Anant Ambani-Radhika Merchant Special Designer Dress In Sangeet Function: భారతీయ వ్యాపార దిగ్గజం, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ త్వరలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్న నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా శుక్రవారం రాత్రి సంగీత్ వేడుకలు నిర్వహించారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ వేడుకలు అంబరాన్ని అంటాయి. ఈ సెలెబ్రేషన్స్ లో ఇరు కుటుంబ సభ్యులతో పాటు బంధు, మిత్రులు, సినీ తారలతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖలు పాల్గొన్నారు.  


బంగారు డ్రెస్ లో అనంత్, స్వరోవ్ స్కీ క్రిస్టల్స్ పొదిగిన దుస్తుల్లో రాధిక


ఇక సంగీత్ వేడుకలో నూతన వధూవరులు ధరించిన దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అబూ జానీ సందీప్ ఖోస్లా ఎక్స్ క్లూసివ్ గా డిజైన్ చేసిన సాంప్రదాయ దుస్తులను అందరినీ ఆకట్టుకున్నాయి. అనంత్ అంబానీ బంద్ గాలా జాకెట్, ప్యాంట్ ధరించగా, ఆఫ్ షోల్డర్ బ్లౌజ్, లెహంగాలో రాధిక మెరిసిపోతూ కనిపించింది. అనంత్ ధరించిన జాకెట్ బంగారంతో రూపొందించగా, రాధిక దుస్తులు స్వరోవ్ స్కీ క్రిస్టల్స్ తో తయారు చేశారు.  అనంత్ బ్లాక్, గోల్డెన్ కలర్ కాంబినేషన్ లోని బంద్ గాలా జాకెట్, బంగారంతో తయారు చేసిన పూలు, ముందు బటన్ క్లోజర్స్, టైలర్డ్ ఫిట్టింగ్,  దానికి సూటయ్యే బ్లాక్ కుర్తాలో ఆకట్టుకున్నాడు. ఇక రాధిక లైట్ బ్రౌన్, గోల్డెన్ కలర్ లెహంగాలో ఆహా అనిపించింది. స్వరోవ్ స్కీ క్రిస్టల్స్ తో రూపొందించిన ఆఫ్ షోల్డర్ బ్లౌజ్, క్రాప్డ్ హెమ్, ఫ్లోర్ లెంగ్త్ హెమ్ చూపరులను కనువిందు చేశాయి. లైట్ గ్రీన్ కలర్ సిల్క్ దుపట్టా, ఎమరాల్డ్ పెండెంట్ కలిగిన  డైమండ్ నెక్లెస్, బ్రేస్ లెట్, చక్కటి చెవి దుద్దులు, లూజ్ హెయిర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఈ దుస్తుల ధర ఎంత అనేది వెల్లడికాలేదు. కానీ, కోట్ల రూపాయలలో ఉంటుందని తెలుస్తోంది. వారు గానీ ఈ దుస్తులు దానమిస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.






జులై 12న అంగరంగ వైభవంగా అనంత్, రాధిక వివాహం


జులై 12న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. మూడు రోజుల పాటు ఈ పెళ్లి వేడుకలు కొనసాగనున్నాయి. ఈ పెళ్లి వేడుకల్లో పలువురు అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొననున్నారు. రాధిక, ప్రముఖ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కూతురు కాగా, ప్రపంచ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ. ఈ పెళ్లి వేడుకలను ముంబైలోని ముఖేష్ నివాసం అంటీలియాతో పాటు జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్నాయి. ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తికావొస్తున్నట్లు తెలుస్తోంది.  



Read Also: జక్కన్న జిందాబాద్ - నెట్‌ఫ్లిక్స్‌లో రాజమౌళి బయోగ్రఫీ, ఇది కదా మనకు కావల్సింది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?