సీజన్ తో సంబంధం లేకుండా మార్కెట్లో దొరికేవి ఖర్జూరాలు. వీటిని వేసవిలో తిన్నా తినకపోయినా, చలికాలంలో మాత్రం కచ్చితంగా తినాలి. చలివల్ల శరీరానికి కలిగే నష్టాన్ని తగ్గించడంలో ముందుంటుంది ఖర్జూరం. శక్తిని ఇస్తూనే ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
నొప్పులు తగ్గుతాయి
చలికాలం మొదలైతే చాలు నొప్పుల బాధలు పెరుగుతాయి. చిన్న దెబ్బ కూడా అధికంగా నొప్పి పెడుతుంది. కీళ్ల నొప్పులు కూడా పెరుగుతాయి. రోజూ ఖర్జూరం తినేవాళ్లలో నొప్పులు తగ్గుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి కారణం ఖర్జూరంలో నొప్పి నివారణ గుణాలు ఉన్నాయి. ఇందులో ఉండే మెగ్నీషియం కూడా నొప్పిని తగ్గించేందుకు సహకరిస్తుంది.
ఎముకలకు బలం
చలికాలంలో చాలా మంది ఇంటి పట్టునే ఉంటారు. లేదా ఆఫీసుల్లో ఓ మూల సర్దుకుపోతారు. చల్లగాలి రాకుండా ఉండాలంటే అదే కదా చేయాల్సింది. కానీ దీనివల్ల శరీరానికి ఎండ నుంచి సహజంగా లభించే డి విటమిన్ దొరకదు. ఫలితంగా ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. అదే ఖర్జూరం తింటే ఎముకలకు క్యాల్షియం అందుతుంది. అలాగే ఎముకలు గుల్లబారే సమస్య కూడా రాదు.
చలిని తట్టుకునేలా
ఖర్జూరం తింటే శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. సహజ చక్కెరగా ఇది పనిచేస్తుంది.
గుండె జబ్బులు దూరం
శరీరఉష్ణోగ్రతను క్రమబద్దీకరించేందుకు ఖర్జూరం సాయపడుతుంది. చలికాలంలో గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువ. ఆ అవకాశాన్ని తగ్గిస్తుంది ఖర్జూరం. చెడ్డ కొలెస్ట్రాల్ ను కూడా పేరుకుపోకుండా చేస్తుంది.
మహిళలకు, పిల్లలకు...
రక్తహీనత సమస్య స్త్రీలలో, పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వాళ్లు రోజూ మూడు ఖర్జూరాలు తింటే మంచిది. ఖర్జూరంలో ఉండే ఐరన్ వల్ల హిమోగ్లోబిన్ స్థాయులు పెరుగుతాయి. తద్వారా రక్తం ఉత్పత్తి పెరిగి రక్త హీనత సమస్య కనుమరుగవుతుంది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.