భారతదేశంలో మధుమేహం చాప కింద నీరులా వ్యాపిస్తోంది. 20 ఏళ్ల నుంచి 79 సంవత్సరాలలోపు గల జనాభాలో దాదాపు 9.6% మందిలో మధుమేహం ఉన్నట్టు ఒక అధ్యయనం చెప్పింది. ప్రభుత్వ డేటాలను పరిశీలిస్తే మధుమేహం బారిన పడిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. నిపుణులు చెబుతున్న ప్రకారం దేశంలో మధుమేహ రోగులు పెరగడానికి కారణం వారి ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలే. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే ఆహార పదార్థాలను తినడం ద్వారా ఈ మధుమేహాన్ని అదుపులో ఉంచవచ్చు.  చాలామంది అన్నానికి బదులు గోధుమపిండితో చేసే చపాతీని మాత్రమే ఎంచుకుంటారు. అదే ఉత్తమమైన పిండి అని భావిస్తారు. దానికన్నా కొన్ని పిండి రకాలు మధుమేహలుకు ఎంతో మేలు చేస్తాయి. వాటి జాబితా ఇదిగో. 


అమరాంత్ పిండి
అమరాంత్ అనగానే ఏదో తెలియని రకం అనుకుంటున్నారా? తోటకూర గింజలనే అమరాంత్ సీడ్స్ అంటారు. వీటితో చేసే పిండే అమరాంత్ పిండి. దీనిలో మాంగనీస్ సమృద్ధిగా ఉంటుంది. ఇది గ్లూకోనోజెనిసిస్ ప్రక్రియ ద్వారా చక్కెరస్థాయిలు రక్తంలో పెరగకుండా నియంత్రణలో ఉండేలా చూస్తుంది. అందుకే మధుమేహాన్ని నివారించడానికి నిపుణులు ఈ పిండిని ఎక్కువగా తినాలని సూచిస్తూ ఉంటారు. 


రాగి పిండి 
చిరుధాన్యాల్లో రాగులు కూడా ఒకటి. కానీ రాగి పిండిని వాడే వారి సంఖ్య తక్కువగానే ఉంది. రాగి పిండిని ఎప్పుడూ ఇంట్లో ఉంచుకోవడం ఉత్తమం. ఇందులో ఉండే పాలిఫెనాల్స్, అమైనో ఆమ్లాలు, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది అద్భుత ఔషధం అని చెప్పుకోవచ్చు.  దీన్ని కొంచెం తింటే చాలు పొట్ట నిండిన భావన వస్తుంది. తీపి పదార్థాలు తినాలన్న కోరికను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుంది. 


తెల్ల కొమ్ముశెనగల పిండి (ChickPeas)
మధుమేహం ఉన్నవారికి ఈ పిండి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి మధుమేహం అదుపులో ఉంటుంది. 


హోల్ గ్రైన్ బార్లీ పిండి
ఈ పిండిలో కరిగే ఫైబర్ బీటా గ్లూకాన్ ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా దొరుకుతుంది.  మీ జీర్ణ వ్యవస్థలో చక్కెరను శోషించుకోవడం నెమ్మదించేలా చేస్తుంది. అలాగే వీటి గ్లైసెమిక్ ఇండెక్స్  తక్కువ. కాబట్టి రక్తంలో చక్కెర అమాంతం పెరిగే అవకాశం ఉండదు. 


బాదంపప్పు పొడి
బాదం పప్పులను వేయించి పొడిలా చేసి పెట్టుకుంటే ఎంతో మంచిది. ఇవి గ్లూటెన్ రహిత పిండి. దీనిలో తక్కువ పిండి పదార్థాలు ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్, గుండెకు అవసరమైన ఆరోగ్యమైన కరమైన కొవ్వులు ఈ పిండిలో అధికంగా ఉంటాయి. చాలా తక్కువ దీనిలో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అనే పోషకం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. 


Also read: పుదీనా చట్నీ రుచి కోసం మాత్రమే కాదు, పేగుల ఆరోగ్యం కోసం తినండి


















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.