అవయవ దానం ఎందరో ప్రాణాలను కాపాడుతోంది. అయితే, ఇప్పటికీ చాలామంది రోగులకు అవయవాలు అవసరం అవుతున్నాయి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న రోగులకు అవి దొరకడమే గగనమైపోయింది. ఈ నేపథ్యంలో వైద్య పరిశోధకులు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల ఓ పంది కిడ్నీని మనిషికి విజయవంతంగా అమర్చారు. పంది నుంచి సేకరించిన కిడ్నీకి జన్యుపరమైన మార్పులు చేసి మొదటి సారిగా బతుకున్న మనిషికి అమర్చినట్టు వైద్యులు ప్రకటించారు.
70 ఏళ్ల తర్వాత మళ్లీ అదే హాస్పిటల్‌లో..
మొట్టమొదటిసారి 1954లో మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ లో కిడ్నీమార్పిడి చికిత్స జరిగింది. తిరిగి అదే హాస్పిటల్‌లో సుమారు 70 ఏళ్ల తర్వాత ఒక 62 సంవత్సరాల క్రానిక్ కిడ్నీ డిసీజ్ చివరి దశలో ఉన్న వ్యక్తికి ఈ పంది కిడ్నీలను అమర్చి ప్రాణం పోశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని కూడా అక్కడి వైద్యులు చెబుతున్నారు. అతడికి అమర్చిన పంది కిడ్నీ అతడి శరీరంలో కొంత కాలం పనిచేస్తుందనే భావిస్తున్నారు. మెరుగైన ఫలితాలు కనిపిస్తే.. పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తామంటున్నారు.
ఆర్గాన్ ఫేయిల్యూర్ రోగులకు ఆశలు
స్లేమన్ అనే ఈ కిడ్నీ రోగి 11 సంవత్సరాలుగా చికిత్సలో ఉన్నాడు. చాలా ఏళ్లుగా అతడికి డయాబెటిస్, బీపీ వంటి క్రానిక్ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వాటి దుష్ప్రభావం వల్ల అతడి కిడ్నీలు చెడిపోయాయి. 2018లో మొదటి సారి అవయవ మార్పిడి ద్వారా మానవ దాత నుంచి సేకరించిన కిడ్నీని అమర్చారు. 5 సంవత్సరాల్లో ఆ కిడ్నీ కూడా ఫెయిల్ అవడం వల్ల తిరిగి డయాలసిస్ ప్రారంభించారు.
గతేడాది అతడు కిడ్నీ డిసీజ్ చివరి దశకు చేరుకున్నట్టు నిర్ధారించారు. అప్పుడు డాక్టర్లు పంది కిడ్నీతో మార్పిడి గురించి అతడికి వివరించారు. ఈ సందర్భంగా స్లేమన్ మాట్లాడుతూ.. ‘‘కేవలం నా ప్రాణాలు కాపాడుకోవడం కోసం మాత్రమే కాదు, అవయవ మార్పిడి అవసరమయ్యే అనేక మందికి జీవితం మీద ఆశ కల్పించగల మార్గంగా నేను భావించాను’’ అని తెలిపాడు. ఎన్నో ఏళ్ల కృషి ఇవ్వాళ ఫలవంతం కావడం చాలా ఆనందంగా ఉందని, అవయవ మార్పిడి విధానానికి ఇదొక మైలు కాగలదని.. ఈ సర్జరీకి నాయకత్వం వహించిన సౌత్ వెస్ట్రన్ మెడికల్ సెంటర్ లో సర్జికల్ ట్రాన్స్ ప్లాంటేషన్ చీఫ్ డాక్టర్ ఫార్సియా వాగేఫి మీడియాకు తెలిపారు.
ఇలా జరిగింది
కిడ్నీని ముందుగా పంది నుంచి సేకరించారు. దీన్ని జన్యుపరంగా మానవ శరీరానికి అనుకూలంగా మార్చేందుకు eGenesis Bio అనే సంస్థ జన్యు ప్రక్రియను పూర్తి చేసింది. పంది కిడ్నిని మానవ శరీరానికి అనుకూలంగా మార్చే ప్రక్రియ 1960ల్లోనే ప్రారంభమైందట. మానవ కిడ్నీకి దగ్గర పోలికలు కలిగిన పంది కిడ్నీని మానవ దేహంలోని నిరోధక వ్యవస్థ అంగీకరించే విధంగా తయారు చేయడం అంత సులభమైన విషయం కాదని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఇప్పటి వరకు అవయవ మార్పిడిలో ఉపయోగించే మందులు వాడితే కేవలం నిమిషాల వ్యవధిలోనే కిడ్నీ తిరిగి ఫెయిల్ అవుతుందని వారు చెబుతున్నారు. చివరకు జేనోట్రాన్స్ ప్లాంటేషన్ ఈ కలను నిజం చేసిందని ఈ ప్రాజెక్ట్ లో పనిచేసిన జన్యు నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.