Rajampet Sub Jail: అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్‌జైలులో ఓ విచిత్ర ఘటన జరిగింది. దుప్పటి సాయం ఓ ఖైదీ పారిపోవడంతో అధికారులు అవాక్కయ్యారు. ఎత్తైన గోడ దూకేందుకు దుప్పటి సాయం తీసుకొని జంప్ అయ్యాడు. దీనిపై అధికారులు దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. ఆయన్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
రైల్వే కోడూరు చెందిన బాషా అనే వ్యక్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. కేసు దర్యాప్తు జరుగుతున్న టైంలో కోర్టు ఆయన్ని రిమాండ్‌కు పంపింది. రిమాండ్ ఖైదీగా అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలులో ఉన్నాడు.
ఖైదీలకు వంట చేసే సాకుతో తప్పించుకోవడం కలకలం రేపింది. ప్రతిరోజు ఖైదీలకు వంటే చేసే గదిలో బాషా హడావుడి చేస్తుంటాడు. ఇవాళ కూడా ఎప్పటి మాదిరిగానే వంటలో సాయం చేయడానికి ఉదయాన్నే లేచి జైలు గది నుంచి వంటగదికి వచ్చాడు. ఇన్ని రోజుల నుంచి వేసుకున్న ప్లాన్ ప్రకారం పడుకొని లేచిన వెంటనే దుప్పటి కూడ వెంట తెచ్చుకున్నాడు.
తెచ్చుకున్న దుప్పటి ఎవరికీ కనిపించడుగా జాగ్రత్త చేసుకున్నాడు. వంట పేరుతో జైలు నుంచి బయటకు వచ్చిన బాషా... సెంట్రీలంతా నిద్రలో ఉన్న విషయాన్ని గ్రహించాడు. అంతే ఎస్కేప్ ప్లాన్ వేశాడు. ముందే తెచ్చుకున్న దుప్పటిని అక్కడ ఓ స్తంభానికి కట్టి దాని సాయంతో గోడపైకి పాకి ఎక్కడు. అక్కడి నుంచి జాగ్రత్తగా దెబ్బలు తగలకుండా దూకేసి పారిపోయాడు.
కొద్దిసేపటికి దుప్పటి వేలాడుతున్న విషయాన్ని గ్రహించిన జైలు అధికారులు ఆరా తీస్తే బాషా జంప్ అయినట్టు గుర్తించారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించి పోలీసు కేసు పెట్టారు. ఆయన కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.