Malkajgiri Parliament Seat: వచ్చే నెలలో  పార్లమెంటు ఎన్నికల (Loksabha Elections)షెడ్యూల్ విడుదల కాబోతోంది. రెండు నెలల క్రితమే తెలంగాణ (Telangana)లో  అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections)ముగియడంతో...నాడు కాంగ్రెస్ ( Congress) పార్టీ తరపున ఎమ్మెల్యే టిక్కెట్ దక్కని అసంతృప్త నేతలు మళ్ళీ ఎంపీ టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే కొందరు నేతలు లాబీయింగ్ మొదలు పెట్టారు. బీఆర్ఎస్, బీజేపీలో టిక్కెట్ ఆశించి భంగపడ్డ నేతలు...కాంగ్రెస్ పార్టీలో అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్ధమవుతున్నారు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పార్లమెంట్‌ సీటు కోసం కాంగ్రెస్ పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. సీనియర్లతో పాటు జూనియర్లలో  పలువురు నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. పదుల సంఖ్యలో అభ్యర్థులు...ఎవరికి వారు సీటు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారు తామే అభ్యర్థులమని చెప్పుకుంటూ ప్రచారం ప్రారంభించేందుకు సిద్దమవుతున్నారు. మల్కాజిగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన మైనంపల్లి హనుమంతరావు...ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సారి ఎంపీ టికెట్ తనకేనని ఆయన ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. 


ప్రచారం స్టార్ట్ చేసిన మైనంపల్లి హనుమంతరావు
మల్కాజిగిరి సీటుపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటి వరకు ఎలాంటి అధికార ప్రకటన చేయకపోయినప్పటికీ...మైనంపల్లి మాత్రం ఒకడుగు ముందుకు వేశారు. మల్కాజ్ గిరి పార్లమెట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఒక వైపు మెదక్ ఎమ్మెల్యేగా మైనంపల్లి రోహిత్ కొనసాగుతుండగా.. మరోవైపు తండ్రి ఎంపీ సీటు కోసం లాబీయింగ్ చేస్తున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో వందలాది వాహనాల శ్రేణితో మైనంపల్లి హనుమంతరావు బలప్రదర్శన చేశారు. ఇటీవలే జిహెచ్ఎంసి మాజీ మేయర్ బొంతు రాంమోహన్, ఆయన భార్య చర్లపల్లి కార్పొరేటర్ శ్రీదేవి ...ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తానంటూ రేవంత్‌రెడ్డి వద్ద ప్రస్తావించారు. 


రేవంత్ రెడ్డి సోదరులు ప్రయత్నాలు
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి కూడా పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరిలో ఒకరికి టిక్కెట్ కచ్చితంగా దక్కేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చలు జరిపారని ప్రచారం సాగుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా ఇరువురు అన్నదమ్ములు అవిశ్రాంతంగా ప్రచారంలో పాల్గొన్నారు. సోదరుడి వారసత్వం కొనసాగించేలా మల్కాజిగిరి ఎంపి టికెట్ సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి రాజకీయ వారసులను ఇప్పటి వరకు ప్రకటించలేదు. దీంతో పార్లమెంట్‌ ఎన్నికల ద్వారా రేవంత్ రాజకీయ వారసులు క్రియాశీలక రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.


టికెట్ కావాలంటోన్న ఓడిన నేతలు


మల్కాజిగిరి ఎంపీ సీటు కోసం ప్రతిపక్ష పార్టీలో కూడా విపరీతమైన డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన అభ్యర్థులు కూడా తమకు మరో అవకాశం ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు జిహెచ్ఎంసి పరిధిలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించ లేదు. దీంతో మల్కాజిగిరి ఎంపీ సీటుపైనే పలువురు నేతలు దృష్టి పెట్టడం ఆసక్తికరంగా మారింది. అధిష్ఠానం ఎవరికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందో వేచి చూడాలి.