AP Budget Session 2023 : అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజే గందరగోళం నెలకొంది. తమ నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోంట రెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన తెలిపారు. దీనిపై మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై అధికార పార్టీ సభ్యులు మండిపడ్డారు.
ప్రశ్నోత్తరాల సమయంలో వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతుండగానే... నియోజకవర్గాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆరోపణలు చేశారు. దీనిపై స్పీకర్ తమ్మినేని సీతారాం అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ ఆర్డర్‌లో లేకుంటే బిజినెస్ రన్ చేయలేమని కూర్చోవాలని కోటం రెడ్డిని సూచించారు. తాను రాజకీయాలు చేయడం లేదని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలనే ప్రస్తావిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు.
ప్రశ్నోత్తరాలు సభ్యుల రైట్ అని దాన్ని కాదనలేం అంటూ చెప్పారు స్పీకర్. సమస్యలపై వేరే ఫార్మాట్‌లో ఇస్తే కచ్చితంగా మట్లాడదామంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తాను గాంధీగిరి పద్ధతిలో తాను ఆందోళన చేస్తున్నానంట చెప్పుకొచ్చారు శ్రీధర్ రెడ్డి. ఇంతలో ఇతర సభ్యులు కలుగుచేసుకుంటే స్పీకర్ వారించారు. తామిద్దరం మాట్లాడుకునే సమయంలో వేరే వాళ్ల జోక్యం వద్దని వారించారు. సమస్యలు ఉంటే తనకు లెటర్ రాయాలని.. దాన్ని ప్రభుత్వానికి రిఫర్ చేస్తానంటూ చెప్పుకొచ్చారు స్పీకర్.
తాను ప్రజాస్వామ్యపద్దతిలో ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్తున్నానంటూ కోటం రెడ్డి శ్రీద్ధర్‌రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే శ్రీధర్ రెడ్డి ఆందోళన సభ గ్రహించిందని.. ప్రభుత్వం కూడా స్పందిస్తుందన్నారు. ఒకరి వల్ల మొత్తం సభే ఇబ్బంది పడుతుందన్నారు స్పీకర్. అందుకే సీట్లో కూర్చొని సరైన ఫార్మాట్‌లో తనకు రిప్రజంటేషన్ ఇస్తే కచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అయినా కోటం రెడ్డి వెనక్కి తగ్గలేదు.
ఇంతలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లేచి కోటం రెడ్డి ఇష్యూపై మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం ఉందన్నారు. వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుల వరకు ప్రతి ఒక్కరి వివిధ బాధ్యతలు ఉంటాయన్నారు. సమస్యలు అనేవి ఎక్కడైనా ఉంటాయన్నారు. కాని ఆ సమస్యలు ఏ వేదికపై తీర్చుకోవాలనేది ముఖ్యమన్నారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తీర్మానం ప్రవేశపెట్టే టైంలో వ్యక్తిగత సమస్యలు సభలో ప్రస్తావించడం సరికాదన్నారు. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అంతే కానీ... ఇలాంటి వేదికపై వ్యక్తిగత సమస్యలు ప్రస్తావించడం మంచిది కాదన్నారు.
తర్వాత అంబటి రాంబాబు మాట్లాడుతూ... ఇవాళ ఉద్దేపూరకంగా రగడ సృష్టించాలనే సభకు కోటం రెడ్డి వచ్చారని ఆరోపించారు. సభను ఇబ్బంది పెట్టి ప్రజలను ఆకట్టుకోవాలని దురుద్దేశంతోనే ఈ ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షం తరఫున సభలోకి వచ్చిన శ్రీధర్ రెడ్డి కావాలనే చేస్తున్న ఆటంకాన్ని అనుమతించవద్దని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. సడెన్‌గా శ్రీధర్‌రెడ్డిపై చంద్రబాబుకు, టీడీపీకి ప్రేమ పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేశారు అంబటి. సభా సమయాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు మెప్పు కోసం ప్రయత్నిస్తున్న శ్రీధర్ రెడ్డికి అవకాశం ఇవ్వొద్దని రిక్వస్ట్ చేశారు. అవసరమైతే చర్యలు తీసుకోవాలన్నారు.
తాను ఏం తప్పు చేశానో చెప్పాలని డిమాండ్ చేశారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. అయినా స్పీకర్ శ్రీధర్ రెడ్డికి అవకాశం ఇవ్వలేదు. దీంతో టీడీపీ సభ్యులు కూడా శ్రీధర్ రెడ్డికి సపోర్ట్‌గా ఆందోళన చేశారు. ఈ గందరగోళం మధ్యే ప్రశ్నోత్తరాల సమయాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేశారు స్పీకర్. అయినా శ్రీధర్ రెడ్డి సహా ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. అటు అధికార పక్షం కూడా ఎదురు దాడి ప్రారంభించింది. ఇరు పక్షాలను వారించిన స్పీకర్... ప్రశ్నోత్తరాన్ని కొనసాగించారు.