Andhra Pradesh Politics : ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) సమీపిస్తుండటంతో...ఇప్పుడు మేనిఫెస్టో (Manifesto) హాట్ టాపిక్‌గా మారనుంది. ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో తెలుగుదేశం పార్టీ(TDP).. షణ్ముఖ వ్యూహం పేరుతో జనసేన (Janasena) మేనిఫెస్టోలను ప్రకటించాయి. దాదాపు ఒకే రకమైన అంశాలను ప్రస్తావిస్తూ...మినీ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత...బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. పూర్తి స్థాయిలో ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమావేశమై...మేనిఫెస్టోను ఖరారు చేయనున్నారు. 


ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు ?
మరోవైపు వైసీపీ తన మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 18న అనంతపురం జిల్లాలో జరిగే సిద్దం సభలో విడుదల చేస్తున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి కూడా ప్రకటించేశారు. అయితే మేనిఫెస్టో ప్రకటన కొంత ఆలస్యం జరిగింది. ఇప్పుడు టీడీపీ-జనసేన కూటమిలో ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. వైసీపీ పెట్టబోయే మేనిఫెస్టోలో ఏ యే అంశాలు ఉంటాయని తెలుగుదేశం, జనసేన నేతలు ఆరా తీస్తున్నారు. వైసీపీ మేనిఫెస్టోలో కొత్తగా ఉండే అంశాలేంటీ..? పెన్షన్ మొత్తాలను ఏమైనా పెంచుతారా..? మహిళలకిచ్చే చేయూత, ఆసరా వంటి వాటి లబ్దిని ఇంకా పెంచుతామనే హామీ ఇస్తారా..? అనే అంశాలతో పాటు ఇంకా కొత్తగా ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారనే చర్చ కూటమి పార్టీల్లో జరుగుతోంది. వైసీపీ మీద..అభివృద్ధి బ్రాండ్ కంటే.. సంక్షేమం బ్రాండ్ బలంగా ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. అభివృద్ధి కార్యక్రమాలు సంగతేమో కానీ...సంక్షేమ కార్యక్రమాలను మాత్రం బాగా అమలు చేశారనే భావన ఇప్పటికీ ఓటు బ్యాంక్ వర్గాల్లో ఉంది. దీంతో వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చే హామీలను.. ప్రత్యేకించి సంక్షేమం గురించి ఇచ్చే హామీలను జనం కచ్చితంగా నమ్ముతారనే భావన వ్యక్తమవుతోంది. సంక్షేమం విషయంలో ఎలాంటి హామీలు ఉండబోతున్నాయనే చర్చ టీడీపీ-జనసేన పార్టీల్లో జరుగుతోంది.


మహిళలతో పాటు సీనియర్ సిటిజన్లకు ఉచిత ప్రయాణం ?
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని...వైసీపీ తన మేనిఫెస్టోలో కూడా పెట్టొచ్చనే చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ తన సూపర్ సిక్స్ ప్రొగ్రాంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని ఇచ్చింది. దీంతో ఆ హామీని జగన్ ఇప్పుడే అమలు చేయాలనే ఆలోచన చేశారనే ప్రచారం జరుగుతోంది. ఆర్టీసీ అధికారులు కూడా ఈ హామీని అమలు చేస్తే ఎంత మొత్తం ఖర్చువుతుందనే లెక్కలు కూడా వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లోగానే ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇస్తారనే భావించినా.. ఇప్పుడది అంతగా వినబడటం లేదు. ఈ క్రమంలో వైసీపీ మేనిఫెస్టోలో ఉచిత ప్రయాణం హామీ ఉండొచ్చనేది టీడీపీ అంచనాలు ఉన్నాయి.  మహిళలకే పరిమితం చేయకుండా.. సీనియర్ సిటిజన్స్ కూడా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం కల్పించేలా జగన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దాన్నే మేనిఫెస్టోలో ప్రకటించే సూచనలు ఉంన్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.


మహిళల ఓట్ల కోసం డ్వాక్రా రుణమాఫీ ?
డ్వాక్రా రుణమాఫీ మీద కూడా వైసీపీ ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన ఎన్నికల మేనిఫెస్టోలో ఆ హామీని కూడా ఇవ్వొచ్చని కూటమి పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే డ్వాక్రా రుణమాఫీ మీద...తాము కూడా ఆలోచన చేస్తున్నామని ఇటీవలే పవన్ ప్రకటించిన విషయాన్ని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. మొత్తంగా వైసీపీ ఎలాంటి హామీలిస్తుంది ? దానికి కౌంటరుగా తామేం ఇవ్వాలనే అంశాలపై టీడీపీ, జనసేన దృష్టి సారించాయి.