Assembly Elections And General Elections: దేశం(Courntry)లో మ‌రో రెండు వారాల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ (General Elections)కు న‌గారా మోగ‌నుంది. ఇదే స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్(Andhrapradesh) స‌హా మ‌రో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కూడా రంగం సిద్ధం కానుంది. ఈ నేప‌థ్యంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు, అసెంబ్లీ(Assembly) ఎన్నిక‌లకు మ‌ధ్య‌ తేడా ఏంటి?  దేశంలో ఈ ప్రక్రియ ఎప్ప‌టి నుంచి ప్రారంభ‌మైం ది? అనేది ఆస‌క్తిగా మారింది. అంతేకాదు, త‌ర‌చుగా జ‌మిలి ఎన్నిక‌ల ప్ర‌స్తావ‌న కూడా వ‌స్తున్న నేప‌థ్యంలో దీని ప్రాధాన్యం ఏంటి? ఎందుకు? అనేది కూడా చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం. 


అస‌లు ఎన్నిక‌లు ఎందుకు? 


`ప్ర‌జ‌ల చేత‌, ప్ర‌జ‌ల వ‌ల‌న‌, ప్ర‌జ‌ల కొర‌కు` అని నిర్వ‌చించిన ప్ర‌జాస్వామ్య దేశాల్లో(Democratic Countries) ప్ర‌జ‌లే త‌మ‌ను పాలించే ప్ర‌భుత్వాల‌ను ఎన్నుకోవ‌డం విశేషం. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జాస్వామ్య దేశాల‌కు సంబంధించి మూడు ర‌కాలు ఉన్నాయి. 1) పూర్తి స్థాయి ప్ర‌జాస్వామ్య దేశాలు. ఉదాహ‌ర‌ణ‌కు భార‌త‌, అమెరికా, పాకిస్థాన్‌ వంటివి. 2) పాక్షిక ప్ర‌జాస్వామ్య దేశాలు ఉదాహ‌ర‌ణ‌కు ర‌ష్యా, చైనా, ద‌క్షిణాఫ్రికాలోని కొన్ని దేశాలు. 3) మిశ్ర‌మ ప్ర‌జాస్వామ్య దేశాలు. ఉదాహ‌ర‌ణ‌కు బ్రిట‌న్‌, సౌదీ అరేబియా వంటి దేశాలు. వీటితోపాటు వంశ పారంప‌ర్య పాల‌న ఉన్న దేశాలు కూడా ఉన్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఉత్త‌ర‌కొరియా వంటివి. వీటిలో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జాస్వామ్య దేశాలు కీల‌క పాత్ర పోషిస్తున్నాయి. ప్ర‌పంచాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటే.. ప్ర‌జాస్వామ్య దేశాల‌దే పైచేయిగా ఉంటోంది. ఇక‌, ప్ర‌పంచవ్యాప్తంగా ఇప్పుడు ప్ర‌జాస్వామ్య దేశాల సంఖ్య పెరుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న లెక్క‌ల ప్ర‌కారం.. ప్ర‌పంచవ్యాప్తంగా 152 దేశాల్లో పూర్తి స్థాయి ప్ర‌జాస్వామ్యం ఉంది. ఇత‌ర దేశాలు కూడా.. మార్పు దిశ‌గా అడుగులు వేస్తున్నాయి.


ఎన్నిక‌లు.. 


పైన చెప్పుకొన్న‌ట్టుగా.. పూర్తిస్థాయి ప్ర‌జాస్వామ్య దేశాల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం ద్వారా.. ప్ర‌జ‌లు(People) త‌మ‌ను పాలించే నాయ‌కుల‌ను ఎన్నుకుంటున్నారు. వీరంతా క‌లిసి ఒక ప్ర‌భుత్వాన్ని(Government) ఏర్పాటు చేస్తారు. వీరే.. కొంత కాలప‌రిమితి వ‌ర‌కు అధికారంలో ఉంటారు. ఇది.. దేశాన్ని బ‌ట్టి మారుతుంటుంది. భార‌త దేశంలో ఐదేళ్లు ఉండ‌గా.. అమెరికాలో ప్ర‌భుత్వ కాలప‌రిమితి 4 సంవ‌త్స‌రాలే ఉంది. భార‌త దేశం విష‌యానికి వ‌స్తే.. రాష్ట్రాల‌కు, కేంద్రంలోని ప్ర‌భుత్వానికి వేర్వేరుగా ఎన్నిక‌లు జ‌రుగుతాయి. జాతీయ స్థాయిలో కొన్ని పార్టీలు పోటీ చేస్తుండ‌గా.. ప్రాంతీయ పార్టీలు కూడా సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుంటాయి. మెజారిటీ ద‌క్కించుకున్న పార్టీలు అధికారంలోకి వ‌స్తాయి. 


ఎవ‌రు నిర్వ‌హిస్తారు?


భారత దేశంలో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగం ఏర్పాటు చేసిన సంస్థ భారత ఎన్నికల కమిషన్‌. 1950 జనవరి 25 న ఏర్పాటైన ఈ కమిషన్ రాజ్యాంగం ఏర్పరచిన స్వతంత్ర వ్యవస్థ. ప్రభుత్వ నియంత్రణకు లోబడి ఉండదు. ఇది జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రాల స్థాయిలోనూ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తుంది. అదే స‌మ‌యంలో ప్ర‌తి రాష్ట్రానికీ ఒక క‌మిష‌న్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జాతీయ ఎన్నికల కమిషన్ లో భాగంగా ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్  విష‌యాన్ని చూస్తే..  ఓటరు జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ, రాజ‌కీయ పార్టీల నుంచి వ‌చ్చే ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రించ‌డం.. కొత్త‌గా ఓట‌ర్ల‌ను న‌మోదు చేయ‌డం వంటి కీల‌క‌ పనులను చేస్తుంది.


సార్వ‌త్రిక ఎన్నిక‌లు.. 


ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి, తద్వారా ప్రజాస్వామ్య ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి వివిధ స్థాయిల్లో ప్రతి 5 సంవత్సరాలకు ఒక సారి ఎన్నికల కమిషన్ ఎన్నికలను నిర్వ‌హిస్తుంది. దీనిని సాధారణ ఎన్నికలు అంటారు. ఇది, అటు కేంద్రానికి, ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కూడా వ‌ర్తిస్తుంది. రాష్ట్రాల స్థాయిలో పార్టీలు పోటీ ప‌డుతుంటాయి. ఇక‌, మొత్తం ఎన్నిక‌లు 4 ర‌కాలు.. పార్లమెంట్ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు. వీటి ద్వారా పాల‌న సాగుతుంది. 


తేడా ఏంటి? 


సార్వత్రిక ఎన్నిక‌ల్లో కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌లు ఎన్నుకుంటారు. అంటే.. ఈ ఎన్నిక‌ల్లో దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకుని.. ప్ర‌భుత్వాన్ని ఎన్నుకునే ప్ర‌క్రియ‌. దేశంలో ఓటు హ‌క్కు ఉన్న ప్ర‌తి పౌరుడు ఈ ఎన్నిక‌ల్లో భాగస్వామ్యం అవుతారు. ఇక‌, రాష్ట్రాల అసెంబ్లీల‌కు జ‌రిగే ఎన్నిక‌ల్లో కేవ‌లం ఆ రాష్ట్రానికి చెందిన పౌరుడు మాత్ర‌మే ఓటు వేయాల్సి ఉంటుంది. నేను ఈ దేశ పౌరుడిని.. నేను ఎందుకు ఓటే వేయ‌కూడ‌దు? అన్న ప్ర‌శ్న ఇక్క‌డ రాదు. ఉదాహ‌ర‌ణ‌కు త్వ‌ర‌లోనే ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఏపీ అసెంబ్లీకి అభ్య‌ర్థుల‌ను ప్ర‌జ‌లు ఎన్నుకుంటారు. అయితే.. ఈ ఎన్నిక‌ల్లో ఏపీకి చెందిన లేదా.. ఏపీలో ఓటు హ‌క్కు ఉన్న వారు మాత్ర‌మే త‌మ ఓటు వేయాల్సి ఉంటుంది. పొరుగున ఉన్న రాష్ట్రాల‌కు చెందిన వారు వేయ‌డానికి అనుమ‌తించ‌రు. ఇదీ.. ప్రాథ‌మికంగా తేడా. 


ఎవ‌రైనా పోటీ చేయొచ్చా?


ఔను! భార‌త దేశం వంటి ప్ర‌జాస్వామ్య దేశాల్లో ఎవ‌రైనా.. పౌరులు(స్త్రీలు, పురుషులు, ట్రాన్స్‌జెండ‌ర్లు కూడా) ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు అర్హులే. అయితే.. చిన్న‌పాటి నిబంధ‌న‌లను పాటించాల్సి ఉంటుంది. పోటీ చేసేవారి వ‌య‌సు 25 సంవ‌త్స‌రాలు నిండి ఉండాలి. ఈ దేశ పౌరుడిగా.. పౌర‌స‌త్వం క‌లిగి ఉండాలి. ఇలాంటి వారు పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో దేశంలో ఎక్క‌డ నుంచి అయినా పోటీ చేయొచ్చు. లేదు.. అసెంబ్లీల‌కు పోటీ చేయాల‌ని అనుకుంటే.. త‌మ ఓటు హ‌క్కును ఆ రాష్ట్రానికి బ‌దిలీ చేసుకోవాల్సి  ఉంటుంది. త‌ద్వారా.. వారు పోటీకి అర్హులు అవుతారు. 


త్వ‌ర‌లోనే 


దేశంలో ఏప్రిల్‌-మే నెల‌ల మ‌ధ్య సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దేశంలో కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఎన్నుకునే అవ‌కాశం ప్ర‌జ‌ల‌కు ల‌భించ‌నుంది. మ‌ళ్లీ 2029లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌హా.. ఒడిశా, సిక్కి, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌ల‌లో రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు 5 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి ముగియ‌నున్న నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాల్లోనూ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అదేస‌మ‌యంలో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. జ‌మ్ము క‌శ్మీర్‌లో(ల‌ద్ధ‌ఖ్‌ను విడ‌దీసి కేంద్ర పాలిత ప్రాంతం చేశారు) అసెంబ్లీ ఎన్నిక‌లు తొలిసారి ఈ ఏడాదే జ‌ర‌గ‌నున్నాయి.