శరీరంలో మన ఆరోగ్యాన్ని సూచించే అవయవాల్లో గోళ్లు కూడా ఒకటి. ఇవి అందంగా, బలంగా ఉంటే మన శరీరం పోషకాహార లోపం బారిన పడలేదని అర్థం. అవి పెళుసుగా మారిపోతున్నా, రంగు మారుతున్నా, ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. పోషకాహార లోపం వల్ల కూడా గోళ్లు విరిగిపోవడం, పెచ్చులుగా రాలిపోవడం వంటిది జరుగుతూ ఉంటాయి. బలమైన, ఆరోగ్యకరమైన గోళ్లు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని సూచిస్తాయి. గోళ్లు కేరాటిన్ అనే ప్రోటీన్ తో తయారవుతాయి. ఈ ప్రోటీన్ తగినంత శరీరానికి అందకపోతే అవి బలహీనంగా, పెళుసుగా మారి విరిగిపోతూ ఉంటాయి. అంతేకాదు మరికొన్ని రకాల పోషకాల లోపం ఏర్పడిన కూడా గోళ్ల పెరుగుదలలో ఇబ్బందులు కనిపిస్తాయి.


విటమిన్ బి7
గోళ్లు బలంగా, అందంగా కనిపించడానికి బయోటిన్ కీలకమైన పోషకం. దీన్నే విటమిన్ బి7 అంటారు. బయోటిన్ లోపం వల్ల గోళ్ల చివర్లు చిప్స్ లాగా పెళుసుగా మారి విరిగిపోతూ ఉంటాయి. ఇలా గోళ్లు విరిగిపోతున్న సమస్య ఉన్నవారు గుడ్లు, బాదం, వాల్నట్స్, సాల్మన్ చేపలు, అవకాడోస్, చిలకడ దుంపలు, కాలీఫ్లవర్ వంటివి తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిలో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. గోళ్లు ఆరోగ్యానికి బయోటిన్ సప్లిమెంట్లు వాడినా మంచిదే. అయితే వైద్యుల సూచన మేరకే వాటిని వాడాలి.


ఇనుము
ఇనుము లోపంతో బాధపడుతున్నా కూడా గోళ్లు పెళుసుగా మారి, చీలిపోతూ ఉంటాయి. గోళ్ళకు ఆక్సిజన్ సరిగా అందకపోతే ఇలా జరుగుతూ ఉంటుంది. ఇనుము లోపం రాకుండా ఉండాలంటే లేత మాంసం, సీ ఫుడ్, పాలకూర, గుమ్మడి గింజలు, తృణధాన్యాలు వంటివి తింటూ ఉండాలి. స్ట్రాబెర్రీలు, పుల్లని పండ్లు, బెల్ పెప్పర్స్ వంటి విటమిన్ సి రిచ్ ఫుడ్స్ కూడా తినడం అలవాటు చేసుకోవాలి.


జింక్
జింక్ అనేది గోరు పెరుగుదలకు, గోర్ల మరమ్మతుకు అవసరమైన ఖనిజం. దీని లోపం వల్ల గోరు పెరుగుదలలో అడ్డంకులు వస్తాయి. అవి విరిగిపోయే అవకాశం ఉంటాయి. ఆరోగ్యకరమైన గోరు అభివృద్ధికి జింక్ ఉన్న ఆహారాలను తినాలి. చిక్కుళ్ళు, నట్స్, లేత మాంసాలలో జింక్ ఉంటుంది. జింక్ సప్లిమెంట్లు తినడం ద్వారా కూడా జింక్ లోపాన్ని అధిగమించవచ్చు. అయితే సప్లిమెంట్లను వైద్యుల పర్యవేక్షణలోనే వినియోగించాలి.


ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు 
ఇవి మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి గోర్ల ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తాయి. గోర్లు పొడిబారకుండా బలంగా ఎదగడానికి ఇది అవసరం. ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు అధికంగా కొవ్వు పట్టిన చేపల్లో ఉంటాయి. అవిసె గింజలు, చియా గింజలు, వాల్ నట్స్‌లో కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి.


విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ... వంటి శక్తివంతమైన విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు వంటివి గోళ్ళను రక్షిస్తూ ఉంటాయి. విటమిన్ ఏ గోళ్ళల్లో ప్రధాన భాగం అయినా కెరాటిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇక విటమిన్ సి కోలాజెన్ ఏర్పడడానికి అవసరం. ఇది గోళ్లను బలంగా మారుస్తుంది. విటమిన్ E గోళ్ళకు తేమను, పోషణను అందిస్తుంది. గోళ్ల ఆరోగ్యం కోసం క్యారెట్లు, చిలగడ దుంపలు, సిట్రస్ పండ్లు, బెర్రీలు, నట్స్ వంటివి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇవన్నీ గోళ్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి. 




Also read: నా వివాహంలో ప్రేమ లేదు, అందుకే నేను ఆ తప్పు చేయాల్సి వచ్చింది



Also read: డైట్ కోక్‌లో క్యాన్సర్ కారక పదార్థం, హెచ్చరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ




















































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.