CBSE Syllabus Reduced: విద్యార్థులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) బోర్డు శుభవార్త తెలిపింది. సీబీఎస్ఈ 10, 12వ తరగతులకు సంబంధించిన అన్ని సబ్జెక్టుల సిలబస్‌ను 10-15 శాతం తగ్గిస్తున్నట్లు తెలిపింది. విద్యార్థులపై విద్యాభారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనివల్ల విద్యార్థులకు సబ్జెక్టుల్లో ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ మేరకు భోపాల్ ప్రాంతీయ అధికారిక వికాస్ కుమార్ అగర్వాల్ సీబీఎస్‌ఈ ప్రిన్సిపల్స్ సమావేశంలో వెల్లడించారు. విద్యార్థులు కోర్ మెటీరియల్‌పై దృష్టి కేంద్రీకరించడం ద్వారా విద్యాభ్యాసాన్ని మెరుగుపరచడమే సిలబస్ తగ్గింపు లక్ష్యం అని అగర్వాల్ వివరించారు. దీని వల్ల విద్యార్థులు తమ సబ్జెక్టులపై మరింత లోతుగా పట్టు సాధిస్తారని ఆయన అన్నారు.
సిలబస్ సర్దుబాటు అనేది విద్యార్థుల నిరంతర అభ్యాసానికి మద్దతునిస్తుందని, విద్యా సంవత్సరంలో విద్యార్థులు తమ అవగాహనను ప్రదర్శించడానికి మరిన్ని అవకాశాలను అందిస్తుందని అగర్వాల్ చెప్పారు. ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో విద్యార్థులకు ప్రాజెక్ట్‌లు, అసైన్‌మెంట్‌లు, పీరియాడిక్ పరీక్షలు ఉండనున్నాయి. దీనిద్వారా విద్యార్థుల పురోగతి, సామర్థ్యాలను అంచనావేయవచ్చు.
ALSO READ: స్థానిక భాషల్లో వైద్య విద్య - ప్రధాని మోదీ కీలక ప్రకటన
మూల్యాంకనంలోనూ మార్పులు..
వచ్చే ఏడాది నుంచి సీబీఎస్‌ఈ పరీక్షల మూల్యాకనంలోనూ మార్పులు జరుగనున్నాయని అగర్వాల్ తెలిపారు. సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల విద్యార్థులకు సంబంధించిన తుది గ్రేడ్‌లో ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు 40 శాతం మార్కులు, రాతపరీక్షకు 60 శాతం మార్కులు ఇవ్వనున్నారు ఆయన అన్నారు.
ఫిబ్రవరిలో పరీక్షలు..
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి థియరీ పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి నిర్వహించనున్నారు. అయితే అంతకు ముందే జనవరి 1 నుంచి విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక వింటర్-బౌండెడ్ స్కూల్స్‌లో నవంబరు 5 నుంచే ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. డిసెంబరు 5 వరకు కొనసాగనున్నాయి. థియరీ పరీక్షలకు సంబంధించిన పూర్తిస్థాయి టైమ్-టేబుల్ డిసెంబరులో వెలువడే అవకాశం ఉంది. సీబీఎస్‌ఈ బోర్డు ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన నియమ నిబంధనలతో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs)ను సంబంధిత పాఠశాలలకు పంపింది.
ALSO READ: గేట్ - 2025 పరీక్షల షెడ్యూలు విడుదల, పేపర్లవారీగా తేదీలివే
ఓపెన్-బుక్ పరీక్షలు..
CBSE ఆన్సర్ షీట్ల కోసం డిజిటల్ అసెస్‌మెంట్ సిస్టమ్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.. ఇది కొన్ని సబ్జెక్టుల కోసం ఇటీవలికాలంలో ప్రవేశపెట్టిన విధానం. దీనిద్వారా మూల్యాంకన ప్రక్రియ సామర్థ్యం, పారదర్శకతను మరింత మెరుగుపడుతుంది. అదేవిధంగా విద్యార్థులను క్రిటికల్ థింకింగ్, అప్లికేషన్-బేస్డ్ లెర్నింగ్ వైపు ప్రోత్సహించడం కోసం, విద్యార్థులు ఎంచుకున్న సబ్జెక్టుల్లో ఓపెన్-బుక్ విధానంలో పరీక్షలు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఈ ఫార్మాట్ అమలు చేయబడే సబ్జెక్టులలో ఇంగ్లిష్ లిటరేచర్, సోషల్ సైన్స్ సబ్జెక్టులు ఉన్నాయి. విద్యార్థులు సాధారణంగా పాఠాలను కంఠస్థం చేయడంపై ఆధారపడుతుంటారు. అయితే ఓపెన్ బుక్ విధానంలో పరీక్షల వల్ల విద్యార్థులు పుస్తకాలను రిఫర్ చేయడానికి, జ్ఞానాన్ని విశ్లేషించడానికి, అర్థం చేసుకోవడానికి, వర్తింపజేయడానికి అవకాశం ఉంటుంది.
ALSO READ: పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు-రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలుసా?