మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో సైతం పోరాటం చేస్తారని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎటువంటి చొరవ తీసుకోవడం లేదని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీని విస్మరించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ స్పుత్నిక్‌ కు కల్వకుంట్ల కవిత ఇంటర్వ్యూ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆమె అనేక కీలక విషయాలను మాట్లాడారు.


రాజకీయరంగంలో మహిళల ప్రాతినిధ్యం పెరిగితేనే దేశం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. అధికార పార్టీ బీజేపీ 2014 ఎన్నికల ముందు మహిళా రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, కానీ  అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఇచ్చిన హామీని విస్మరించిందని కవిత విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలని తమ పార్టీ ఎంపీలు తరచూ కేంద్ర ప్రభుత్వంపై డిమాండ్ చేశారని గుర్తుచేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం తమ మాటని, డిమాండుని పెడచెవిన పెట్టిందని ఆమె అన్నారు. తొలిసారి మహిళా రిజర్వేషన్ బిల్లును 1996లో అప్పటి ప్రధాన మంత్రి దేవే గౌడ పార్లమెంట్లో ప్రవేశపెట్టారని, ఆ తర్వాత వచ్చిన ప్రధాన మంత్రులు ఈ బిల్లును ఆమోదించడానికి అనేక ప్రయత్నాలు చేశారని కవిత గుర్తు చేశారు. అయినా మహిళా రిజర్వేషన బిల్లు కోల్డ్ స్టోరేజీలో పడిందని అన్నారు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడానికి ఏ మాత్రం చొరవ చూపలేదని విమర్శించారు. ఆ విషయంలో బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలంటే పార్టీలకు ఒక కమిట్‌మెంట్ ఉండాలని కవిత అభిప్రాయపడ్డారు.


రిజర్వేషన్ కోటాలో కోటా కావాలని కొన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం పెడుతున్నాయని, ఇటువంటి సమస్యలను పరిష్కరించడానికి తమ పార్టీ కేంద్రానికి సూచనలు ఇచ్చిందని కవిత తెలిపారు. ముఖ్యంగా కులగణన చేపట్టి ఓబీసీ జనాభా లెక్కలు తీయాలని తామ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. జనాభా లెక్కలు అందుబాటులో ఉంటే రిజర్వేషన్ల అమలు సులభం అవుతుందని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తమ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటింటి సర్వే నిర్వహించి కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించామని కవిత గుర్తు చేశారు.


ఇదే విషయంపై మార్చి 15న ఢిల్లీలో కవిత రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. దేశంలోని అన్ని పార్టీలు బీజేపీపై ఒత్తిడి తెచ్చి, బిల్లుకు ఆమోదం తెలిపే దాకా పోరాటం అవసరమని సమావేశంలో పాల్గొన్నవారంతా ఏకోన్ముఖంగా చెప్పారు. పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదం కోసం యాక్షన్ ప్లాన్ రూపొందించామని కవిత తెలిపారు.  ప్లాన్‌ A, ప్లాన్ B వ్యూహంతో ముందుకు సాగుతున్నామని ఆమె వివరించారు. ప్రైవేట్‌ బిల్లు, జీరో అవర్‌ వాయిదా తీర్మానంలాంటివి తమ వ్యూహంలో భాగమని అన్నారు.  కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మహిళలు చేసే పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని ఆమ విజ్ఞప్తి చేశారు.