పద్నాలుగు మంది. అందరూ అప్పుడే పుట్టిన పిల్లల ఐసీయూ విభాగంలోనే పనిచేస్తారు. విచిత్రం వారంతా ఒకేసారి గర్భం ధరించారు. అందరి ప్రసవ తేదీలు దాదాపు దగ్గర దగ్గరగానే ఉన్నాయి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి వైరల్‌గా మారింది. కన్సాస్ సిటీలోని సెయింట్ ల్యూక్స్ ఈస్ట్ ఆసుపత్రిలో వీరంతా పనిచేస్తున్నారు. వీరిలో ఇద్దరికీ డెలివరీ  అవ్వగా మిగతా 12 మంది ప్రసవానికి రెడీగా ఉన్నారు.


ఈ మధ్యనే ప్రసవించిన నర్సు కైట్లిన్ హాల్ మాట్లాడుతూ ‘తనకు కొత్తగా పెళ్లయింది, నేను మాత్రమే పిల్లల కోసం ప్రయత్నిస్తున్నా అనుకున్నా. అందుకే మూడో నెల వచ్చే వరకు చెప్పలేదు. నా కన్నా ముందే మిగతా నర్సులు గర్భం దాల్చినట్టు చెప్పడం మొదలు పెట్టారు. అప్పుడు నేనూ చెప్పాను. మొత్తం 14 మంది నర్సులం ఒకేసారి గర్భవతులుగా మారడంతో అందరూ ఆశ్చర్యపోయారు’ అని వివరించింది. ఒకే విభాగంలో పనిచేసే వాళ్లమంతా ఒకేసారి గర్భవతులవ్వడంతో ఆహారపరంగా, డ్యూటీ పరంగా చాలా సాయం చేసుకునేవాళ్లమని చెబుతోంది హాల్.  


ఆ ఆసుపత్రి యాజమాన్యం కూడా ఈ విషయం తెలిసి ఆశ్చర్యపడింది. అదే ఆసుపత్రిలో నర్సులకు ఉచిత డెలివరీ ఉంటుంది. ప్రస్తుతానికి ఇద్దరు బేబీలు ఈ లోకంలోకి వచ్చారని మిగతా బేబీల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నామని తమ అధికారిక ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసింది.  


గతంలో... 
గతంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. అమెరికాలోని పోర్ట్ లాండ్ లో మైనే మెడికల్ సెంటర్లో ఒకేసారి తొమ్మిది నర్సులు గర్భం దాల్చారు. వారంతా పనుల్లోఒకరికొకరు సాయం చేసుకుంటూ సాగారు. అందరూ ఆగస్టు నెలలోనే ప్రసవించారు. తల్లులు, బిడ్డలతో కలిసి గ్రూపు ఫోటో దిగారు. ఇలా ఒకేచోట పనిచేసే వాళ్లు ఒకేసారి పిల్లల్ని కనడం ఎంతైనా ఆసక్తి కలిగించే విషయమే. పిల్లల్ని చూసుకునే విషయంలో కూడా వారు ఒకరికి సాయం చేసుకుంటూ డ్యూటీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. ఇలా కలిసిమెలిసి ఉద్యోగం చేసుకుంటే రోగులకు, ఆసుపత్రి యాజమన్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అభిప్రాయపడుతున్నారు. 



Also read: నడుములోతు నీళ్లలో అప్పుడే పుట్టిన బిడ్డను బుట్టలో మోసుకెళ్తున్న తండ్రి, ఈ వీడియో చూడాల్సిందే



Also read: భర్త చనిపోయిన రెండేళ్లకు అతని బిడ్డకు జన్మనిచ్చిన భార్య


Also read: మగవారిలో కోరికలు పెంచే హార్మోన్ టెస్టొస్టెరాన్, అది తగ్గితే కనిపించే లక్షణాలు ఇవే