ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ భారీ స్కోరు నమోదు చేసింది. 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (65: 42 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (56: 40 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) అర్థ సెంచరీలు సాధించారు. గుజరాత్ టైటాన్స్ విజయానికి 120 బంతుల్లో 196 పరుగులు కావాలి.


టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఆశించిన శుభారంభం దొరకలేదు. ఫాంలో లేక ఇబ్బంది పడుతున్న కెప్టెన్, ఓపెనర్ కేన్ విలియమ్సన్ (5: 8 బంతుల్లో, ఒక ఫోర్) ఈ మ్యాచ్‌లో కూడా విఫలం అయ్యాడు. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠిని (16: 10 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) కూడా గుజరాత్ బౌలర్లు త్వరగా పెవిలియన్‌కు పంపడంతో ఐదు ఓవర్లో 44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి సన్‌రైజర్స్ కష్టాల్లో పడింది.


అయితే ఈ దశలో ఓపెనర్ అభిషేక్ శర్మకు ఎయిడెన్ మార్క్రమ్ జత కలిశాడు. వీరిద్దరూ వేగంగా ఆడుతూ రన్‌రేట్ పడిపోకుండా చూశారు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో కొరకరాని కొయ్యగా మారిన రషీద్ ఖాన్‌ను కూడా వీరు వదల్లేదు. రషీద్ ఖాన్ వేసిన నాలుగు ఓవర్లలో ఏకంగా 45 పరుగులు పిండుకున్నారు. అభిషేక్ శర్మ కొట్టిన మూడు సిక్సర్లూ రషీద్ ఖాన్ బౌలింగ్‌లోనే వచ్చాయి.


మూడో వికెట్‌కు 61 బంతుల్లోనే 96 పరుగులు జోడించిన అనంతరం ఇన్నింగ్స్ 16వ ఓవర్లో అభిషేక్ శర్మ అవుటయ్యాడు. అప్పటికే తన అర్థ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత ఎయిడెన్ మార్క్రమ్ కూడా వేగంగా ఆడే ప్రయత్నంలో అవుటయ్యాడు. నికోలస్ పూరన్ (3: 5 బంతుల్లో), వాషింగ్టన్ సుందర్ (3: 4 బంతుల్లో) ఇద్దరూ విఫలం అయ్యారు.


అయితే చివరి ఓవర్లో మార్కో జాన్సెన్ (8: 5 బంతుల్లో, ఒక సిక్సర్) ఒకటి, శశాంక్ సింగ్ (25: 6 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు) మూడు సిక్సర్లు కొట్టారు. దీంతో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో వికెట్ల నష్టానికి పరుగులకు 195 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్క్రమ్, అభిషేక్ శర్మ ఉన్నంతసేపు స్కోరు 200ను చేరుతుందనిపించినా... తర్వాత వేగం బాగా తగ్గింది. కానీ చివర్లో జాన్సెన్, శశాంక్ దూకుడు కారణంగా భారీ స్కోరు సాధించింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహ్మద్ షమీకి మూడు వికెట్లు దక్కాయి. యష్ దయాళ్, అల్జారీ జోసెఫ్ చెరో వికెట్ తీసుకున్నారు.