మొదటి టీట్వంటీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవటంతో..ఎంతో ఆసక్తి నెలకొన్న రెండో టీ20 మ్యాచ్ లోనూ వర్షమే భారత్ పాలిట విలన్ గా మారింది. సౌతాఫ్రికాలోని గబేహాలో భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో అన్ని విభాగాల్లోనూ సత్తా చాటిన సౌతాఫ్రికా ఘనవిజయం సాధించింది.


తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే భారీ దెబ్బ పడింది. ఖాతా తెరవకుండానే ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, శుభ్ మాన్ గిల్ డక్ అవుట్‌గా వెనుదిరిగారు. ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌ను తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆదుకున్నారు. తిలక్ నాలుగుఫోర్లు ఓసిక్స్ తో 29పరుగులు చేస్తే..కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన స్కై ఐదుఫోర్లు, మూడుసిక్సర్లతో 56పరుగులు చేసి టీమ్ ను నిలబెట్టాడు. తిలక్ అవుటయ్యాక వచ్చిన రింకూసింగ్ ప్రారంభంలో నెమ్మదిగా ఆడినా..ఎండ్ ఆఫ్ ది గేమ్ వచ్చేప్పటికి రెచ్చిపోయాడు. 9ఫోర్లు 2 సిక్సర్లతో 39బంతుల్లోనే 68పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.


19.3 ఓవర్లలో భారత్ 180పరుగులు చేసిన టైమ్‌లో వర్షం మొదలైంది. దీంతో భారత్ స్కోరు అక్కడే నిలిచిపోయింది. వాస్తవానికి ఈ పిచ్‌పై 180 పరుగులు భారీస్కోరే అయినా వర్షం కారణంగా పిచ్ పరిస్థితులు మారిపోయాయి. బంతి బ్యాట్ మీదకు తేలికగా రావటంతో సౌతాఫ్రికాకు పని ఈజీ అయిపోయింది.


డక్ వర్త్ లూయిస్ ప్రకారం సఫారీలకు 15ఓవర్లలో 152పరుగులుగా డిసైడ్ చేయగా..మొదటి మూడు ఓవర్లలోనే దాదాపు మ్యాచ్ ను వాళ్లవైపు తిప్పేసుకున్నారు దక్షిణాఫ్రికా బ్యాటర్లు. ఓపెనర్ రెజా హెండ్రిక్స్ 49పరుగులు, కెప్టెన్ మార్క్రమ్ 30పరుగులు చేశారు. భారత బౌలర్లు అర్ష్ దీప్, ముకేశ్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.


అడపాదడపా భారత్ బౌలర్లు వికెట్లు తీసినా 13.5ఓవర్లలోనే 154పరుగులు చేసింది సౌతాఫ్రికా. పొదుపుగా బౌలింగ్ చేసిన సౌతాఫ్రికా బౌలర్ తబ్రీజ్ షంసికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ సిరీస్ ను భారత్ ఓడిపోకూడదంటే గురువారం జరిగే ఆఖరి మూడో టీ20 మ్యాచ్ ను కచ్చితంగా గెలిచి తీరాలి.