ఐదు మ్యాచ్‌ల తర్వాత సన్‌రైజర్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన థ్రిల్లర్ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై గుజరాత్ టైటాన్స్ చివరి బంతికి ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.
ఆఖరి ఓవర్ దాకా సాగిన థ్రిల్లర్
196 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (68: 38 బంతుల్లో, 11 ఫోర్లు, ఒక సిక్సర్) చెలరేగి ఆడటంతో పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. మరో ఎండ్‌లో శుభ్‌మన్ గిల్ (22: 24 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) చక్కటి సహకారం అందించాడు. మొదటి వికెట్‌కు 69 పరుగులు జోడించిన అనంతరం ఉమ్రాన్ మలిక్ బౌలింగ్‌లో గిల్ అవుటయ్యాడు.
ఈ దశలోనే వృద్ధిమాన్ సాహా అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్లు సరిగ్గా ఆడకపోవడంతో గుజరాత్ 140 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ ఐదు వికెట్లూ ఉమ్రాన్ మలిక్‌కే దక్కడం విశేషం. చివర్లో రాహుల్ తెవాటియా (40: 21 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), రషీద్ ఖాన్ (31: 11 బంతుల్లో, నాలుగు సిక్సర్లు) చెలరేగడంతో గుజరాత్ ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
అదరగొట్టిన అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఆశించిన శుభారంభం దొరకలేదు. ఫాంలో లేక ఇబ్బంది పడుతున్న కెప్టెన్, ఓపెనర్ కేన్ విలియమ్సన్ (5: 8 బంతుల్లో, ఒక ఫోర్) ఈ మ్యాచ్‌లో కూడా విఫలం అయ్యాడు. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠిని (16: 10 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) కూడా గుజరాత్ బౌలర్లు త్వరగా పెవిలియన్‌కు పంపడంతో ఐదు ఓవర్లో 44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి సన్‌రైజర్స్ కష్టాల్లో పడింది.
అయితే ఈ దశలో ఓపెనర్ అభిషేక్ శర్మకు (65: 42 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు) ఎయిడెన్ మార్క్రమ్ (56: 40 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) జత కలిశాడు. వీరిద్దరూ వేగంగా ఆడుతూ రన్‌రేట్ పడిపోకుండా చూశారు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో కొరకరాని కొయ్యగా మారిన రషీద్ ఖాన్‌ను కూడా వీరు వదల్లేదు. రషీద్ ఖాన్ వేసిన నాలుగు ఓవర్లలో ఏకంగా 45 పరుగులు పిండుకున్నారు. అభిషేక్ శర్మ కొట్టిన మూడు సిక్సర్లూ రషీద్ ఖాన్ బౌలింగ్‌లోనే వచ్చాయి.
మూడో వికెట్‌కు 61 బంతుల్లోనే 96 పరుగులు జోడించిన అనంతరం ఇన్నింగ్స్ 16వ ఓవర్లో అభిషేక్ శర్మ అవుటయ్యాడు. అప్పటికే తన అర్థ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత ఎయిడెన్ మార్క్రమ్ కూడా వేగంగా ఆడే ప్రయత్నంలో అవుటయ్యాడు. నికోలస్ పూరన్ (3: 5 బంతుల్లో), వాషింగ్టన్ సుందర్ (3: 4 బంతుల్లో) ఇద్దరూ విఫలం అయ్యారు.
అయితే చివరి ఓవర్లో మార్కో జాన్సెన్ (8: 5 బంతుల్లో, ఒక సిక్సర్) ఒకటి, శశాంక్ సింగ్ (25: 6 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు) మూడు సిక్సర్లు కొట్టారు. దీంతో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో వికెట్ల నష్టానికి పరుగులకు 195 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్క్రమ్, అభిషేక్ శర్మ ఉన్నంతసేపు స్కోరు 200ను చేరుతుందనిపించినా... తర్వాత వేగం బాగా తగ్గింది. కానీ చివర్లో జాన్సెన్, శశాంక్ దూకుడు కారణంగా భారీ స్కోరు సాధించింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహ్మద్ షమీకి మూడు వికెట్లు దక్కాయి. యష్ దయాళ్, అల్జారీ జోసెఫ్ చెరో వికెట్ తీసుకున్నారు.