IPL 2022 srh bowlers best stats natarajan bhuvi leading the bowling unit from the front : ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) బౌలర్లు అద్భుతాలు చేస్తున్నారు! ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నారు. ఒకరు స్వింగ్‌తో తికమక పెడితే మరొకరు యార్కర్లతో ఇబ్బంది పెడుతున్నారు. ఒకరు స్పీడ్‌తో చంపేస్తుంటే ఇంకొకరు బౌన్స్‌తో దుమ్మురేపుతున్నారు. ఎకానమీ, సగటు, డెత్ ఓవర్స్ వికెట్లతో హైదరాబాదీ బౌలర్లు ఆహా! అనిపిస్తున్నారు.
బౌలింగ్ సెంట్రిక్ టీమ్
ఇండియన్ ప్రీమియర్ లీగు (IPL) చరిత్రలోనే బౌలింగ్ కేంద్రంగా నడిచే జట్టేదైనా ఉందంటే అది సన్‌రైజర్స్ హైదరాబాదే! ఈ సీజన్లోనే కాదు ఐదారేళ్లుగా ఇదే ఫార్ములాను ఫ్రాంచైజీ ఫాలో అవుతోంది. ఇందుకు కారణం కోచ్ టామ్ మూడీ (Tom Moody)! ఒక జట్టు గెలవాలంటే బ్యాటింగ్ ఎంత ముఖ్యమో బౌలింగూ అంతే! ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన టామ్ మూడీకి మొదట్నుంచీ బౌలింగ్ సెంట్రిక్ క్రికెట్ అంటేనే ఇష్టం. బిగ్‌బాష్‌లోనూ అతడిలాగే కోచింగ్ ఇచ్చి ట్రోఫీలు సాధించాడు. అందుకే హైదరాబాద్ మెరుగైన బ్యాటింగ్ చేయకపోవడం వల్ల ఓడిపోతుందేమో కానీ బౌలింగ్ మాత్రం దాదాపుగా ఉండదు!
బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్!
ఐపీఎల్ 2022లో యావరేజ్, ఎకానమీ ప్రకారం సన్‌రైజర్స్ హైదరాబాదే ది బెస్ట్ (SRH)! ఈ సీజన్లో ఇప్పటి వరకు హైదరాబాద్ 7 మ్యాచులు ఆడింది. బౌలర్లు 136 ఓవర్లు విసిరి 1076 పరుగులు ఇచ్చారు. 52 వికెట్లు పడగొట్టారు. స్ట్రైక్‌రేట్ 15.7. నాలుగు వికెట్ల ఘనత ఒకసారి అందుకున్నారు. బౌలింగ్ యావరేజ్ 20.96. అంటే రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ (24.70) కన్నా నాలుగు తక్కువ. ఎకానమీలోనూ సన్‌రైజర్సే టాప్. ఓవర్‌కు 7.99 రన్స్ మాత్రమే ఇస్తున్నారు. రెండో స్థానంలోని గుజరాత్ టైటాన్స్ 8.22 పరుగులు ఇవ్వడం గమనార్హం. మొత్తంగా డెత్ ఓవర్లలో ఎక్కువ వికెట్లు తీసిందీ హైదరాబాదే. 21 వికెట్లు పడగొట్టారు.
నట్టూ టు భువీ!
ఐపీఎల్ 2022 మెగా వేలంలో దాదాపుగా పాత బౌలర్లనే తీసుకోవడంతో ఫ్యాన్స్ పెదవి విరిచారు! భువనేశ్వర్ వంటి సీనియర్లు ఫామ్‌లో లేరని అన్నారు. అప్పటికి నటరాజన్(T Natarajan) గాయపడి ఇంకా నిరూపించుకోలేదు. ఒకట్రెండు మ్యాచులు ముగిసేసరికి బౌలర్లంతా ఫామ్‌లోకి వచ్చేశారు. ముఖ్యంగా నటరాజన్ అక్యూరేట్‌గా విసిరే యార్కర్లకు క్రీజులోని బ్యాటర్ల వద్ద జవాబే ఉండటం లేదు. ఈ సీజన్లో పవర్‌ప్లే, డెత్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఏకైక బౌలర్ అతడు. 8.07 ఎకానమీతో 15 వికెట్లు తీశాడు. 3/10 బెస్ట్. ఇక భువీ తన మునుపటి ఫామ్ అందుకున్నాడు. బంతిని రెండువైపులా స్వింగ్ చేస్తూ పరుగుల్ని నియంత్రిస్తున్నాడు. 7.41 ఎకానమీతో 9 వికెట్లు తీశాడు. ఉమ్రాన్ మాలిక్ యావరేజ్‌గా 145 కి.మీ వేగంతో బంతులేస్తూ భయపెడుతున్నాడు. మార్కో జన్‌సెన్ బౌన్స్‌ను అందిపుచ్చుకుంటున్నాడు.