మహిళల ఆరోగ్యం పీరియడ్స్‌పై ఆధారపడి ఉంటాయి. పీరియడ్స్ కేవలం పునరుత్పత్తి వ్యవస్థ పనితీరును సూచించడమే కాదు, స్త్రీల ఆరోగ్యాన్ని కూడా  సూచిస్తుంది. పీరియడ్స్ సరిగా రాని మహిళల్లో మానసిక ఆందోళనలు, యాంగ్జయిటీ పెరుగుతాయి. ఇంకా ఇతర గర్భకోశ సమస్యలు, బరువు పెరగడం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం అధికం. ప్రతినెలా పీరియడ్స్ సమయానికి రావాలంటే కొన్నిరకాల పానీయాలు సహకరిస్తాయి. వీటిని  క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రుతు చక్ర సమస్యలు తగ్గుతాయి. సమయానికి పీరియడ్స్ వస్తాయి. 


అల్లం టీ
అల్లంతో ఇంట్లోనే టీ చేసుకుని అప్పుడప్పుడు తాగడం మంచిది. ఇది పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించడమే కాదు, సక్రమంగా వచ్చేలా కూడా చేస్తుంది. అల్లం టీలో జింజెరోల్ ఉంటుంది. ఇది రుతుచక్రాన్ని క్రమబద్ధీకరిస్తుంది. 


ఎలా చేయాలి?
గిన్నెలో ఒక కప్పు నీళ్లు పోయాలి. నీళ్లు మరిగాక అల్లం దంచి వేయాలి. మూడు నిమిషాలు మరిగాక స్టవ్ కట్టేయాలి. కాస్త చల్లారాక వడకట్టి ఆ టీని తాగేయాలి. 


ఆపిల్ సిడర్ వెనిగర్
ఆపిల్ సిడర్ వెనిగర్ శరీరాన్ని ఆల్కలైజ్ చేసి పీరియడ్స్ వచ్చేలా ప్రేరేపిస్తుంది. అంతేకాదు హార్మోన్ల అసమతుల్యతను వల్ల కలిగే వాపులు, మంటలను తగ్గిస్తుంది. పీసీఓడీ సమస్యతో బాధపడేవారికి ఈ పానీయం చాలా మేలు చేస్తుంది.


ఎలా తాగాలి?
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూను ఆసిల్ సిబర్ వెనిగర్ కలిపి రోజూ తాగేయాలి. మీకు పీరియడ్స్ సకాలంలో రావాలంటే, పీరియడ్స్ తేదీకి కనీసం వారం ముందు నుంచి దీన్ని తాగడం ప్రారంభించండి. 


జీలకర్ర టీ 
జీలకర్ర లేకుండా కూరలు వండరు తెలుగిళ్లల్లో. జీలకర్రలు గర్భాశయ కండరాలను సంకోచించేలా చేసి పీరియడ్స్ వచ్చేలా చేస్తుంది. దీన్ని మీ పీరియడ్స్ తేదీకి ఒక వారం ముందు నుంచి తాగితే మంచిది.


ఎలా తాగాలి?
గిన్నలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఒక స్పూను జీలకర్రను వేసి మరిగించాలి. ఆ మిశ్రమాన్ని రెండు నిమిషాల పాటూ మరిగించాలి. స్టవ్ కట్టేసి రాత్రంతా అలా నాననివ్వాలి. ఉదయం లేచాక పరగడుపున ఖాళీ పొట్టతో ఈ జీలకర్ర నీటిని తాగాలి. 


పైనాపిల్ జ్యూస్
పైనాపిల్ పండ్లు తిన్నా, లేక జ్యూసు తీసుకుని తాగినా చాలా మంచిది.ఇందులో బొమెలైన్ అనే ఎంజైమ్ లభిస్తుంది. ఈ ఎంజైమ్ గర్భాశయ పొరలపై ఒత్తిడి కలిగిస్తుంది. దీనివల్ల పీరయడ్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి పీరియడ్స్ సమయంలో పైనాపిల్ జ్యూసులను తాగితే మంచిది. శరీరంలో తెల్ల, ఎరుపు రక్తకణాల సంఖ్యను కూడా ఇది పెంచుతుంది. 


పసుపు టీ
పసుపు మంచి యాంటీబ్యాక్టిరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది గర్భాశయం, కటి ప్రాంతంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. పసుపు శరీరంపై యాంటీస్పాస్మోడిక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దీని వల్ల గర్భాశయాన్ని విస్తరించి రుతుస్రావం మొదలవుతుంది. 


ఎలా తాగాలి?
ఒక కప్పు నీటిని వేడి చేసి, అర స్పూను పసుపు పొడి కలపాలి. రెండు నిమిషాలు మరిగించాలి. ఆ టీని గోరువెచ్చగా తాగాలి. పసుపు టీ నచ్చక పోతే పసుపు పాలు తాగినా మంచిదే. 


Also read: ఒక కప్పు హలీమ్ తింటే ఆ పూట భోజనం అవసరం లేదు, ఎంతో శక్తి, ఆరోగ్యం కూడా


Also read: కొందరి మహిళల్లో గర్భాశయంలో గడ్డలు ఎందుకు ఏర్పడతాయి? ముందుగా అడ్డుకోలేమా?