UPSC Civil Services Candidates Marks Sheet: యూపీఎస్సీ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 తుది ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏప్రిల్ 19న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ర్యాంకులవారీగా అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను అందుబాటులో ఉంచింది. తుది ఫలితాల ద్వారా మొత్తం 1,016 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిలో జనరల్-347, ఈడబ్ల్యూఎస్-115, ఓబీసీ-303, ఎస్సీ-165, ఎస్టీ-86 మంది అభ్యర్థులు ఉన్నారు. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఏప్రిల్ 16న తుది ఫలితాలను ప్రకటించిన యూపీఎస్సీ తాజాగా అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను ప్రకటించింది.
సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో యూపీకి చెందిన ఆదిత్య శ్రీవాస్తవ తొలి ర్యాంకు సాధించగా, ఒడిశాకు చెందిన అనిమేశ్ ప్రధాన్ రెండో ర్యాంకు, పాలమూరుకు చెందిన దోనూరు అనన్యరెడ్డి జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించింన సంగతి తెలిసిందే. తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు వందలోపు ర్యాంకులు, 11 మంది 200లోపు ర్యాంకులతో సత్తా చాటారు. 2 రాష్ట్రాల నుంచి విజేతలుగా నిలిచినవారిలో మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. ఈ ఏడాది దాదాపు 60 మంది తెలుగు అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు.
సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన అభ్యర్థుల మార్కుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్-10 అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలు..
అభ్యర్థి పేరు | సాధించిన ర్యాంకు | మెయిన్స్ మార్కులు | ఇంటర్వూ మార్కులు | మొత్తం మార్కులు |
ఆదిత్య శ్రీవాత్సవ | 1వ ర్యాంకు | 899 | 200 | 1099 |
అనిమేష్ ప్రధాన్ | 2వ ర్యాంకు | 892 | 175 | 1067 |
దోనూరు అనన్య రెడ్డి | 3వ ర్యాంకు | 875 | 190 | 1065 |
పి.కె. సిద్ధార్థ్ రామ్‌కుమార్ | 4వ ర్యాంకు | 874 | 185 | 1059 |
రుహానీ | 5వ ర్యాంకు | 856 | 193 | 1049 |
సృష్టి దేబాస్ | 6వ ర్యాంకు | 862 | 186 | 1048 |
అనుమోల్ రాథోడ్ | 7వ ర్యాంకు | 839 | 206 | 1045 |
ఆశిష్ కుమార్ | 8వ ర్యాంకు | 866 | 179 | 1045 |
నౌసిన్ | 9వ ర్యాంకు | 863 | 182 | 1045 |
ఐశ్వర్యం ప్రజాపతి | 10వ ర్యాంకు | 890 | 154 | 1044 |
గతేడాది సెప్టెంబర్ 15 నుంచి 24 వరకు సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మెయిన్ పరీక్ష ఫలితాలు డిసెంబరు 8న యూపీఎస్సీ విడుదల చేసింది. మెయిన్ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల్లో మొత్తం 2,844 మంది ఇంటర్వ్యూలకు అర్హత సాధించారు. మెయిన్ పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్)కు షార్ట్ లిస్ట్ చేశారు. వీరికి ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. గత మే నెలలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు సుమారు 5.5 లక్షల మంది హాజరుకాగా.. అందులో 14,624 మంది ప్రధాన పరీక్షలకు అర్హత సాధించారు.
మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మొదటి విడతలో జనవరి 2 నుంచి ఫిబ్రవరి 16 వరకు ఇంటర్వ్యూ(పర్సనాలిటీ టెస్ట్)లు నిర్వహించారు. మొదటి విడత ఇంటర్వ్యూకు మొత్తం 1026 మంది ఎంపికయ్యారు. ఇక రెండో విడత ఇంటర్వ్యూ షెడ్యూలును జనవరి 25న విడుదల చేయగా..1003 మంది ఎంపికయ్యారు. వీరికి ఫిబ్రవరి 19 నుంచి మార్చి 15 వరకు పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇక చివరి విడతలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 9 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. మొత్తం 817 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. మొత్తం మూడు విడతలు కలిపి 2846 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించగా మొత్తం 1016 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు.