Adiseshagiri Rao Contest In Penamaluri : తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెనమలూరు నుంచి బరిలో దిగేందుకు సినీ నటుడు, దివంగత సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మేరకు ఆయన తన మనసులోని మాటను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వద్ద బయటపెట్టినట్టు చెబుతున్నారు. 2019 ఎన్నికలకు కొద్దిరోజులు ముందు ఆయన వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తరువాత నుంచి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్‌గా ఉంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన తరువాత సినీ పరిశ్రమ నుంచి ఆయనే తొలుత స్పందించారు. చంద్రబాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. మృదుస్వభావిగా పేరున్న ఆయనను ఇక్కడి నుంచి బరిలోకి దించితే రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణ, మహేష్‌బాబు అభిమానులు తెలుగుదేశం పార్టీకి పని చేసే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నారు. ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ప్రతిపాదనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సానుకూలంగా ఉన్నట్టు చెబుతున్నారు.
ఆ ఇద్దరి పేర్లపై ప్రచారం
ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఉన్నారు. ఈయన పోటీ చేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు సాగిస్తున్నారు. అదే సమయంలో మైలవరం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దేవి ఉమామహేశ్వరరావు ఇక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. మైలవరం సిటింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఆయన టీడీపీ పెద్దలతో చర్చించినట్టు చెబుతున్నారు. సిటింగ్ స్థానాన్ని కేటాయిస్తేనే పార్టీలో చేరతానన్న షరతుతోనే ఆయన చేరుతున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇన్‌చార్జ్‌గా ఉన్న బోడె ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్లు ఒక పక్క వినిపిస్తుండగా, తాజాగా ఘట్టమనేని శేషగిరిరావు పేరు తెరపైకి వచ్చింది. వీరిలో ఎవరికి సీటు దక్కుతుందన్నది ఆసక్తిగా మారింది. ఇక్కడ ఘట్టమనేని సీటు కేటాయించిన మిగిలిన ఇద్దరికి మరోచోట సీటు కల్పించాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ అధినేతకు ఏర్పడింది. ఇద్దరూ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు, అంతకుమించి పార్టీకి, చంద్రబాబుకు వీరవిధేయులు. ఈ నేపథ్యంలో వీరిని పక్కపెటట్టే సాహసం కూడా చంద్రబాబు చేయకపోవచ్చు. ఈ తరుణంలో ఇక్కడి సీటు కేటాయింపు అన్నది ఆసక్తికరంగా మారింది.
బోడె సహకరిస్తారా..?
ఎన్టీఆర్ జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం నుంచి బోడె ప్రసాద్ గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్ నేతగా ఆయనకు ఇక్కడ అనేక పరిచయాలు, క్షేత్రస్థాయిలో మంచి పేరు ఉంది. మళ్లీ పోటీ చేస్తానన్న ఉద్ధేశంతో గడిచిన ఐదేళ్ల నుంచి ప్రజల్లో ఉంటూనే వస్తున్నారు. ఈ తరుణంలో సీటు దక్కకపోతే ఆయన నిర్ణయం ఎలా ఉంటుందన్నది కూడా ఆసక్తిగా మారింది. ఇప్పటికీ ఆయన తనకే టికెట్ లభిస్తుందని చెబుతూ వస్తున్నారు. కానీ, తెలుగుదేశం పార్టీ లెక్కలే వేరేలా ఉన్నట్టు చెబుతున్నారు. ఈ తరుణంలో పార్టీ తీసుకునే నిర్ణయానికి బోడె కట్టుబడి ఉంటారా..? లేక మరేదైనా నిర్ణయం తీసుకుంటారా..? అన్నది ఆసక్తిగా మారింది. వేరే చోట టికెట్ కేటాయించే పరిస్థితి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో లేదని చెబుతున్నారు. ఎందుకంటే పొత్తులో భాగంగా అనేక సీట్లను టీడీపీ కోల్పోతుంది. చాలా చోట్ల సీనియర్ నేతలకు అవకాశం దక్కడం లేదు. వారికి సీట్లను కేటాయించాల్సి ఉంది. ఈ తరుణంలో పెనమలూరు సీటును శేషగిరిరావుకు కేటాయిస్తారా..? లేదా..? అన్నది ఆసక్తికరంగా మారింది.