Andhra Pradesh News: రాష్ట్రంలో మరో కూటమి ఏర్పాటు కాబోతోంది. కాంగ్రెస్‌ సారథ్యంలో కేంద్రంలో ఏర్పాటైన ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సీపీఐ, సీపీఎం పార్టీలతో కలిపి కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో కూటమిగా ఏర్పాటు కాబోతున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలా రెడ్డి మీడియా ముఖంగా దీన్ని ప్రకటించారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు సిద్ధమయ్యామని, భవిష్యత్‌లో కలిసి పోటీ చేసేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని ఆమె స్పష్టం చేశారు. కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీ, రాష్ట్రంలోని అధికార వైసీపీని గద్దె దించాలంటే బలంగా ఉండాలని, అందుకు అనుగుణంగా సిద్ధమవుతున్నామని ఆమె స్పష్టం చేశారు. తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, శ్రీనివాసరావుతో కలిసి మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. 


ప్రజలు కోసం పోరాటాలకు సిద్ధం


రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై భవిష్యత్‌లో చేపట్టే పోరాటాలను ఇకపై కలిసి కట్టుగా చేయనున్నట్టు షర్మిలా రెడ్డి ప్రకటించారు. సీపీఎం, సీపీఐ పార్టీలతో కలిసి ప్రభుత్వంపై పోరాటాన్ని సాగిస్తామన్నారు. గతంలోనే రాష్ట్రంలో పొత్తు పెట్టుకోవడంపై సీతారాం ఏచూరితో చర్చించినట్టు ఆమె తెలిపారు. తనకు ఇరు పార్టీలు సంఘీభావం తెలపడంతోపాటు కలిసి పోరాటం చేద్దామన్నారని, అందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో తెలుగుదేశం, వైసీపీ.. కేంద్రంలోని బీజేపీకి బీ టీమ్‌లుగా ఉన్నాయని, కాబట్టి తామంతా కలిసి కట్టుగా పోరాటం చేయకపోతే పెద్ద పర్వతాలను దించడం అసాధ్యమన్నారు. రెండు పార్టీలతో కలిసే భవిష్యత్‌లో కార్యక్రమాలను నిర్వహిస్తామని షర్మిల వెల్లడించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. యువత సమస్యలపై ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీలు పోరాటం చేస్తున్నాయని, తాజాగా మెగా డీఎస్సీ కోరుతూ తాను చేసిన నిరసనకు వాళ్లు సంఘీభావాన్ని తెలియజేశారని, మరోసారి మద్ధతు ప్రకటించేందుకు వచ్చినట్టు షర్మిల తెలియజేశారు. 


ఖర్గే సభకు ఇరు పార్టీలకు ఆహ్వానం


ఈ నెల 26న ప్రజా సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వ్యంలో అనంతపురంలో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నామని, ఈ సభకు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారన్నారు. ఈ సభకు సీపీఐ, సీపీఎం పార్టీలు కూడా హాజరుకావాలని ఈ సందర్భంగా షర్మిల ఇరువురు నేతలను ఆహ్వానించారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో కలిసి కట్టుగా ఒకో ఫోర్స్‌లా తయారు కావాలని నిర్ణయించామన్నారు. లేకపోతే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీని కొట్టడం కష్టమని, అందుకే కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. పొత్తులపై చర్చలు జరగలేదంటే అబద్దాలు చెప్పినటట్టు అవుతందని, చర్చలు జరుగుతున్నాయని షర్మిల స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేసినప్పుడు.. కలిసి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదన్నారు. వీలైనంత వరకు ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ.. ప్రజాప్రతినిధులను తయారు చేసే దిశగా పొత్తులు ఉంటాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ 2014 అధికారంలోకి వచ్చి ఉంటే అప్పుడే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉండేదని పీసీసీ ప్రెసిడెంట్‌ షర్మిల స్పష్టం చేశారు.