రోజుకు ఆరేడు సార్లు బాత్రూమ్ కు వెళ్లడం సాధారణ విషయమే, ఇది ఒకొక్కరిలో ఒక్కోవిధంగా ఉంటుంద. అదే రాత్రి పదేపదే బాత్రూమ్ కు వెళ్లాల్సి రావడం కాస్త ఇబ్బందికరమైన విషయమే కానీ ఇది కూడా సాధారణమే అని నిపుణులు అంటున్నారు.


రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నపుడు కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చెయ్యడానికి మరింత శ్రమించాల్సి వస్తుంది. ఎక్కువ తీపి పదార్థాలు లేదా పిండి పదార్థాలు కలిగిన ఆహారం తీసుకున్నపుడు ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తే అది టైప్ 2 డయాబెటిస్ సంకేతమని గుర్తించాలి. వెంటనే పరీక్షలకు వెళ్లడం అవసరమవుతుంది.


మూత్రంలో గ్లూకోజ్ ఉందని గ్రహించేందుకు విసర్జన సమయంలో మూత్రం తీపి వాసన వేస్తుందని కూడా సూచిస్తున్నారు. అయితే చాలా మందికి టైప్ 2 డయాబెటిస్ కు సంబంధించిన అవగాహన లేకపోవడం వల్ల లక్షణాలు తెలియక వ్యాధి చాలా ముదిరిపోయేవరకు చికిత్స ప్రారంభించడం లేదని ఎక్స్ పర్ట్స్ ఆందోళన చెందుతున్నారు. చాలా చిన్న మార్పులు మాత్రమే కనిపిస్తాయి. వీటిని గుర్తించడం చాలా కష్టం.


టైప్ 2 డయాబెటిస్ అంటే శరీరంలో పాంక్రియాస్ తయారు చేస్తున్న ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు లేదా తగినంత ఇన్సులిన్ శరీరంలో తయారు కాదు. అందువల్ల గ్లూకోజ్ సంశ్లేషణ సరిగా జరగక రక్తంలో మిగిలిపోతుంది. ఈ సమస్యకు స్థూలకాయం ఒక కారణం కాగా, గుండెపోటు, కొవిడ్ మరణాలు కూడా డయాబెటిస్ వల్ల ఎక్కువవయ్యాయి.


మరి కొన్ని లక్షణాలు



  • తరచుగా దాహంగా ఉండడం

  • తీవ్రమైన అలసట

  • ఎలాంటి ప్రయత్నం లేకుండా బరువు తగ్గడం

  • జననేంద్రియాల వద్ద దురద. లేదా పదేపదే థ్రష్ రావడం, గాయాలు మానేందుకు ఎక్కువ సమయం పట్టడం, లేదా మానకపోవడం.

  • దృష్టి లో అస్పష్టత


ఇలా చాలా సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఏమాత్రం అనుమానంగా అనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకుని నిర్ధారణ చేసుకోవడం అవసరం.


40 సంవత్సరాల వయసు వారైతే తరచుగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పరీక్షించుకోవడం అవసరం. దక్షిణాసియాకు చెందిన వారిలో అయితే 25 సంవత్సరాలు పైబడిన వారు తప్పనిసరిగా తరచు పరీక్షలు చేయించుకోవాలి. దక్షిణాసియా వారికి టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం మరింత ఎక్కువ.


తరచుగా పరీక్షలు చేయించుకోవడం వల్ల ప్రిడయాబెటిక్ స్టేజ్ లోనే తెలుసుకుని జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ప్రీ డయాబెటీస్ అంటే సాధారణ స్థాయి కంటే కాస్త గ్లూకోజ్ స్థాయి ఎక్కువగా ఉన్నప్పటికీ టైప్ 2 పరిగణించేంత గ్లూకోజ్ రక్తంలో ఉండదు. ఈ స్థాయిలో జీవన విధానంలో కొద్ది పాటి మార్పులతో పరిస్థితి మరింత దిగజారకుండా జాగ్రత్త పడవచ్చు.


ప్రిడయాబెటీస్ జాగ్రత్తలు



  • తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవడం

  • క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం

  • తగినంత విశ్రాంతి తీసుకోవడం

  • భోజనంలో తాజా పండ్లు, కూరగాయాల పరిమాణం పెంచడం

  • కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం

  • తీసుకునే ఆహారంలో ప్రొటీన్, పీచుపదార్థాలు ఎక్కువ ఉండేలా జాగ్రత్త పడడం

  • ఒత్తిడికి దూరంగా ఉండడం

  • యోగా, మెడిటేషన్ వంటివి సాధన చెయ్యడం


ఇలా చిన్న మార్పులతో ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆసియా వాసులమైన మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. తరచుగా పరీక్షలు చేయించుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యవంతమైన జీవన విధానం అలవరుచుకోవడం అవసరం.


Also Read: సమంతను కాపాడుతున్న డైట్ ఇదే - ఇలా తింటే అందం, ఆరోగ్యం మీ సొంతం