ట్విట్టర్ సంస్థను కొనుగోలు చేసి ఎలన్ మస్క్ వార్తల్లో నిలిచారు. అందులో వందశాతం వాటాను తానే సొంతం చేసుకుని తన ప్రైవేటు సంస్థల్లో ఒకటిగా ట్విట్టర్‌ను మార్చేసుకున్నారు. టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి పెద్ద సంస్థల అధినేత, ఇప్పుడు మరో అతి పెద్ద సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌కు ఓనర్ అయ్యారు. ఎలన్ మస్క్ ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. రిస్క్ లు చేయడంలో ఈయన ముందుంటారు. ఏ అంశంపైనైనా భయపడకుండా, తన వ్యాపారానికి ఏమవుతుందో అన్న చింత లేకుండా స్పందిస్తుంటారు. అంతెందుకు మొన్నటికి మొన్న ఉక్రెయిన్ - రష్యా యుద్ధం పై స్పందించినప్పుడు ‘పుతిన్ నాతో యుద్ధం చెయ్’ అని కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇలాంటి సంచలన వ్యాఖ్యలు, సంచలన నిర్ణయాలు ఎన్నో. దీనికంతటికీ కారణం తనకున్న ఆరోగ్య సమస్యలే అని చెప్పుకుంటారాయన. ‘సాటర్డే నైట్ లైవ్’ అనే అమెరికన్ కార్యక్రమానికి హోస్ట్ గా పనిచేశారు ఎలన్ మస్క్. ఆ సమయంలోనే తన ఆరోగ్య సమస్య గురించి బయటపెట్టారు. అదే ‘అస్పెర్గర్స్ సిండ్రోమ్’. ఇది కూడా ఆటిజం స్పెక్ట్రమ్‌కే చెందుతుంది. ఇది ఒక న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్. ఇది ఎందుకు వస్తుందన్నది కచ్చితంగా చెప్పలేం. మెదడులో సమస్య వల్ల లేదా వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 


లక్షణాలు ఇలా ఉంటాయి
ఆస్పెర్గర్స్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులు సామాజికంగా, కమ్యూనికేషన్ పరంగా చాలా ప్రత్యేకంగా ఉంటారు. వివిధ లక్షణాలను ప్రదర్శిస్తారు. 
1. నాన్ వెర్బల్ సంభాషణలను వీరు త్వరగా అర్థం చేసుకోలేరు. 
2. కొన్ని విషయాల్లో చాలా దూకుడుగా ఉంటారు. ఆకస్మికంగా నిర్ణయాలు మార్చేసుకుంటారు. 
3. వారి సోషల్ స్కిల్స్ చాలా పరిమితంగా ఉంటాయి. 
4. అధిక శబ్ధాలను లేదా అధిక వెలుతురును భరించలేరు. 
5. ప్రసంగించేటప్పుడు చాలా బిగ్గరగా చెబుతారు, లేదా ఒక్కోసారి చాలా నిశ్శబ్ధంగా ఉండిపోతారు. 
6. ఇతర వ్యక్తుల వైపు నుంచి ఆలోచించలేరు. 
7. వ్యక్తీకరించడంలో ఇబ్బంది పడుతుంటారు.
8. ఏదైనా విషయాన్ని పునరావృత అలవాటును కలిగి ఉంటారు. అంటే చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పడం, చేసిన పనే చేయడం ఇలా. 


చికిత్స ఏమిటి?
ఆస్పెర్గర్స్ సిండ్రోమ్ చిన్న వయసులోనే బయటపడుతుంది. దీన్ని పీడియాట్రిక్ న్యూరాలజిస్టులు, సైకాలజిస్టులు కనిపెట్టగలరు. దీనికి ఎటువంటి చికిత్స లేదు కానీ లక్షణాలను కంట్రోల్ లో పెట్టుకునే థెరపీలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. ఈ సిండ్రోమ్ ప్రతి వ్యక్తిలో ఒకేలా ఉండాలని లేదు, మనిషి మనిషికి మారుతుంది. చికిత్స కూడా వ్యక్తులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎలాంటి చికిత్సలు చేస్తారంటే..


1.కొన్ని మందులను సూచిస్తారు. 
2. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీని అందిస్తారు. 
3. ఆక్యుపేషనల్ థెరపీ
4. సోషల్ స్కిల్స్ ట్రైనింగ్ 
5. చక్కగా మాట్లాడగలిగేలా స్పీచ్ థెరపీ, అలాగే లాంగ్వేజీ థెరపీ ఇస్తారు. 
ఎలన్ మస్క్ ఇలాంటి థెరపీలతోనే తన సమస్యను అదుపులో ఉంచుకోగలిగారు.


Also read: స్లీప్ వాకింగ్‌కు కారణాలివే, ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం పొంచి ఉన్నట్టే


Also read: పీరియడ్స్ సక్రమంగా రావాలా? ఈ పానీయాలు ప్రయత్నించండి