Heart Diseases with Unhealthy Drinks : సమ్మర్​లో త్వరగా డీహైడ్రేట్ అయిపోతాము. ఆ సమయంలో దగ్గర్లో ఏమి కనిపిస్తే వాటిని తాగుతూ ఉంటాము. కొందరు చల్లగా, రుచిగా ఉంటాయని కోక్స్ వంటి తియ్యని పానీయాలు తాగుతూ ఉంటారు. మీరు కూడా ఇలా స్వీట్ కలిగిన కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగేస్తున్నారా? అయితే జాగ్రత్త. ఇవి మీకు గుండె సమస్యలు తీసుకువస్తాయని హెచ్చరిస్తుంది తాజా అధ్యయనం. ఈ డ్రింక్స్​ తాగితే గుండె జబ్బులు రావడమేంటి? అసలు స్టడీలో ఎలాంటి విషయాలను పరిశోధకులు కనుగొన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 


చక్కెర ఎంత తీసుకుంటున్నారో తెలిసి ఉండాలి


శరీరంలోకి రోజూ ఎంత చక్కెర వెళ్తుందో అనే విషయం జాగ్రత్తగా ఉండాలి. మీకు డయాబెటిస్ ఉన్నా లేకున్నా ఈ విషయంలో కాంప్రిమైజ్ కాకూడదు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మీరు ఎలాంటి కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. వాటిలో ఎంత శాతం చక్కెర ఉంటుంది వంటి వాటిపై కనీస అవగాహన ఉండాలట. లేదంటే కొన్ని కూల్ డ్రింక్స్​లోని చక్కెరలు పేగుల్లోకి చొచ్చుకుపోయి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయట. రెండు లీటర్లు అంతకంటే ఎక్కువ తియ్యని కూల్ డ్రింక్స్ తాగడం వల్ల హృదయ సమస్యలు వస్తాయంటుంది కొత్త అధ్యయనం. 


వారానికి రెండు లీటర్లు మించితే..


కేవలం కూల్ డ్రింక్స్​లోనే కాదు కొన్ని సోడాలు, పండ్ల రసాలు, జ్యూస్​లు, టీలలో కూడా స్వీట్​ ఉంటుంది. రుచికోసం చాలామంది వీటిని ఎంచుకుంటారు. కానీ ఇవి శరీరంలో అదనపు కేలరీలను పెంచుతాయి. వీటిని అధికంగా తీసుకున్నప్పుడు ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. ఈ నేపథ్యంలోనే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఓ అధ్యయనం చేసింది. వారానికి రెండు లీటర్లు అంతకంటే ఎక్కువ కృత్రిమంగా తయారు చేసి స్వీట్ డ్రింక్స్ తాగడం వల్ల గుండె సమస్యలు 20 శాతం ఎక్కువగా వచ్చే ప్రమాదముందని వారు గుర్తించారు. ఇది మీ గుండె చాలా వేగంగా లేదా చాలా నెమ్మదిగా కొట్టుకునేలా చేస్తుంది అంటున్నారు. 


టైప్ 2 డయాబెటిస్ కూడా..


కూల్​డ్రింక్స్​ని ఎక్కువగా పురుషులు, మరీ ముఖ్యంగా యువత ఎక్కువగా వీటిని తీసుకుంటున్నట్లు గుర్తించారు. కృత్రిమ తీపి పానీయాలు తీసుకునేవారి కంటే.. సహజమైన తీపి పానియాలు మంచిది అంటున్నారు. లేదంటే గుండె సమస్యలతో పాటు టైప్ 2 డయాబెటిస్​కు గురయ్యే ప్రమాదం ఉంది అంటున్నారు. వారానికి ఎక్కువ చక్కెర పానీయాలతో పాటు ధూమపానం అలవాటు ఉండేవారికి ఈ ప్రమాదం 31 శాతం ఎక్కువని తెలిపారు. 


ఈ లక్షణాలు గుర్తిస్తే..


ఈ పరిస్థితికి చేరుకోకూడదంటే బయట దొరికే స్వీట్ పానీయాలకు దూరంగా ఉండాలి. రెండు ఈ సమస్య లక్షణాలు తెలుసుకోవాలి. వాటిని మీరు గుర్తించిన వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే పరిస్థితి విషమించదు. హృదయ స్పందనలో మార్పులు, విపరీతమైన అలసట, గుండె దడ, శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు గుర్తిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇవి పరిస్థితి విషమం కాకుండా హెల్ప్ చేస్తాయి. లేదంటే అది మిమ్మల్ని ప్రమాదకరమైన గుండె సమస్యలవైపు మళ్లిస్తుంది. ఇది పూర్తిగా ప్రాణాంతకమవుతుంది. కాబట్టి హైడ్రేటెడ్​గా ఉండేందుకు నీరు, కొబ్బరినీరు, గ్లూకోజ్ వాటర్ వంటివి తాగవచ్చు. ఇవి మీరు హైడ్రేటెడ్​గా, ఆరోగ్యంగా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. 


Also Read : అధిక కొలెస్ట్రాల్​కు ఇంటి భోజనం మంచి ఔషదమట.. ఉదయాన్నే అవి తింటే ఇంకా మంచిది






గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.