Telangana DSC Supplementary Notification: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ముందడుగు పడింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు డీఎస్సీ (DSC Notification) అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈమేరకు పదవీ విరమణ చేయనున్న ఉపాధ్యాయుల వివరాలు సేకరిస్తోంది. ఈ సంవత్సరం మొత్తం 3,800 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి వీరంతా 2021లోనే పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రిటైర్‌మెంట్ వయసును మూడేళ్లు పెంచిన నేపథ్యంలో ఇప్పటి వరకు పనిచేస్తున్నారు. మార్చి నెలాఖరు నుంచి పదవీ విరమణలు ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాల్సి ఉండటంతో పాఠశాల విద్యాశాఖ ఆయా గణాంకాలను సేకరించింది.


గతేడాది ఆగస్టులో 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఖాళీల సంఖ్యను పెంచి 'మెగా డీఎస్సీ' చేపట్టాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే పాత నోటిఫికేషన్‌కు సుమారు మరో 5 వేల ఖాళీలను కలిపి అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లల(CWSN)కు బోధించేందుకు దాదాపు 1,500 స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే పనిచేస్తున్న వారికి పదోన్నతులు తదితర వాటిపై ప్రభుత్వం నుంచి తుది నిర్ణయం రావాల్సి ఉంది. మొత్తానికి ముఖ్యమంత్రి వద్ద మరోసారి చర్చించి తుది ఆమోదం పొందాల్సి ఉందని.. తాము అంతా సిద్ధం చేసి ఉంచామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.


అత్యధిక పదవీ విరమణలు హైదరాబాద్‌లో.. 
ఈ ఏడాది అత్యధికంగా హైదరాబాద్‌లో 370 మంది టీచర్లు రిటైర్ కానున్నారు. మేడ్చల్‌లో-260, ఖమ్మం-240, రంగారెడ్డి 210, సంగారెడ్డి-200, నిజామాబాద్‌లో-190 మంది ఉన్నారు. అతి తక్కువగా నారాయణపేటలో 40 మంది రిటైర్ కానున్నారు. రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1.22 లక్షలు కాగా... ప్రస్తుతం 1.03 లక్షల మంది పనిచేస్తున్నారు. అంటే పనిచేస్తున్న వారిలో ఈ సంవత్సరం 3.7 శాతం మంది రిటైర్ కానునున్నారు. మార్చి నెలాఖరులో 360 మంది పదవీ విరమణ చేయనుండగా.. జూన్‌లో అత్యధికంగా 700 మంది విశ్రాంత ఉపాధ్యాయులుగా మారనున్నారు. పదవీ విరమణ చేయనున్న మొత్తం ఉపాధ్యాయుల్లో 80 శాతానికిపైగా పురుషులే ఉన్నారు. ఇప్పుడు రిటైర్ అవుతున్నవారంతా 30 సంవత్సరాల కిత్రం నియమితులైనవారే ఉన్నారు. 


ALSO READ:


ఈడీసీఐఎల్‌లో 100 టీచింగ్ పోస్టులు, ఎంపికైతే నెలకు రూ.రూ.1.40 లక్షల వరకు జీతం
ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (EDCIL), భూటాన్ ప్రభుత్వం తరఫున కాంట్రాక్ట్ ప్రాతిపదికన పీజీటీ (PGT) టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత సబ్జెక్ట్‌లో బీఈడీ/పీజీ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఫిభ్రవరి 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. షార్ట్‌లిస్ట్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ, ఫిజికల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపికలు చేపడతారు. ఉద్యోగాలకు ఎంపికైనవారు విధిగా భూటాన్‌ దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...