తెలంగాణలో జూనియర్ లెక్చరర్(జేఎల్) నియామకాల్లో భాగంగా సెప్టెంబరులో నిర్వహించిన ఇంగ్లిష్ పేపర్-2 పరీక్షకు సంబంధించి అక్టోబరు 30న రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. పరీక్ష పేపరులో 37 ప్రశ్నలపై అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలంటూ టీఎస్‌పీఎస్సీకి ఆదేశించింది. 


జేఎల్ పరీక్షకు సంబంధించి ఇంగ్లిష్ పేపరులోని ప్రశ్నలపై అభ్యంతరాలను టీఎస్‌పీఎస్సీ పట్టించుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ.. టి.ప్రణీత్ రెడ్డి మరో అయిదుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జస్టిస్ పి.మాధవీదేవి అక్టోబరు 30న విచారణ చేపట్టారు. 


విచారణలో భాగంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది బూర రమేశ్ వాదనలు వినిపిస్తూ.. పోస్టుల భర్తీలో భాగంగా సెప్టెంబరు 12న రాతపరీక్షలు నిర్వహించారన్నారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్), పేపర్-2 (ఇంగ్లిష్) పరీక్షలను టీఎస్‌పీస్సీ నిర్వహించినట్లు కోర్టుకు తెలిపారు. 


పరీక్ష తర్వాత సెప్టెంబరు 22న టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన ప్రాథమిక 'కీ'ని పరిశీలిస్తే ఇంగ్లిష్ పేపరులో పలు ప్రశ్నలు తప్పుగా ఉన్నాయన్నారు. దీనిపై వెబ్‌సైట్‌లో పిటిషనర్లు అభ్యంతరాలను వ్యక్తం చేయగా టీఎస్‌పీఎస్సీ పట్టించుకోకుండా తుది 'కీ' విడుదల చేసిందని రమేశ్ తెలిపారు. అభ్యర్థులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు పరీక్షను రద్దుచేసి తాజాగా మళ్లీ నిర్వహించేలా టీఎస్‌పీఎస్సీని ఆదేశించాలని కోరారు.


ఆ ప్రశ్నలపై అభ్యర్థులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేయాలని, పిటిషనర్ల ఆరోపణలపై వివరణ ఇవ్వడానికి గడువు కావాలని టీఎస్‌పీఎస్సీ తరఫు న్యాయవాది రాంగోపాల్‌ రావు కోర్టును అభ్యర్థించడంతో.. అందుకు అనుమితిస్తూ.. విచారణను నవంబరు 3కు వాయిదావేసింది.


'గ్రూప్‌-4' పోస్టుల పంచాయతీ కోర్టులోనే..
తెలంగాణలో గ్రూప్‌-4 పోస్టుల నియామకాల్లో ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కోటా పోస్టుల భర్తీ ప్రక్రియను ఖరారు చేయొద్దంటూ.. రాష్ట్రం ప్రభుత్వానికి, టీఎస్‌పీఎస్సీకి హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులతో సమానంగా అర్హత మార్కులను తగ్గించాలన్న సైనిక్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ వినతిపై నిర్ణయం తీసుకునేదాకా ఈ ప్రక్రియ ఆపాలని పేర్కొంది.


రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధశాఖల్లో 'గ్రూప్‌-4' పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబరులో టీఎస్‌పీఎస్సీ జారీచేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి నియామకాల్లో ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు అర్హత మార్కులు తగ్గింపుపై నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ బి.భాస్కర్‌ మరో 9 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. దీనిపై జస్టిస్‌ పి.మాధవీదేవి విచారణ చేపట్టారు. 


విచారణలో భాగంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులతో సమానంగా తమకూ అర్హత మార్కులను 30 శాతానికి తగ్గించాలంటూ హోంశాఖ ముఖ్యకార్యదర్శికి, టీఎస్‌పీఎస్సీకి సైనిక్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ లేఖలు రాశారన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి, టీఎస్‌పీఎస్సీ, రాష్ట్రహోంశాఖల మధ్య సంప్రదింపులు జరిగాయని అయితే ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. నిర్ణయం వెలువడక ముందే నియామకాలు జరిగితే తమకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కోటా కింద పోస్టుల కోసం ఇప్పటికే రాత పరీక్షలకు హాజరయ్యామన్నారు.


ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. డైరెక్టర్‌ లేఖ ఆధారంగా అర్హత మార్కులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునేదాకా ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కోటా పోస్టుల భర్తీపై తుది నిర్ణయం తీసుకోరాదని ఆదేశాలు జారీచేశారు. అర్హత మార్కుల తగ్గింపుపై ఈ ఉత్తర్వులు అందిన 30 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను ముగించారు.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..