తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న అగ్ర కథానాయకులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకరు. తొలిసారి ఆయన తన రెమ్యూనరేషన్ ఎంత అనేది రివీల్ చేశారు. జనసేన (Janasena Party) పదవ వార్షికోత్సవ సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.


రోజుకు రెండు కోట్లు
డబ్బులకు ఆశపడే వ్యక్తిని కాదని, తనకు డబ్బులు అవసరం లేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. అవసరం అయితే డబ్బులు ఇస్తానని జనసేన సభలో పేర్కొన్నారు. ''ఈ రోజు ధైర్యంగా చెబుతున్నాను. ఇప్పుడు చేస్తున్న సినిమాకు 22 రోజులు ఇచ్చాను. ఆ సినిమాకు నేను తీసుకునే డబ్బు... రోజుకు రెండు కోట్లు. ఇరవై రోజులు పని చేస్తే దాదాపు 45 కోట్లు తీసుకుంటాను. ప్రతి సినిమాకు అంత ఇస్తారని చెప్పను. కానీ, నా ఏవరేజ్ స్థాయి అది. అది మీరు ఇచ్చిన స్థాయి. మీరు గుండెల్లో పెట్టుకున్న స్థాయి అది. నాకు డబ్బులు అవసరం ఏముంది? నేను సంపాదించుకోలేని డబ్బులా?'' అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 


ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న సినిమా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అందులో ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరో. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాకు పవన్ కళ్యాణ్ రూ. 40 కోట్ల నుంచి రూ. 45 కోట్లు తీసుకుంటున్నారని వినిపించింది. ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ వార్తలు నిజమేనని అర్థమైంది.   కారు యాక్సిడెంట్‌లో మరణించిన యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇవ్వడం అనేది 'వినోదయ సీతమ్' మెయిన్ కాన్సెప్ట్. తెలుగులో భగవంతుని పాత్రను పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. యువకుడి పాత్రలో సాయి ధరమ్ తేజ్ కనిపించనున్నారు.  ఆయన ఈ తరహా పాత్ర చేయడం రెండోసారి. గతంలో 'గోపాల గోపాల'లో మోడ్రన్ శ్రీ కృష్ణుని పాత్ర చేశారు.


సుజీత్ సినిమాకు ఇంకా ఎక్కువా?
ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో 'హరి హర వీర మల్లు', హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రారంభం కానున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలు ఉన్నాయి. ఆ రెండు సినిమాలకు ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సి ఉంది. అయితే... సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించనున్న సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ నటించనున్నారు. ఆ సినిమాకు పవర్ స్టార్ షూటింగ్ డేస్ తక్కువే అట. ఆ సినిమాకు కూడా పవన్ కళ్యాణ్ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోనున్నారట.


Also Read : ఇండియా వచ్చేసిన ఎన్టీఆర్ - హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్


'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustad Bhagat Singh Movie) కోసం పవన్ కళ్యాణ్ సుమారు 60 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోనున్నారని మరో సమాచారం. సుజీత్ సినిమాకు అయితే రోజుకు రెండున్నర కోట్ల రూపాయలు అందుకోనున్నారట. పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న తెలుగు హీరోల రెమ్యూనరేషన్ వంద కోట్ల రూపాయలు చేరుకుందని సమాచారం. అయితే, వాళ్ళు సినిమాకు కేటాయిస్తున్న డేట్స్ ఎక్కువ. వాళ్ళతో కంపేర్ చేస్తే... పవన్ కళ్యాణ్ షూటింగ్ డేస్ తక్కువ. ఆ లెక్కన పవర్ స్టార్ రెమ్యూనరేషన్ ఎక్కువ. 


Also Read బాలకృష్ణ ఒక్కరే మా కుటుంబం - తారకరత్న భార్య సెన్సేషనల్ పోస్ట్