చికిత్సే లేని భయంకర రోగం హెచ్ఐవీ. చాప కింద నీరులా మనదేశంలో లక్షల మందికి సోకింది ఈ వ్యాధి. అసురక్షిత లైంగిక కార్యకలాపాల వల్లే సోకినట్టు చెబుతోంది జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ. గత పదేళ్లలో కొత్తగా ఎయిడ్స్ బారిన పడిన వారి సంఖ్య పదిహేడు లక్షలుగా తేలింది. మధ్యప్రదేశ్ కు చెందిన కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ హెచ్ఐవీ బాధితులు దేశంలో ఎంత మంది ఉన్నారో? కొత్తగా ఎంతమందికి ఆ వ్యాధి సోకిందో వివరాలు కావాలని సమాచార హక్కు చట్టం ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. అందులో 2011-2021 మధ్యకాలంలో 17,08,777 మంది అసురక్షిత సెక్స్ ద్వారా హెచ్ఐవీ బారిన పడినట్టు నివేదిక ద్వారా తెలిసింది. అయితే గతంతో పోలిస్తే హెచ్ ఐవీ సోకుతున్న రేటు కాస్త నెమ్మదించిందనే చెప్పాలి. 2011-12లో 2.4 లక్షల మందికి హెచ్ఐవీ సోకింది. అదే 2020-21 మధ్య కాలంలో 85,268 మంది ఎయిడ్ బారిన పడినట్టు గుర్తించారు.
ఆంధ్రప్రదేశే టాప్
రాష్ట్రాల వారీగా చూసుకుంటే గత పదేళ్లలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లో 3,18,814 మందికి హెచ్ఐవీ సోకింది. తరువాత మహారాష్ట్రలో 2,84,577 మందికి సోకింది. తమిళనాడులో 1,16,536 మందికి, ఉత్తర ప్రదేశ్లో 1,10,911 మందికి, గుజరాత్ లో 87,440 మందికి సోకినట్టు నిర్ధారించారు.
రక్తం ద్వారా...
2011-12 నుంచి 2020-21 వరకు అసురక్షితంగా రక్తం ఎక్కించడం, రక్తానికి సంబంధించిన చికిత్సల కారణంగా 15, 782 మందికి హెచ్ఐవీ సోకినట్టు నిర్ధారించారు. అంటే వీరు ఎలాంటి అసురక్షిత లైంగిక కార్యకలపాలకు పాల్పడకపోయినా కూడా చిన్నచిన్న పొరపాట్ల వల్ల వైరస్ బారిన పడ్డారు. అంటే ఎయిడ్స్ రోగికి గుచ్చిన సూదినే వీరికి గుచ్చడం, లేదా ఎయిడ్ రోగి రక్తాన్ని వీరికి ఎక్కించడం అలాంటి చర్యల వల్ల వీరు హెచ్ఐవీ రోగులుగా మారారు. అలాగే హెచ్ఐవీ సోకిన తల్లి ద్వారా బిడ్డలకు వ్యాపించిన కేసులు కూడా ఉన్నాయి. అలా 4,423 మంది బిడ్డలు హెచ్ఐవీ బాధితులుగా మారారు. 2020 నాటికి దేశంలో మొత్తం 81,430 మంది పిల్లలు, 23 లక్షల మంది పెద్దలు హెచ్ఐవీతో జీవిస్తున్నట్టు ఆర్టీఐ నివేదిక చెబుతోంది.
హెచ్ఐవీ శరీరంలోకి చేరాక నేరుగా రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది. దీనికి చికిత్స సకాలంలో తీసుకోకపోతే అది ఎయిడ్స్ గా మారుతుంది.
లక్షణాలు ఇలా...
హెచ్ఐవీ సోకిన తరువాత కొన్ని వారాలకు జ్వరం, గొంతునొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిజానికి ఇది పెద్దగా లక్షణాలు చూపించదు. ఎయిడ్స్ గా మారాక మాత్రం బరువు తగ్గిపోవడం, జ్వరం, రాత్రి చెమటలు పట్టడం, విపరీతంగా అలసిపోవడం, ఏ పనీ చేయలేకపోవడం వంటివి కలుగుతాయి. దీనికి చికిత్స లేదు. కానీ కొన్ని మందులు వాడడం ద్వారా ఎక్కువ కాలం జీవించవచ్చు.
Also read: ఎలన్ మస్క్‌ను వేధిస్తున్న ఆరోగ్య సమస్య ఇదే, అందుకేనేమో ఆయన ఆలోచనలు అంత స్పెషల్
Also read: స్లీప్ వాకింగ్‌కు కారణాలివే, ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం పొంచి ఉన్నట్టే