నిద్ర చాలని రోజున హుషారు తగ్గుతుంది. పనిచేసే సామర్థ్యం తగ్గుతుంది. మధ్యాహ్నం నీరసంగా అనిపిస్తుంది. తలనొప్పి రావచ్చు, ఇలా రకరకాలుగా ఉంటుంది. ఒక్కరోజు నిద్ర చాలకపోతేనే ఇలాంటి పరిణామాలు కనిపిస్తే ఇక దీర్ఘకాలికంగా నిద్రలేమితో బాధపడే వారి గురించి ఏమని చెప్పగలం.
నిద్ర లేమి దీర్ఘకాలంలో చాలా రకాల అనారోగ్యాలకు కారణం కావచ్చని రకరకాల అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్ర లేమి వల్ల బీపీ పెరుగుతుంది, గుండె సమస్యలు కూడా రావచ్చు. డయాబెటిస్ తో బాధ పడుతున్న వారిలో ఆ సమస్య కూడా తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. కేవలం శారీరక అనారోగ్యాలు మాత్రమే కాదు. మెదడు పనితీరు మందగించడం వల్ల పనిసామర్థ్యం తగ్గిపోతుంది. ఒక్కోసారి ఆందోళన, డిప్రెషన్ వంటి తీవ్రమైన మానసిక స్థితులకు కూడా కారణం అవుతాయి.
ఆహారం, వ్యాయామంతో పాటు అత్యవసరమైంది విశ్రాంతి. శరీరానికి, మెదడుకు, మనసుకు పూర్తిస్థాయిలో విశ్రాంతిని ఇచ్చేది నిద్ర. పరిస్థితులతో సంబంధం లేకుండా నిద్ర పోగలగడాన్ని ఒక భోగంగా అభివర్ణిస్తారు. అంత అపురూపమైంది నిద్రంటే. చాలినంత నిద్ర కలిగిన వారు ఆరోగ్యంగా ఉంటారు. ఈ రోజుల్లో చాలామంది తగినంత నిద్రలేక ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా వారు త్వరగా ముసలోళ్లు అయిపోతున్నారని పరిశోధకులు చెబుతున్నారు.
ఒక అధ్యయనం కోసం 429 మందికి వారి వయసును అంచనా వేసేందుకు గాను ఒక సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ చేశారు. వారు ఇచ్చిన రిపోర్టులతో వారి నిద్ర ప్యాటర్న్ ను పోల్చి చూసినపుడు రాత్రి మంచి నిద్ర పొయ్యే వారు వారి అసలు వయసు కంటే 5-8 సంవత్సరాలు తక్కువ వయసును నమోదు చేసుకున్నారట. ఈ అధ్యయనం ప్రకారం ప్రతి నిద్రలేని రాత్రి మూడు నెలల వయసు పెంచుతుందని అంటున్నారు. తరచుగా నిద్రలేని రాత్రులు గడిపే వారు అత్యంత అలసి పోయిన భావనతో పదేళ్ల వయసు పెరిగిపోతున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
స్వీడన్ లోని స్టాక్ హోమ్ కరోలిన్స్కా ఇనిస్టిట్యూట్ కు చెందిన నిపుణులు ఈ అధ్యయనం నిర్వహించారు. నిద్ర అలవాట్లు మానసిక శారీరక వయసును నిర్ణయిస్తాయని వీరు చెబుతున్నారు. నిద్ర లేమి డీఎన్ఏను దెబ్బ తీస్తుంది. అందువల్ల వృద్ధాప్య ప్రక్రియ వేగవంతం అవుతుందని ఇక్కడి అధ్యయనకారులు వివరిస్తున్నారు.
మంచి నిద్రకు కొన్ని చిట్కాలు
- తగినంత వ్యాయామం లేకపోతే నిద్ర సరిగా పట్టకపోవచ్చు. కనుక క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి
- స్క్రీన్ టైం ప్రభావం నిద్ర మీద నేరుగా ఉంటుంది. కనుక అవసరానికి మించి స్క్రీన్ వాడకూడదు.
- రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఒక కప్పు గోరువెచ్చని పాలు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
- నిద్రలేమితో బాధ పడే వారు సాయంత్రం పూట కాఫీ వంటి కెఫిన్ కలిగిన పదార్థాలు తీసుకోవద్దు.
- పొగతాగే అలవాటుకు దూరంగా ఉండాలి.
- నిద్రకు ఉపక్రమించే ముందు ఏదైనా పుస్తకం చదవడం లేదా లేదా మంద్ర స్థాయిలో సంగీతం వినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
- అన్నింటికంటే ముందు ఒత్తిడి తగ్గించుకోవాలి. ప్రశాంతంగా ఉండేందుకు యోగా, మెడిటేషన్ వంటివి ప్రాక్టీస్ చెయ్యడం మంచిది.
Aslo read : అద్భుతం - పంది కిడ్నీతో రోగికి ప్రాణం పోసిన వైద్యులు - ప్రపంచంలో ఇదే ఫస్ట్ టైమ్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.