Telangana Jobs Notification of 13000 vacancies in the Health Department తెలంగాణలో ఇటీవల పోలీసు ఉద్యోగాలకు తొలి నోటిఫికేషన్ విడుదలైంది. ఆ తరువాత రాష్ట్రంలో తొలిసారిగా గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు నోటిఫికేషన్ వస్తుందని చెప్పిన తరువాతే వరుస నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. నిరుద్యోగులకు తాజాగా మంత్రి హరీష్ రావు మరో శుభవార్త అందించారు. తెలంగాణ ప్ర‌భుత్వం వైద్యారోగ్య వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తుంద‌ని, త్వ‌ర‌లోనే వైద్యారోగ్య శాఖ‌లో 13 వేల నియామ‌కాలు చేప‌డుతామ‌ని చెప్పారు. ఇందుకు సంబంధించి త్వ‌ర‌లోనే పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డుతుంద‌ని మంత్రి హరీష్ రావు తెలిపారు.


రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో టీ డ‌యాగ్నోస్టిక్ మినీ హ‌బ్‌ను, మొబైల్ యాప్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డితో క‌లిసి మంత్రి హ‌రీశ్‌రావు ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంజీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్ర‌కాశ్ గౌడ్‌ ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు, అధికారులు పాల్గొన్నారు. మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వాలు చేయనంతగా ఆశా వ‌ర్క‌ర్ల‌కు జీతాలు పెంచామ‌న్నారు. వైద్యారోగ్య శాఖ బ‌డ్జెట్‌ను డ‌బుల్ చేశామ‌ని చెప్పారు. రాష్ట్రంలోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌తో పాటు బ‌స్తీ ద‌వాఖానాల్లో మందుల కొర‌త లేకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.






టీ డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్‌లో ఉచితంగా 57 ర‌కాల ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని హరీష్ రావు చెప్పారు. భ‌విష్య‌త్‌లో టీ డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్‌లో 137 ప‌రీక్ష‌లు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. డాక్ట‌ర్లు మెడిసిన్స్ బ‌య‌ట‌కు రాసిన‌ట్లు త‌మ దృష్టికి వ‌స్తే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చరించారు. ఆశా వ‌ర్క‌ర్లు, ఏఎన్ఎమ్‌ (ANMS in Telangana)లు ఇంటి వ‌ద్ద‌కే వ‌చ్చి టెస్టులు చేస్తున్నార‌ని, మెరుగైన పాలనకు ఇది నిదర్శనమని హ‌రీష్ రావు పేర్కొన్నారు.


తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న సమయానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం 30 శాతం మాత్రమే కాన్పులు ఉన్నాయ‌ని, ఈ ఏడేండ్ల‌లో 56 శాతం పెరిగాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచ‌న మేర‌కు ఆరోగ్య తెలంగాణ క‌ల‌ను సాకారం చేద్దామ‌ని, అధికారులు, ఉద్యోగులు ఈమేరకు కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు, కార్పొరేట‌ర్లు కూడా వీలున్నప్పుడు రాష్ట్రంలోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌ను సంద‌ర్శించాల‌ని, సౌకర్యాలను ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించాలని మంత్రి హరీష్ రావు సూచించారు. 


Also Read: TSSPDCL Recruitment 2022: టీఎస్ఎస్‌పీడీసీఎల్‌లో 1271 ఉద్యోగాలు, నోటిఫికేషన్ విడుదల - అర్హత, దరఖాస్తు ఇలా


Also Read: యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ పరీక్షా ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి