IPL 2024 CSK vs LSG: లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (40 బంతుల్లో 57 నాటౌట్; 5x4, 1x6) హాఫ్ సెంచరీతో రాణించడంతో పాటు మాజీ కెప్టెన్ ధోనీ మెరుపు ఇన్నింగ్స్ (9 బంతుల్లో 28 నాటౌట్; 3x4, 2x6) సీఎస్కే ఓ మోస్తరు స్కోరు చేసి లక్నోకు 177 టార్గెట్ ఇచ్చింది. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టాడు. మోసిన్ ఖాన్, యష్ ఠాకూర్, రవి బిష్ణోయ్, స్టోయినిస్  తలో వికెట్ తీశారు.






లక్నోతో జరుగుతోన్న మ్యాచ్లో చెన్నైకి శుభారంభం లభించలేదు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో తొలి బంతికే రచిన్ రవీంద్ర డకౌట్ అయ్యాడు. మోసిన్ ఖాన్ బౌలింగ్ రచిన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులో నిలదొక్కుకోవడానికి ఇబ్బండి పడిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (17)ను యష్ ఠాకూర్ పెవిలియన్ బాట పట్టించాడు. కీపర్ రాహుల్ క్యాచ్ పట్టడంతో రుతురాజ్ రెండో వికెట్ గా నిష్క్రమించాడు. రవీంద్ర జడేజా, వెటరన్ అజింక్యా రహానే (36) కాసేపు ఇన్నింగ్స్ నడిపించారు. వేగంగా ఆడేందుకు ప్రయత్నించిన రహానే పాండ్యాకు చిక్కాడు స్కోరుబోర్డును నడిపించే క్రమంలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరోవైపు లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.


మంచి ఫామ్ లో ఉన్న శివం దుబే (3) క్రీజులో నిలదొక్కుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. స్టోయినిస్ బౌలింగ్ లో ఆడిన బంతిని కీపర్ రాహుల్ క్యాచ్ పట్టడంతో 87 పరుగుల వద్ద నాలుగో వికెట్ గా పెవిలియన్ చేరాడు. మరో ఎండ్ లో జడేజా వీలు చిక్కినప్పుడల్లా చెత్త బంతుల్ని బౌండరీలకు తరలిస్తూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ కెరీర్ లో మూడో హాఫ్ సెంచరీ సాధించాడు. సమీర్ రిజ్వి (1) మరోసారి నిరాశ పరచగా, వెటరన్ మొయిన్ అలీ (20 బంతుల్లో 30) చేశాడు. రవి బిష్ణోయి బౌలింగ్ లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన అలీ తరువాత బంతికి క్యాచ్ ఔటయ్యాడు.






మెయిన్ అలీ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ధోనీ భారీ షాట్లపై ఫోకస్ చేశాడు. కేవలం 9 బంతులే ఆడిన ధోనీ 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. చివర్లో వింటేజ్ ధోనీ మెరుపు బ్యాటింగ్ తో లక్నోకు 177 పరుగుల టార్గెట్ ఇవ్వగలిగింది సీఎస్కే. లక్నోతో మ్యాచ్ లో భాగంగా ధోనీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ లో 5000 పరుగులు చేసిన వికెట్ కీపర్ గా ధోనీ నిలిచాడు.