంలోనూ మామిడాకులను ఉపయోగిస్తాం.


ప్ర‌తి ఇంట్లో శుభ‌కార్యాలు, పండుగ స‌మ‌యాల్లో గ‌డ‌పల‌కు ప‌సుపు, కుంకుమ రాసి బొట్టు పెడతారు. అలాగే గుమ్మాల‌పై ప‌చ్చ‌టి మామిడి తోర‌ణాలతో అలంక‌రిస్తారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇంట్లోకి ధ‌నల‌క్ష్మితో పాటు స‌క‌ల దేవ‌తా ప‌రివారం వ‌స్తార‌ని పండితుల ఉవాచ‌. ఫ‌లితంగా ఆ ఇంట్లోకి ధనం వ‌చ్చి చేర‌డంతో ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయ‌ని విశ్వ‌సిస్తారు. ఇంటి అలంక‌ర‌ణ ఎంత బాగుంటే.. అంత‌లా దేవుళ్లు ఇంట్లోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయ‌ని చెబుతారు. మామిడి ప్రేమ, సంపద, సంతానాభివృద్ధికి సంకేతమ‌ని రామాయణ, భారతాల్లో ప్రస్తావించారు.


మన పురాణాల్లో కూడా మామిడాకులకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినట్టు గ్రంథాల్లో ఉన్నాయి. మామిడి చెట్టు కోరికలను తీరుస్తుందనీ, భక్తి ప్రేమకు సంకేతమని భారతీయ పురాణాలలో పేర్కొన్నారు. ఇది సృష్టికర్త బ్రహ్మకు అర్పించిన వృక్షం. దీని పువ్వులు చంద్రునికి అర్పించబడ్డాయి. కాళిదాసు ఈ చెట్టును మన్మథుడి పంచబాణాలలో ఒకటిగా వర్ణించాడు. శివపార్వతుల కల్యాణం మామిడి చెట్టు కిందనే జరిగిందనీ, అందుకే శుభకార్యాలలో మామిడి ఆకులను ఉపయోగిస్తారని, చివరికి అంత్యక్రియలో మామిడికట్టెను ఉపయోగిస్తారని చెపుతారు. ప్రాచీన కాలంలో వివాహానికి ముందు వరుడు మామిడి చెట్టుకు పసుపు, కుంకుమ రాసి ప్రదక్షిణం చేసి ఆ చెట్టును ఆలింగనం చేసుకునేవాడట.


మామిడి ఆకులు నిద్రలేమిని పోగొడతాయి అని, పండుగల వేళ పని ఒత్తిడిని, శ్రమను తగ్గేలా చేస్తాయని, అంతే కాదు మామిడి కోరికలు నెరవేరేలా చేస్తుందని భావిస్తారు. మామిడి చెట్టు పళ్ళే కాదు, మామిడి ఆకులు కూడా ఉపయోగకరమని వాటిని పలు అనారోగ్యాలు తొలగించడం కోసం ఆయుర్వేదంలో వాడతారని చెబుతారు. ఇక శుభకార్యాలు నిర్వహించినప్పుడు మామిడాకులను ఎందుకు కడతారు అన్నదానికి అనేక కారణాలు ఉన్నాయి. 


ఆలయాలలోనూ ఎలాంటి శుభసందర్భం అయినా మామిడాకుల తోరణాలు కట్టడం ప్రధానంగా చూస్తూ ఉంటాం. భగవంతుడు కొలువై ఉండే ఆలయాలలోనే మామిడాకుల తోరణాలకు ప్రాధాన్యత ఉంటే అలాంటి మామిడాకులను ఇంట్లో కడితే ఫలితం తప్పకుండా ఉంటుందని పెద్దలు విశ్వసిస్తారు. ఏది ఏమైనా మామిడి ఆకులను శుభానికి సూచనగా భావిస్తూ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే సత్ఫలితాలు ఉంటాయని హిందూ ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి.


ఇక‌ మామిడాకుల్లోంచి విడుదలయ్యే ప్రాణవాయువు వాతావరణాన్ని స్వచ్ఛంగా ఉంచుతుంది. ఎక్కువమంది గుమిగూడినప్పుడు ఎదురయ్యే మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. గుమ్మాలకు మామిడాకులను తోరణాలుగా కట్టడం వలన పరిసరాల్లోని గాలి పరిశుభ్రమై ఆక్సిజ‌న్‌ శాతం పెరుగుతుంది. ఇంటి ప్రధాన ద్వారం పైన‌, ఇంటి ఆవరణలోని ద్వారానికి మామిడి ఆకుల తోర‌ణాలు క‌డితే ఆ ఇంట్లోని వాస్తు దోషం పోతుంద‌ట‌. అంటే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ ప్రసారమవుతుందట. తద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుందని పెద్దలు చెబుతారు.


అంతేకాదు.. గ్రామాల్లో బావిలోనికి దిగి శుభ్రం చేసేవారికి మొదట మామిడాకులు ఎక్కువగా ఉన్న ఓ కొమ్మను బావిలోకి దించి, చుట్టూ కొంతసేపు తిప్పమని చెప్పేవార‌ట‌. ఇలా చేయడం వలన బావిలో ఉన్న విషవాయువులు తొలగిపోతాయ‌ని నిరూపిత‌మైంది. ఇప్పటికి ఇలా చేసేవారు మనకి గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటారు.


Also Read: శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి అష్టమంలో గురుడు ఆరోగ్యంపై దెబ్బకొడతాడు, ఏ రంగం వారికీ శుభఫలితాలు లేవు!