Skill Development Courses: ఉపాధి హామీ కూలీల కోసం ఏపీ ప్రభుత్వం సరికొత్త పథకంతో ముందుకొచ్చింది. ‘ఉన్నతి’ పేరుతో ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ఉపాధి కూలీలు 'మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(MGNREGA)'లోని అర్హులైన కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈమేరకు.. ఉపముఖ్యమంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు, సిబ్బంది శిక్షణపై కూలీలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. కూలీల కుటుంబాలు దీర్ఘకాలం ‘ఉపాధి’పైనే ఆధారపడకుండా నైపుణ్యం కలిగిన వృత్తుల్లో ప్రవేశించి అన్ని రంగాల్లో ముందుకు సాగేలా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ఎవరు అర్హులు?
ఈ నైపుణ్య శిక్షణలో చేరడానికిగాను గత ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల పనిదినాలు పూర్తి చేసిన కుటుంబ సభ్యులు మాత్రమే అర్హులు. అదేవిధంగా పదో తరగతి ఉత్తీర్ణులై, 18-45 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు శిక్షణకు అర్హులు.
31 రంగాలు.. 215 కోర్సులు..
రాష్ట్రంలో ప్రత్యేకంగా ఉపాధి హామీ కుటుంబాల కోసం రూపొందించిన ఈ ఉన్నతి స్కిల్ డెవలప్ ప్రోగ్రామ్ మొత్తం 31 రంగాల్లో 215 కోర్సులపై శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో మార్కెటింగ్, ఎలక్ట్రిక్ అసెంబ్లింగ్, పీసీబీ ఆపరేటింగ్, ఏరోస్పేస్-ఏవియేషన్, వ్యవసాయం, బ్యాంకింగ్ వంటి రంగాలు ఉన్నాయి.
శిక్షణ కాలంలోనూ కూలీ..
ఏదైనా ఉపాధి కోర్సుల్లో చేరిన కూలీల కుటుంబీకులకు 3 నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ కాలంలో రోజుకు రూ.300 చొప్పున 90 రోజులకు రూ.27,000 చెల్లిస్తారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా ఈ మొత్తాన్ని ఇవ్వనున్నారు.
ALSO READ:
➥ ఏపీ డీఎస్సీపై కీలక ప్రకటన -అందుకే నోటిఫికేషన్ ఆలస్యమన్న మంత్రి లోకేష్
➥ పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు-రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలుసా?
➥ స్థానిక భాషల్లో వైద్య విద్య - ప్రధాని మోదీ కీలక ప్రకటన