PM Modi Prajagalam Public Meeting at Chilakaluripet: చిలకలూరిపేట: ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేసే ముందు రెండు సంకల్పాలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఒకటి కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, రెండోది.. ఏపీలో అవినీతి వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడటం అని మోదీ అన్నారు. ఏపీ మంత్రులు అవినీతి, అక్రమాల్లో ఒకరితో మరొకరు పోటీపడుతున్నారని.. అందుకే గత ఐదేళ్లు రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని సెటైర్లు వేశారు. సీఎం జగన్ పార్టీ వైసీపీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు అయినా.. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పార్టీలు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలోలో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. 




వైసీపీ పోవాలి, కేంద్రంలో ఎన్డీఏ నెగ్గాలి.. 
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ వైసీపీ పోవాలి, కేంద్రంలో ఎన్డీఏ నెగ్గాలని.. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే అంతా సవ్యంగా సాగుతుందన్నారు. వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఒకే కుటుంబానికి చెందినవారని, అంటే వైసీపీ, కాంగ్రెస్ ఒకటే ఒరలో ఉన్న కత్తులన్నారు. వైసీపీపై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ వైపు మళ్లించడానికి కుట్ర చేస్తున్నారని మోదీ ఆరోపించారు. ప్రజలు అభివృద్ధి కోరుకుంటే తమకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. గత ఐదేళ్లలో రాష్ట్రం ఎంతో వెనకబడి పోయిందని, దాన్ని అదిగమించడం తమ వల్లే సాధ్యమని రాష్ట్ర ప్రజలు గుర్తించాలని పిలుపునిచ్చారు. ఇక్కడ కూటమి, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఉంటే రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, పేదలకు సంక్షేమం అందించడం సాధ్యమని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓ పండుగ లాంటి వాతావరణం కోసం టార్చ్ లైట్ వేసి వెలుగులు నింపాలన్నారు. ఢిల్లీకి ఏపీ ప్రజలు తమ సందేశాన్ని పంపించాలంటే తమకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. 


కాంగ్రెస్ కూటమికి ముందుచూపు లేదు..


‘కాంగ్రెస్ పార్టీకి ముందు చూపు ఉండదు. కేరళలో లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటారు. పశ్చిమ బెంగాల్ లో తృణముల్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఓ రేంజ్‌లో విమర్శించుకుంటాయి. పంజాబ్‌లో కాంగ్రెస్, ఆప్ మార్గాలు వేరు. కానీ I.N.D.I.A కూటమి విషయానికొస్తే జాతీయ స్థాయిలో ఈ పార్టీలు తమ విధానం ఒకటేనని చెప్పి ప్రజల్ని మభ్య పెడుతున్నాయి. జనవరిలో అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం చేసుకున్నాం. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే దివంగత నేత, దిగ్గజ నటుడు వెండితెరపై రాముడు, కృష్ణుడిగా మెప్పించారు. ఎన్డీఆర్ శత జయంతి సందర్భంగా రూ.100 కాయిన్ మేం తీసుకొచ్చాం. పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించాం. పార్టీ ఏదైనా సరే అందర్నీ ఎన్డీఏ సర్కార్ గౌరవిస్తుందనడానికి ఇదే నిదర్శనం.