కేంద్ర CRPF ప్రభుత్వ ఉద్యోగాల కోసం కేవలం హిందీ, ఇంగ్లీష్ మాధ్యమంలో మాత్రమే పోటీ పరీక్షల నిర్వహిస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు మంత్రి KTR విజ్ఞప్తి చేశారు. తాజాగా విడుదల చేసిన CRPF జాతీయ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌లో కేవలం హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో మాత్రమే పరీక్ష ఉంటుందని స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖలో సూచించారు. CRPF ఉద్యోగ సిబ్బంది నియామకం కోసం చేపడుతున్న ఈ పరీక్షను, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు గుర్తించబడిన అన్ని అధికారిక భాషల్లో నిర్వహించాలని కేంద్రాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు.


నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా కామన్ ఎలిజిబిటీ టెస్ట్


కేవలం హిందీ ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే కేంద్ర ప్రభుత్వ ఉఉ్యోగ పోటీ పరీక్షలను నిర్వహించడం వలన తీవ్రవివక్ష ఏర్పడుతుందని అమిత్ షాకు రాసిన లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియంలో చదవనివారు, హిందీ ప్రాంతాలకు చెందని నిరుద్యోగ యువకులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని లేఖలో తెలిపారు. ఇప్పటికే వివిధ ఉద్యోగాల కోసం అనేక పరీక్షలు నిర్వహించే బదులు, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా కామన్ ఎలిజిబిటీ టెస్ట్ విధానంలో 12 అధికారిక భాషల్లో పరీక్ష నిర్వహించేందుకు కేంద్రప్రభుత్వం గతంలో తీసుకున్న విషయాన్ని కేటీఆర్ లేఖలో గుర్తు చేశారు. అయితే ఈ నిర్ణయం సంపూర్ణంగా అమలు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్, తాజాగా CRPF సిబ్బంది నియామకం కోసం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో హిందీ, ఇంగ్లీష్ మాద్యమాల్లోనే పరీక్ష అంటూ విధించిన పరిమితులను తొలగించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి కేటీఆర్ తీసుకువచ్చారు.


హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్షలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధం


అనేక అధికారిక భాషలు కలిగిన భారతదేశంలో, కేవలం హిందీ వారికి మాత్రమే మాతృభాషలో పోటీపరీక్షలు రాసే అవకాశం ఇవ్వడమంటే, దేశ రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని కేటీఆర్ లేఖలో అభిప్రాయపడ్డారు. దేశంలో రాజభాష అంటూ ఏదీ లేదని, రాజ్యాంగం స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కేంద్రప్రభుత్వం ప్రాంతీయ భాషలను పట్టించుకోకుండా ,కేవలం హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లో ఉద్యోగాల భర్తీ పరీక్షలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు కేటీఆర్. సమాన అవకాశాలు పొందేలా ఈ దేశ ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని CRPF నోటిఫికేషన్ కాలరాస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలన్నింటిని అన్ని గుర్తించబడిన అధికారిక ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని తమ ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందన్న కేటీఅర్, 2020 నవంబర్ 18న కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ కూడా రాశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రాంతీయ భాషల్లో చదువుతున్న కోట్లాది యువకులకు ఎలాంటి వివక్ష, అసమానతలు లేకుండా సమాన అవకాశాలు దక్కేలా CRPF నోటిఫికేషన్‌కు సవరణ చేయాలని కేంద్ర మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు కేటీఆర్.


ప్రతీ తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కులు


CRPF కోసం కేంద్రం కంప్యూటర్‌ బేస్డ్ ప్రశ్నాపత్రాన్ని తయారుచేసింది. ఇందులో భాషకు సంబధించి రెండే రెండు ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి హిందీ, రెండు ఇంగ్లీష్! ప్రతీ తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. పరీక్షకు రెండు గంటల సమయం ఇచ్చారు. నాలుగు సబ్జెక్టులు.. సబ్జెక్టుకు 25 మార్కులు. జనరల్ ఇంటెలిజెన్స్‌ 25 మార్కులు. జనరల్ నాలెడ్జ్ 25 మార్కులు. ఎలిమెంటరీ మాథ్స్ 25 మార్కులు. ఇంగ్లీష్/హిందీ 25 మార్కులు.