MHSRB Staff Nurse Posts: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. పలు నియామక పరీక్షలు వాయిదాపడగా.. కొన్ని ఉద్యోగాల ప్రక్రియ ముందుకు సాగడంలేదు. ఇందులో ముఖ్యంగా వైద్యారోగ్యశాఖలో 7,356 స్టాఫ్ నర్స్ నియామకాలు ముందుకు కదలడంలేదు. నియామకాల ప్రక్రియ కొనసాగింపు కోసం వేలమంది నిరుద్యోగులు కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. 


వైద్యారోగ్యశాఖలో కీలక విభాగాల్లో నియామకాల ప్రక్రియను రాష్ట్ర మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) చేపట్టింది. ఇందులో భాగంగా బోధనాసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, వైద్య విధానపరిషత్ ఆసుపత్రులు, గురుకుల పాఠశాలలు సహా వివిధ వైద్య విభాగాల్లో 5,204 మంది స్టాఫ్ నర్సుల నియామకానికి ఈ ఏడాది జనవరిలో ఉద్యోగ ప్రకటన వెలువడింది. సుమారు 40 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకోగా, రాత పరీక్ష నిర్వహించి కీ‌ని కూడా విడుదల చేశారు. రెండు నెలల క్రితమే అభ్యంతరాలు స్వీకరించారు. మెరిట్ జాబితా విడుదలచేసి, నియామక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. ఎన్నికల నేపథ్యంలో ప్రక్రియను అధికారులు నిలిపేశారు. తిరిగి దాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు, నియామక ఉత్తర్వులు ఎప్పుడిస్తారనే సమాచారమూ ఇవ్వలేదు.


దీంతోపాటు ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలో 1,996 మంది ఏఎన్‌ఎంల నియామకానికి ఆగస్టులో ప్రకటన వెలువడగా దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. దరఖాస్తులు భారీగా వచ్చాయి. నవంబరు 10న రాతపరీక్ష నిర్వహించాల్సి ఉండగా వాయిదా పడింది. రాత పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారనే సమాచారమూ బోర్డు నుంచి వెలువడకపోవడంతో దరఖాస్తుదారులంతా ఆందోళన చెందుతున్నారు. ఆయుష్ విభాగంలో 156 మంది వైద్యుల నియామక ప్రక్రియకు ఆగస్టులో ప్రకటన వెలువడింది. దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. తదుపరి నియామక ప్రక్రియ నిల్చిపోయింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో త్వరగా ఆయా పోస్టుల భర్తీపై స్పష్టత ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు.


గత ప్రభుత్వం నర్సింగ్ సిబ్బందికి హోదా మార్పు చేసిన సంగతి తెలిసిందే. స్టాఫ్ నర్స్‌ను నర్సింగ్ ఆఫీసర్‌గా, హెడ్‌నర్స్‌ను సీనియర్ నర్సింగ్ ఆఫీసర్‌గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-2ను డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్‌గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-1ను చీఫ్ నర్సింగ్ ఆఫీసర్‌గా మార్పులు చేసింది. వైద్యారోగ్యశాఖతోపాటు, ఇతర శాఖల్లో విధులు నిర్వర్తించే నర్సింగ్ సిబ్బందికి ఈ మార్పులు వర్తిస్తాయని ఆదేశాల్లో పేర్కొంది. పబ్లిక్ హెల్త్ విభాగంలోని దవాఖానల్లో పనిచేసే పబ్లిక్ హెల్త్ నర్స్ పోస్టును పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్‌గా, డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల్లో మార్పు చేయలేదు.


ALSO READ:


టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 పరీక్ష మళ్లీ వాయిదా? కొత్త బోర్డు ఆధ్వర్యంలోనే పరీక్షలు!
తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష మళ్లీ వాయిదాపడేలా కనిపిస్తోంది. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ తొలుత భావించింది. అయితే నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. నవంబరు 3 నుంచి అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ చేపట్టడంతో 2024 జనవరి 6, 7 తేదీలకు పరీక్షలు రీషెడ్యూల్ అయ్యాయి. అయితే, టీఎస్‌పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన నేపథ్యంలో.. కొత్త బోర్డు ఏర్పాటు తర్వాతే పరీక్షలు నిర్వహించాలని, వచ్చే నెలలో జరగాల్సిన పరీక్షలను రీషెడ్యూలు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


జెన్‌‌కో నియామక పరీక్షలు వాయిదా, త్వరలో కొత్త తేదీల వెల్లడి
తెలంగాణ స్టేట్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(TSGENCO)లో ఏఈ (Assistant Engineer), కెమిస్ట్‌ (Chemist) ఉద్యోగాల నియామక రాతపరీక్ష వాయిదాపడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. డిసెంబర్‌ 17న నిర్వహించాల్సిన నియామక పరీక్షలను, ఇతర పరీక్షలు ఉన్నందున జెన్‌కో పోస్టుల పరీక్షలను వాయిదా వేసినట్లు తెలంగాణ జెన్‌కో వెల్లడించింది. పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు సంస్థ తెలిపింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...