భారతీయ వంటల్లో కూర, బిర్యాని వంటివి రెడీ అవ్వాలంటే కచ్చితంగా ఎర్ర కారం పడాల్సిందే. వివిధ వంటకాల్లో ఉపయోగించే సాధారణ మసాలాగా ఇది మారిపోయింది. ఎర్ర కారం పొడి అయితే పోషకాహార నిపుణులు మాత్రం రోజూ అధిక మొత్తంలో మిరపపొడిని తినవద్దని చెబుతున్నారు. ఎర్రకారానికి బదులుగా పచ్చిమిర్చిని వాడమని సలహా ఇస్తున్నారు. ఎర్ర కారాన్ని అధికంగా తినడం వల్ల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాలు పడతాయని చెబుతున్నారు. ఎవరైతే కారాన్ని అధికంగా తింటారో వారి పొట్టలో పుండ్లు, అల్సర్లు, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ అని హెచ్చరిస్తున్నారు. మిరపపొడికి  కారంగా ఉండే రుచిని ఇచ్చే సమ్మేళనం క్యాప్సైసిన్. ఈ సమ్మేళనం పొట్టలోని పై పొరను చాలా చికాకు పెడుతుంది. మంట పుట్టిస్తుంది. ఇలా తరచూ జరగడం వల్ల ఆ పొర పై పుండ్లు వచ్చే అవకాశం ఉంది.


ఎందుకు హానికరం?
కారం అనేది పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్ల (PAH) మూలం. వీటిని క్యాన్సర్ కారకాలుగా కూడా చెబుతారు. ఏదైనా వస్తువులను కాల్చినప్పుడు ఈ PAH ఉత్పత్తి అవుతాయి. మిరపకాయలను తరచుగా పొగ పెట్టి లేదా పొడిగా మార్చే ముందు ఎండబెట్టడం వంటివి చేస్తారు. అలా చేయడం వల్ల ఆ మిరపకాయల్లో PAHలు అధికంగా ఉంటాయి. మిరపపొడి చేశాక కూడా ఈ PAH అలాగే ఉంటుంది. కారాన్ని అధికంగా తినడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్టు ఇదివరకే కొన్ని అధ్యయనాలు చెప్పాయి. అలాగే కారంలో కాస్త ఉప్పు, పంచదార కూడా కలుపుతూ ఉంటారు. అలాగే ఇతర ప్రిజర్వేటివ్స్ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీటిని అధిక మొత్తంలో తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమే.


కారంతో నిండిన ఆహారాలు తిన్న తరువాత పొట్టలో ఇబ్బందిగా అనిపించడం ఖాయం. గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లెక్స్ వంటివి కూడా ఏర్పడతాయి. కొంతమంది వ్యక్తుల్లో అధిక కారంతో తిన్న ఆహారం వల్ల ఆస్తమా వచ్చే అవకాశం ఉంది. ఇక చర్మ ఆరోగ్యం విషయానికి వస్తే  ఎక్కువగా  కారం కలిపిన ఆహారాన్ని తినేవారిలో చర్మం ఎరుపుగా, పొడిగా మారుతుంది. రోజూ కారాన్ని ఎక్కువగా తినే వారికి పొట్ట క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే దీనివల్ల DNA దెబ్బతినే ఛాన్సులు కూడా ఉన్నాయి. 


కూరలకు మంచి రంగును ఇవ్వడంలో కారం పాత్ర ముఖ్యమైనది. అందుకే ఎంతోమంది ఈ మిరపపొడిని వాడుతూ ఉంటారు. అయితే దీన్ని మితంగా తీసుకుంటే మంచిది. ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. కారానికి బదులుగా పచ్చిమిర్చిని వాడడం అలవాటు చేసుకోండి. 




Also read: బ్లాక్ టీ రోజూ తాగే అలవాటు ఉందా? జాగ్రత్త, గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ







































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.