Ganta Srinivasrao Situation In Tdp : మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు రాజకీయాల్లో ఓటమన్నదే తెలియదు. 1999 నుంచి ఇప్పటి వరకు వరుస ఎన్నికల్లో గెలుస్తూనే వస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన రాజకీయాల్లో తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 2014 వరకు గంటా వర్గంలో నలుగురు వరకు ఎమ్మెల్యేలు ఉండేవారు. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం కలిగిన గంటా శ్రీనివాసరావుకు గడిచిన ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తరువాత నుంచి పరిస్థితులు ఏమాత్రం సానుకూలంగా కనిపించడం లేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ హవాలోనూ గంటా విశాఖ నార్త్ నుంచి విజయం సాధించారు. టీడీపీ ఓటమిపాలు కావడంతో రాజకీయంగా ఆయన సైలెంట్ అయిపోయారు. సుమారు మూడేళ్లపాటు రాజకీయగా మౌనం దాల్చిన గంటా.. ఆ తరువాత వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఒకప్పుడు కలిసి రాజకీయాలు చేసిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు.. గంటా శ్రీనివాసరావు రాకకు బ్రేకులు వేసినట్టు చెబుతారు. ఆ తరువాత ఆయన మరికొన్నాళ్లు మౌనం దాల్చారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ఆయన రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ కార్యాయానికి వెళ్లడంతోపాటు మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన గంటా.. పార్టీ కార్యాలయంలో వరుస మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ మరింత యాక్టివ్ అయ్యారు.
కష్టకాలంలో దూరంగా ఉన్నారన్న భావన
గంటాకు రాజకీయంగా జీవితాన్ని ఇవ్వడంతోపాటు 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు మంత్రివర్గంలోకి కూడా తీసుకున్నారు. 2019లో అధికారాన్ని కోల్పోయిన తరువాత గంటా పార్టీకి పూర్తిగా దూరమయ్యారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా లేరన్న భావన స్థానిక నాయకులతోపాటు అగ్ర నాయకుల్లోనూ ఉంది. గంటా మళ్లీ పార్టీలో యాక్టివ్ కావడాన్ని చంద్రబాబు కూడా అంగీకరించలేదని, కానీ, ఆయన వియ్యంకుడు మాజీ మంత్రి నారాయణ కారణంగా చంద్రబాబు అంగీకరించినట్టు ప్రచారం జరిగింది. అయినప్పటికీ అగ్ర నేతలకు గంటాపై సానుకూల అభిప్రాయం లేదని, ముఖ్యంగా గంటా అంటే ముందు నుంచీ వ్యతిరేకించే విశాఖకు చెందిన కొందరు నేతలు అగ్రనేతలకు ఆయన గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ కారణాలతోనే గంటాను పార్టీ నుంచి పొమ్మనకుండానే పొగబెట్టే రీతిలో అగ్రనాయకత్వం వ్యవహరిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే గంటాకు సంబంధం లేని, సుదూర ప్రాంతంలో ఉన్న చీపురుపల్లి నియోజకవర్గానికి వెళ్లి పోటీ చేయమంటున్నట్టు చెబుతున్నారు. గంటా కూడా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విశాఖ నుంచి తనను పంపించేయాలనుకుంటున్నారా..? అంటూ గంటా చేసిస వ్యాఖ్యలు కూడా ఇక్కడ ఆసక్తిని కలిగిస్తున్నాయి.
ప్రజారాజ్యంలోకి వెళ్లిన గంటా
గంటా తనకు ఉన్న అవకాశాలను పార్టీ మారుతుంటారన్న భావన పార్టీ ముఖ్య నాయకుల్లో ఉంది. గతంలో 2009లో తన అనుచరులతో కలిసి ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు. రాజశేఖర్‌రెడ్డి మరణాంతరం పార్టీ చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేసిన తరువాత.. అక్కడ మంత్రివర్గంలో చేరారు. ఆ తరువాత 2014 ఎన్నికలకు ముందు తిరిగి టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంతో మంత్రివర్గంలో చేరారు. 2019 వరకు మంత్రిగా పని చేసిన గంటా.. అధికారాన్ని పార్టీ కోల్పోవడంతో రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. మళ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో యాక్టివ్ అయ్యారని పార్టీ అగ్ర నాయకులు భావిస్తున్నారు. పార్టీయే గంటాకు ఉపయోగపడింది తప్పా.. పార్టీకి గంటా ఎప్పుడూ ఉపయోగపడలేదని ముఖ్య నాయకులు భావిస్తున్నారు. ఈ ఉద్ధేశంతోనే గంటాను విశాఖకు దూరంగా చీపురుపల్లికి పంపిస్తున్నట్టు చెబుతున్నారు. తాజాగా ఆయన మళ్లీ పార్టీలో యాక్టివ్ కావడం తెలుగుదేశం పార్టీ కీలక నాయకులకు ఇష్టం లేదని, తన వియ్యంకుడు, మాజీ మంత్రి నారాయణ ఒత్తిడితో చంద్రబాబు అంగీకరించారని చెబుతున్నారు. గంటా భీమిలి గానీ, ఉమ్మడి విశాఖలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపిస్తుంటే.. అధినాయకత్వం మాత్రం చీపురుపల్లి వెళ్లాలని చెప్పడం వెనుక కూడా గంటాను పొమ్మనలేక పొగపెట్టడమేనని చెబుతున్నారు. గెలిస్తే బొత్స వంటి సీనియర్ నేతకు చెక్ చెప్పినట్టు అవుతుందని, ఓడితే గంటాకు రాజకీయంగా చెక్ చెప్పినట్టు అవుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై గంటా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, చీపురుపల్లి వెళ్లను అంటే ప్రత్యామ్నాయ నియోజకవర్గాన్ని గంటాకు చూపిస్తారా..? లేదా..? అన్నది చూడాల్సి ఉంది.