Gummanuru Jayaram Will Contest From TDP Ticket: వైసీపీ వీడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే చాలా మంది నేతలు టికెట్లు రాలేదని, నియోజకవర్గం మార్చారని, ఎంపీగా పోటీ చేయమంటున్నారని అధికార పార్టీకి బైబై చెప్పేస్తున్నారు. వీరిలో ఇప్పటికే కొందరు సైకిల్‌ ఎక్కేస్తే మరికొందరు వెయిటింగ్‌ లిస్టులో ఉన్నారు. అలా ఫ్యాన్‌ గాలి పడక సైకిల్‌ దరి చేరిన వారిలో మంత్రి గుమ్మనూరు జయరాం కూడా ఉన్నారని టాక్ నడుస్తోంది. ఆయన పార్టీలో చేరక ముందే మొదటి జాబితాలో చోటు కూడా దక్కిందని అంటున్నారు. టీడీపీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం గుంతకల్లు టికెట్ ఆయనకు ఇస్తున్నారని తెలుస్తోంది. 


మంత్రి గుమ్మనూరు జయరాం వ్యవహారం కర్నూలు జిల్లా వైసీపీలో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. కర్నూలు జిల్లా ఆలూరు  నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న జయరాం... ప్రస్తుత కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎప్పటి నుంచో ఆయన వైస్సార్సీపీకి దూరం అవుతున్నారని జిల్లాలో గట్టిగా వినిపిస్తోంది. టీడీపీలో చేరుతారని వార్తలు  కొద్దీ రోజులుగా చక్కర్లు కొడుతునప్పటికి మంత్రి గుమ్మనూరు జయరాం కానీ.. ఆయన అనుచరులు కానీ ఎక్కడా ఖండించలేదు. 


గుమ్మనూరును పట్టించకోని వైసీపీ హైకమాండ్ 
వైసీపీ పార్టీ అధిష్టానం కూడా మంత్రి గుమ్మనూరు జయరాం పై పెద్దగా ఫోకస్ పెట్ట లేదు. వైసీపీ అధిష్టానం అభ్యర్థుల మార్పులు చేర్పుల భాగంగా  ఆలూరు నియోజకవర్గం వైస్సార్సీపీ పార్టీ ఇంచార్జిగా విరుపాక్షిని నియమించారు. మంత్రిగా ఉన్న  జయరామ్ కు కర్నూలు పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించారు. అయితే తన ప్రత్యర్థికి టికెట్ ఇవ్వొద్దని చెబుతూనే వచ్చారు. అంతేగాక పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసేందుకు గుమ్మనూరు ఆసక్తి చూపలేదు. మళ్ళీ ఆలూరు టికెట్ తనకే ఇవ్వాలని పట్టు పట్టారు. ఈ  నేపథ్యంలో వైసీపీ నిర్వహించిన పలు కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే పార్టీ అధిష్టానం ఆయన్ను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం రాలేదు. గుమ్మనూరు మాత్రం ఆలూరు టికెట్ కోసం పట్టు విడలేదు. దీనికి తోడు  చివరి క్యాబినెట్ మీటింగ్ కు వెళ్ళి తన మనసులో మాట జగన్ చెప్పి వచ్చినట్లు తెలుస్తోంది. 


కర్నూలు వచ్చిన సీఎంను కలిసి మరోసారి చెప్పినా దొరకని ఊరట 
కర్నూలు పార్లమెంటు అభ్యర్థిగా మరొకరికి అవకాశం ఇస్తున్నట్లు సోషల్ మీడియాకు లీక్ చేసింది. ఇలాంటి గందరగోళ పరిస్థితిలో ముఖ్యమంత్రి జగన్ కర్నూలు వచ్చారు.జగన్ ను  మంత్రి గుమ్మనూరు జయరాం కలిశారు. అంతలోనే ఆలూరు నియోజకవర్గంలో  ఓ గ్రామానికి రోడ్డు అభివృద్ది పనులను మంత్రి  గుమ్మనూరు శ్రీకారం చుట్టారు. అంతకు ముందే  అదే రహదారినీ ప్రస్తుత ఇంఛార్జి విరుపాక్షీ  శ్రీకారం చుట్టారు.. అయితే మంత్రి గుమ్మనూరు జయరాం ఇంఛార్జిను ఉద్దేశించి పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారం రేపాయి. మళ్ళీ టికెట్ తనకే వస్తుందనెలా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన పార్టీ మారడం లేదనే సంకేతాలు ఇచ్చారు.   పార్టీలో  గుమ్మనూరు జయరాం ఆక్టివ్ కావడంతో ఆయన పార్టీ మారడం లేదని టాక్ నడిచింది. 


అయితే సడెన్ గా అనంతపురం జిల్లా రాప్తాడు లో వైసీపీ నిర్వహించిన సిద్ధం బహిరంగ సభకు మంత్రి గుమ్మనూరు జయరాం హాజరు కాకపోవడంతో మళ్లీ ఆయన పార్టీకి దూరమవుతున్నారని గట్టిగానే చర్చ నడుస్తోంది. సత్యసాయి జిల్లాకు ఇన్చార్జిగా ఉన్న గుమ్మునూరు జయరాం సిద్ధం బహిరంగ సభకు వెళ్లకపోవడంతో ఆయన అసంతృప్తి మళ్ళీ బయటపడింది. గతంలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి   అనంతపురం జిల్లా పుట్టపర్తి కి వచ్చినప్పుడు  జయరామ్ హాజరుకాలేదు.


రాప్తాడులో సీఎం పాల్గొన్న సిద్ధం సభకు గుమ్మనూరు జయరాం హాజరు కాకపోవడంతో ఆయన పార్టీ మారుతున్నరని నియోజ వర్గంలో స్పష్టం అయింది.  టిడిపిలోకి వెళ్తున్నారని ప్రచారం జోరుగా సాగింది. జయరాం అనంతపూర్ జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి టిడిపి టికెట్ దాదాపు  ఖరారు  అయినట్టు అప్పుడే వార్తలు వచ్చాయి. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ శనివారం ఈ విషయాన్ని చంద్రబాబు ప్రకటించనున్నారు. 


ఇప్పటికే గుమ్మనూరు జయరాం  రహస్యంగా ఆలూరు నియోజకవర్గంలోని  ముఖ్య నేతలను  పిలిపించుకొని  సమావేశమయినట్లు సమాచారం.  ఈ సమావేశంలో ఆయన భవిష్యత్తు కార్యచరణ పై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో పార్టీకి తన పదవికి రాజీనామా చేసి టిడిపి కండువా కప్పు కుంటారు. మంత్రి గుమ్మనురు జయరామ్ ని abp ప్రతినిధి సంప్రదించగా.. గుమ్మనురు జయరామ్ ఎంపీ గా పోటీ చేయరు.. ఎమ్మెల్యే గానే పోటీ చేస్తారు అని చెప్పడం జరిగింది. అది వైసీపీ పార్టీ నుంచి బరిలో ఉంటారా లేక టీడీపీ నుంచి బరిలో ఉంటారా అన్నది మరో నాలుగు, ఐదురోజుల్లో తేలిపోనుంది వారం రోజుల క్రితం చెప్పారు. 


అన్నట్టుగానే టీడీపీ నుంచి గుంతకల్లు టికెట్‌పై పోటీ చేయబోతున్నారు. అయితే గుంతకల్లు టీడీపీ కేడర్ మాత్రం ఆయన రాకను పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఆయన వల్ల చాలా సమస్యలు ఎదుర్కొన్నామని ఇప్పుడు అలాంటి వ్యక్తి విజయం కోసం ఎలా పని చేస్తామంటూ ప్రశ్నిస్తోంది. మరి టీడీపీ అధినాయకత్వం గుంతకల్లు కేడర్‌కు ఎలా సర్ది చెబుతుందో... వారిని జయరాం ఎలా కలుపుకొని వెళ్తారో అన్నది మాత్రం ఆసక్తిగా మారింది.