Six Guarantee Schemes Card: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలకు డిమాండ్ మామూలుగా లేదు. ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేస్తోంది ప్రభుత్వం. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అమల్లోకి వచ్చింది. ఆరోగ్య శ్రీ పథకం పరిమితిని కూడా 10 లక్షలకు పెంచింది. ఈ రెండు అమల్లోకి వచ్చినా మిగతావి ఎప్పటి నుంచి అమలు చేస్తారో అనే చర్చ ప్రజల్లో ఉంది. వాటి విధి విధానాలు ఎలా ఉంటాయో అని ప్రజలలు కలిసిన వారందర్నీ అడుగుతున్నారు. కాస్త ఇంటర్నెట్ అనుభవం ఉన్న వాళ్లు నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు. న్యూస్‌ వెబ్‌ బస్‌సైట్‌లను కూడా వదలడం లేదు. 


సందట్ల సడేమీయా అన్నట్టు దీన్నే క్యాష్ చేసుకునేందుకు కొందరు కేటుగాళ్లు కూడా సిద్ధమైపోయారు. అచ్చంపేట జిల్లా కేంద్రంలో జరిగిన మోసం గురించి తెలిసి ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారు. జిరాక్స్ సెంటర్‌ వేదికగా మోసానికి తెరలేపారు. ఆరు గ్యారంటీలపై జరుగుతున్న చర్చను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. 


ఆరు గ్యారంటీలకు ప్రత్యేక కార్డులు వచ్చాయని ఆ కార్డులు ఉంటే తప్ప పథకాలు అందవనే పుకార్లను ప్రచారం చేశారు. ఇది నమ్మిన జనం కార్డుల కోసం ఎగబడ్డారు. ఇదే ఛాన్స్ అనుకున్న ఆ వ్యక్తి ఒక్కో కార్డును 50 రూపాయల చొప్పున అమ్మడం స్టార్ట్ చేశారు. ఇంకేముంది జనాలంతా ఎగబడ్డారు. భారీగా జనం రావడంతో కావాల్సిన కార్డులు ప్రింట్ చేయలేక చేతులు ఎత్తేశాడు. దీంతో జనం ఆందోళనకు దిగారు. అంతే అసలు మోసం వెలుగులోకి వచ్చింది. ఆయన చేసిన మోసం విన్న జనం ఒక్కసారిగా ఆయనపై తిరగబడ్డారు. ఆ వ్యక్తిని నిలదీశారు. 


ప్రభుత్వం రెండు పథకాలకు సంబంధించిన విధివిధనాలు మాత్రమే ఖరారు చేసిందని అధికారులు చెబుతున్నారు. మిగతా నాలుగు గ్యారంటీలపై ఇంకా అధికారులు అధ్యయనం చేస్తున్నారు. వాటిని ఎప్పటి నుంచి అమలు చేస్తారో అన్నదానిపై క్లారిటీ లేదంటున్నారు. ఎలాంటి ప్రకటన చేసినా ప్రభుత్వ క్షేత్రస్థాయి అధికారులకు సమాచారం ఇస్తుందని వారి ద్వారానే ఏదైనా చెబుతుందని అంటున్నారు. అధికారులు కాకుండా వేరే వాళ్లు చెప్పిన విషయాలు నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు.