Road Accidents In AP And Telangana: తెలుగు రాష్ట్రాల్లో శనివారం తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. వేర్వేరు చోట్ల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా (Annamayya District) రామాపురం మండలం కొండవాండ్లపల్లి వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఐదుగురు స్నేహితులు కడప నుంచి కారులో రాయచోటికి వస్తుండగా.. కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని తీవ్రంగా గాయపడ్డ షేక్ ఖాదర్ భాషా (20) అనే వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


చిత్తూరు జిల్లాలో


అటు, చిత్తూరు (Chittor) జిల్లా పెద్దపంజాణి మండలం బసవరాజు కండ్రిగ వద్ద ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అనంతపురం జిల్లా పెనుగొండ నుంచి రామేశ్వరం తీర్థయాత్రలకు 52 మందితో వెళ్తున్న పర్యాటకుల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా.. 21 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు అనంత జిల్లా రొద్దం మండలం చింగులపల్లికి చెందిన రామాంజనమ్మ, కర్ణాటక రాష్ట్రం తుంకుర్ జిల్లా మురారిహల్లికి చెందిన నరసింహారెడ్డిగా గుర్తించారు. అనంతపురం జిల్లా తమిళనాడుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి.


తెలంగాణలో..


అటు, మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. జిల్లాలోని దంతాలపల్లి మండల కేంద్రం శివారులోని వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై కారు, ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. తొర్రూరు నుంచి బీర్ శెట్టిగూడెం వెళ్తున్న ఆటోను మరిపెడ నుంచి దంతాలపల్లికి వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో రెండు ముక్కలవగా.. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ బంధు మల్లేశ్, పగిండ్ల కుమార్, భూక్య నరేశ్ మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 


Also Read: Annamayya District: వంట చేయడానికి వచ్చి దుప్పటి సాయంతో ఖైదీ జంప్- రాజంపేట సబ్ జైలులో ఘటన