Postings for DSC 2008 Candidates: తెలంగాణలో డీఎస్సీ-2008లో అర్హత సాధించిన అభ్యర్థులకు త్వరలో ఉద్యోగాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విషయంలో పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం ఆమోదం తెలిపితే.. డీఎస్సీ-2008 అభ్యర్థుల్లో 1,200 మందికి ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే రెగ్యులర్‌ ఉద్యోగాలిస్తారా? లేక మినిమం టైంస్కేల్‌ వర్తింపజేసి, కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఉద్యోగాలిస్తారా? అన్నది స్పష్టత రావాల్సి ఉన్నది. ఇది తేలిన తర్వాతే డీఎస్సీ నోటిఫికేషన్‌పై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.


నాలుగేళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం..
ఏపీలో డీఎస్సీ- 2008 అభ్యర్థుల‌కు క‌నీస టైం స్కేల్ ఇస్తూ తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం 2020లోనే  నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. డీఎస్సీ-2008లో సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్జీటీ) పోస్టులకు మొదట డీఈడీ వాళ్లకే అవకాశం కల్పించారు. దీనిపై బీఈడీ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా డీఈడీ వాళ్లకు 30 శాతం పోస్టులే కేటాయించారు. దీంతో మొదట పోస్టులు వచ్చిన డీఈడీ అభ్యర్థులు పోస్టు కోల్పోవాల్సి వచ్చింది. ఈ అభ్యర్థుల వినతి మేరకు గత ప్రభుత్వం ఎమ్మెల్సీలతో కమిటీ వేసింది. కనీస వేతనంతో వీరికి పోస్టింగ్‌ ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది. ఆ మేరకు ఉద్యోగాలు కల్పించారు. 2193 మంది అభ్యర్థులకు మినిమమ్ టైమ్ స్కేల్‌తో ఎస్జీటీలుగా నియమించాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 


ట్రైబ్యునల్‌ తీర్పుతో..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008 డిసెంబర్‌ 6న అప్పటి ప్రభుత్వం 35 వేల పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించింది. ఎస్జీటీ పోస్టులను కామన్‌ మెరిట్‌ ప్రకారం భర్తీ చేస్తామని, వీటికి బీఈడీ, డీఈడీ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నది. సుమారు 50 రోజుల తర్వాత ఎస్జీటీ పోస్టుల్లో 30 శాతం డీఈడీ అభ్యర్థులకు కేటాయిస్తూ 2009 జనవరి 29న జీవో-28ని తీసుకొచ్చింది. దీంతో బీఈడీ అభ్యర్థులు కోర్టుకు వెళ్లగా కామన్‌ మెరిట్‌ ప్రకారం భర్తీ చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం నియమించిన క్యాబినెట్‌ సబ్‌కమిటీ సైతం.. కామన్‌ మెరిట్‌ ప్రకారం భర్తీ చేయాలని సూచించింది. దీంతో నోటిఫికేషన్‌ ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం 2010 జూన్‌ 21న జీవో-27ను విడుదల చేసింది. దీనిప్రకారం అధికారులు నియామక కౌన్సిలింగ్‌ ప్రక్రియ ప్రారంభించారు. జిల్లాల వారీగా కామన్‌ మెరిట్‌ ప్రకారం ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. 2009 జూన్‌ 27న కౌన్సిలింగ్‌ ప్రక్రియ కూడా మొదలైంది. డీఈడీ అభ్యర్థులు పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా.. జూన్‌ 28న కౌన్సిలింగ్‌పై స్టే విధించింది. జీవో-28 ప్రకారం 30 శాతం కోటా కల్పిస్తూ కౌన్సిలింగ్‌ నిర్వహించాలని ట్రిబ్యునల్‌ ఆదేశించింది. ఆ తర్వాత 30 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ కొత్త మెరిట్‌ జాబితా విడుదల చేసి 2010లో ఉద్యోగాలు ఇచ్చారు. దీంతో మెరిట్‌ సాధించినా ఉద్యోగం రాక ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 3,500 మంది బీఈడీ అభ్యర్థుల కలలు కుప్పకూలాయి. ఇందులో తెలంగాణ అభ్యర్థులు 1,200 మంది వరకు ఉన్నారు.


కోర్టు తీర్పుతో ముందడుగు..
బీఈడీ అభ్యర్థులకు అనుకూలంగా 2013 జూలై 15న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయినా పలు కారణాలతో వీరికి ఉద్యోగాలివ్వలేదు. ఆ తర్వాత 2017 ఫిబ్రవరి 8న రాష్ట్ర హైకోర్టులో జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ నేతృత్వంలోని బెంచ్‌, 2022 సెప్టెంబర్‌ 27న హైకోర్టు ధర్మాసనం బీఈడీ అభ్యర్థులకు అనుకూలంగా తీర్పులు ఇచ్చాయి. పిటిషనర్లకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించాయి. ఏపీలో దాదాపు రెండున్నరేండ్ల కింద డీఎస్సీ-2008 బాధితులకు కాంట్రాక్ట్‌ పద్ధతిలో అక్కడి ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఒకే నోటిఫికేషన్‌లో బాధితులు ఒక రాష్ట్రంలో ఉద్యోగాల్లో ఉండటం, ఒక రాష్ట్రంలో న్యాయం కోసం ఎదురుచూడటం సరికాదని ఈ నెల 8న రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. డీఎస్సీ-2008 బాధితుల పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతం ఖాళీల్లో వారిని భర్తీ చేయాలని, కాంట్రాక్ట్‌ పద్ధతిలో అయినా ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించింది. డీఎస్సీ-2008కి సంబంధించిన అభ్యర్థులు మొత్తం 4,657 మంది ఉన్నట్లు లెక్క తేల్చారు. వీరిలో కొందరు ఇప్పటికే వేర్వేరు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వీరికి పదవీ విరమణ వరకు కనీస టైం స్కేల్‌ ఇస్తూ పోస్టింగ్‌లు ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.